శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 00:04:50

ప్రయాణంలో పదనిసలు

ప్రయాణంలో పదనిసలు

పీవీ నరసింహారావుకు శాస్త్రీయ సంగీతమంటే మక్కువ. రాగ, తాళ, గతులను గుర్తించేవారు. బాల్యం నుంచే పద్యాలు, పాటలను శ్రావ్యంగా పాడేవారు. త్యాగరాజ కృతులు, జావళీలు అంటే మహా ఇష్టం. ఏ కొంచెం విరామ సమయం దొరికినా కూనిరాగాలు తీసేవారు. 1952లో లోక్‌సభ నామినేషన్‌ వేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి పీవీ తన స్నేహితులు, పలువురు పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. ఆ రెండు రోజుల ప్రయాణంలో తన సంగీతపాటవాన్ని ప్రదర్శించి పీవీ అందరి మన్ననలు పొందారు. పాటలు, పద్యాలను రాగయుక్తంగా పాడి స్నేహితులను ఆనందింపజేయడమే కాదు. ఆశ్చర్యంలో ముంచెత్తారు. అదొక్కటే కాదు పీవీ ఎప్పుడు ప్రయాణించినా  పాటలు పాడుతూ, కూనిరాగాలు తీస్తూ ఉండేవారు. 

ధర్మపురి పాన్‌

పీవీ నరసింహారావు గురుభక్తి పారాయణుడు. తన రాజకీయ గురువు స్వామిరామానంద తీర్థ అంటే ఎంతో ఆదరాభిమానాలను చూపేవారు. ఎంతలా అంటే పీవీ ధర్మపురి పాన్‌ తినేవారు. స్వామిజీ కలవాలనుకున్నప్పుడు పాన్‌ను ఊసిపారేసి.. నోటిని శుభ్రం చేసుకున్న తరువాతనే పీవీ లోపలికి అడుగుపెట్టేవారు.. స్వామిజీ వద్దకు వెళ్లినప్పుడే కాదు కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి, వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానానికి వెళ్లినప్పుడు కూడా పాన్‌ను ఉమ్మేసి నోటిని శుభ్రం చేసుకునేవారు. 

రాజేంద్రప్రసాద్‌ సినిమాలంటే ఇష్టం

పీవీ గంభీరంగా ఉంటారు.. మౌనముని.. ఆయన గురించి ఎవ్వరిని అడిగినా చెప్పే మాటలివి. కానీ, ఆయన హాస్యప్రియుడు. పీవీ రచనల్లో హాస్యం, వ్యంగ్యం ఉంటాయి. రాజకీయాల్లో ఒత్తిడి ఎక్కువైతే ప్రశాంతత కోసం కామెడీ సినిమాలు చూసేవారు. ప్రధానిగా ఉన్నపుడు పని ఒత్తిడికి గురైతే తెలుగులో రాజేంద్రప్రసాద్‌ చిత్రాలు తెప్పించుకొని చూసేవారు. కొంచెంసేపు హాయిగా, మనసారా నవ్వుకోడానికి బాగుంటాయని అనేవారు.


logo