బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 23:39:47

అన్యోన్యం ఆ స్నేహం ఇద్దరు

అన్యోన్యం ఆ స్నేహం ఇద్దరు

పీవీ నరసింహారావు, పాములపర్తి సదాశివరావు ఆప్తమిత్రులు. సిద్ధాంతాలు వేరైనా తుదిశ్వాస విడిచేవరకు వారు కలిసి ముందుకు సాగారు. వారిద్దరిది విడదీయలేని అనుబంధం. స్వార్థబుద్ధి లేని కల్మషరాహిత్యమైన ముత్యాల చెలిమి. పగడాల మైత్రి. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సదాశివరావు కుమారుడు పీవీ నిరంజన్‌రావుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

పీవీతో మీ కుటుంబానికి ఉన్న అనుబంధం ఏమిటి?

1931-32 ప్రాంతంలో  ప్రైమరీ విద్యను వంగరలో ముగించిన తర్వాత 6వ తరగతిలో జాయిన్‌ కావడానికి హన్మకొండలోని  కాలేజియేట్‌ స్కూల్లో పీవీ  చేరారు. ఆ రోజు మధ్యాహ్న భోజనం ముగించి స్కూల్‌ ఆవరణలో వున్న వాటర్‌ట్యాంక్‌ వద్ద నల్లా నీళ్లు తాగుతుండగా,  అప్పుడే అక్కడికి వెళ్లిన మా నాన్న సదాశివరావు యథాలాపంగా ’నీ పేరేంటోయ్‌? అని అడిగారట. ఆ రోజుల్లో ఇంటి పేరుతో సహా పూర్తిపేరు చేప్పే పద్ధతి ఉండేది కాబట్టి పీవీ నా పేరు పాములపర్తి వెంకట నరసింహారావు అని చెప్పారట. దానికి స్పందనగా నాన్న ‘అరె నా పేరు పాములపర్తి సదాశివరావు’ అని చెప్పి ఎంతో సంతోషంతో ఆ సాయంత్రమే పీవీని మట్టెవాడలోని మా ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లోని పెద్దలకు పరిచయం చేయడం, వారి ద్వారా ఇద్దరి మధ్య దూరపు బంధుత్వం ఉందని తెలుసుకున్నారు. 

బాల్యంలో పీవీతో గడిపిన రోజుల గురించి మీ నాన్న సదాశివరావు ఏమని చెప్పేవారు?

పీవీ, సదాశివరావు ఇద్దరూ ఆదివారాల్లో  భద్రకాళి గుట్టలూ, పద్మాక్షమ్మ గుట్ట, సిద్ధేశ్వరాలయం, వరంగల్‌ కోట, వేయిస్తంభాల గుడి మొదలైన స్థలాలకు తిరిగేవారట. ఎప్పుడైనా సినిమాలను చూడటానికి చెరో రూ.5 తీసుకొని హైదరాబాద్‌ పోయేవారట. పాన్‌ బీడా వేసుకొని ‘లైట్‌ హౌస్‌' వంటి ఆనాటి థియేటర్లలో సినిమాలు చూడడం; పబ్లిక్‌ గార్డెన్‌,ట్యాంక్‌బండ్‌, కోఠిలో తిరగడం చేసేవారమని మా నాన్న చెప్పేవారు.  

పీవీ, సదాశివరావు బంధం ఎలా బలపడింది?

మా నాన్న, పీవీది విడదీయలేని అనుబంధం. కాళోజీతో పాటు వారిద్దరూ ప్రఖ్యాత పండితులు గార్లపాటి రాఘవరెడ్డి  ప్రియశిష్యులు. ఆయన పాండిత్య ప్రతిభ అందిపుచ్చుకున్న ఆ ముగ్గురూ మహా మహులే. లబ్ధప్రతిష్టులే. గంటల తరబడి సాగే వీరి సాహిత్య దర్బారుకు వేదిక మట్టెవాడలోని ఫైర్‌స్టేషన్‌ పక్కనున్న ఆ చిన్న సందులోని మా ఇల్లే. ఇంటి పైన ఉన్న చిన్న మేడగది. దానికి మా నాన్న పెట్టిన ముద్దుపేరు బంగ్లా గది. విచిత్రమేమిటంటే ఆ ముగ్గురు శిష్యులవీ మూడు భిన్న సిద్ధాంతాలు. మూడు విభిన్న దృక్పథాలు. మూడు వైవిధ్య జీవన విధానాలు. ఐనా ఆ ముగ్గురి మధ్య కొనసాగింది స్వార్థ బుద్ధిలేని కల్మష రాహిత్యమైన ముత్యాల చెలిమి. పీవీ తన ’ఇన్‌ సైడర్‌ ’ గ్రంథం ముందు మాటలో గురువు గార్లపాటి రాఘవరెడ్డి, మిత్రుడు సదాశివరావు పేర్లను ప్రస్తావించారంటే వారితో ఆయన అనుబంధం ఎంతలా పెనవేసుకున్నదో తెలుసుకోవచ్చు. రాజకీయ ఆలోచనా విధానం తప్పిస్తే సాహిత్యంలో, సంగీతంలో సమగ్ర విశ్లేషణను చేసే సామర్థ్యం కలిగిన జంట మేధావులు పీవీ, సదాశివరావు. ఆ విషయాన్ని ఆనాడే తెలుసుకున్న గురువు రాఘవుడు వారిని ‘జయ- విజయులు ’గా సంబోధించేవారు. పీవీకి సదాశివరావు, కాళోజీ కాకుండా వరంగల్‌లో ఆప్తమిత్రులు ఎవరన్నా ఉన్నారా? అని అడిగితే ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది.  


వారిద్దరు కలిస్తే సంగీత కచేరీనే సాగేదట? 

సినిమాలు, పౌరాణిక నాటకాలు చూసి మెల్లిగా ఇద్దరిలో సంగీతం పట్ల మక్కువ పెరిగిందట. ముఖ్యంగా పీవీ ‘ఏక సంథాగ్రాహి. చూసిన సినిమాల్లోని పాటలను సినిమా చూసి రాగానే వెంటనే ఎంతో రాగయుక్తంగా పాడేవారని  నాన్న సదాశివరావు చెప్పేవారు. కాకతీయ కళాసమితి కార్యక్రమాల్లో  పీవీ అప్పుడప్పుడూ పాల్గొని తబలా వాయిస్తే, సదాశివరావుగారు హార్మోనియంపై అరుదైన రాగాల గమకాల్ని తమ గొంతుతో చూపించేవారట. పీవీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక వారిద్దరు దూరంగావున్నా సంగీత సాహిత్య అభిరుచులను ఎప్పుడూ పంచుకొనేవారు. పీవీ కోరిన సూచనలను తెల్పడానికి ఒక్కొక్కసారి తాను అధ్యయనం చేయడానికి ఆ రోజుల్లో సీఐఈఎఫ్‌ఎల్‌ రిజిస్ట్రార్‌గా వున్న  ప్రొఫెసర్‌ జయశంకర్‌ ద్వారా హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ లైబ్రరీ నుంచి సంబంధిత గ్రంథాలను 25 రోజులకు గానూ తెప్పించుకొనేవారు.

కాకతీయ పత్రిక పుట్టుక, నిర్వహణలో  పీవీ పాత్ర ఏమిటి?

వరంగల్‌ ప్రజా చైతన్య దీపికలుగా కాళోజీ, పాములపర్తి సదాశివరావు ప్రాచుర్యం పొందినవారే. సాహిత్య సంగీత రంగాల్లో  ఉత్సుకత వున్న మా నాన్న సదాశివరావు 1942లో ‘కాకతీయ కళా సమితి’ని నెలకొల్పి ఏటా మూడురోజుల పాటు ‘త్యాగ రాజ మహోత్సవాల’ను నిర్వహించేది. ఆ మూడు రోజులు వరంగల్‌ ప్రజలకు ఒక పండుగ వాతావరణం  వుండేదని అంటారు. రచనా వ్యాసంగంలో ఉత్సుకత ఉండటం వల్ల 1945లో సదాశివరావు అప్పుడప్పుడు ‘కాకతీయ సారస్వత సంకలనం’ పేరుతో నాలుగు పేజీల కరపత్రంలాంటి పత్రికను తీసేవారు. అటు తరువాత కాకతీయ పత్రికను ఒక వారపత్రిక గా 1947లో ప్రారంభించారు.  పత్రికారచన, సంపాదకత్వం సదాశివరావు చూసుకుంటే, అన్నింటికంటే ముఖ్యమైన పత్రిక ఆర్ఠిక పటిష్ఠతలో కీలకమైన చందాదారులను చేర్పించే కార్యభారాన్ని  పీవీ తీసుకున్నారు.

పీవీ అభిమాన సంఘం ఏర్పాటు గురించి..

మా నాన్న సదాశివరావు సూచనలకు అనుగుణంగా అప్పటి రోటరీ గవర్నర్‌, విఖ్యాత వైద్యులు  ఐ వెంకట్రావు అధ్యక్షతన ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌, డాక్టర్‌ సంపత్‌రాజారాం, ముదిగొండ వీరభద్రరావు, ప్రొఫెసర్‌ జే రాఘవేందర్రావు మరికొందరు ప్రముఖులు సభ్యులుగా 1983లో వరంగల్‌లో పీవీ అభిమాన సంఘం ఏర్పడింది. ‘నాయకుడికీ - నియోజకవర్గానికీ ఒక అనుసంధాన కార్యాలయం ఉండాలి. నియోజకవర్గ ప్రజల సమస్యలను నాయకుడి దృష్టికి తీసుకుపోయి వాటి పరిస్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలన్న’ది దాని ముఖ్య ఉద్దేశం. పీవీ 1984లో హనుమకొండ నుంచి కాకుండా రాంటెక్‌ నుంచి గెలవటంతో ఆ అభిమాన సంఘం అదే ఏడాది మూతపడింది. 

ఊహ మీద ఆధారపడను

మొహమాటాలకు పోయి ఏదో అనేయడం, తర్వాత నాలుక కర్చుకొని అబ్బే అలా అనలేదనో, తన మాటలు మీడియా వక్రీకరించిందనో అనడం రాజకీయ నేతలకు పరిపాటి. కానీ పీవీ అలా కాదు. ఒక మాట అన్నా, లేక కాగితం మీద రాసినా నిక్కచ్చిగా ఉండే మనిషి ఆయన. ఇన్‌సైడర్‌ రెండో భాగంలో ప్రధానిగా మీరు గడిపిన ఐదేళ్ల కాలానికి సంబంధించిన చరిత్ర ఉంటుందా అని కవి అఫ్సర్‌ అడిగితే ‘ఉండదు’ అని కుండబద్దలు కొట్టారు. ‘నేను కేవలం జ్ఞాపకం మీదనో, ఊహ మీదనో ఆధారపడనన్న విషయం మీకు అర్థమై ఉండాలి. నేను (ప్రధానిగా) అధికారంలో ఉన్న ఆ ఐదేళ్ల కాలం గురించి రాయాలంటే నాకు ఆ డాక్యుమెంట్స్‌ తప్పనిసరిగా అవసరం. అవి లేకుండా రాయడం వాస్తవికతను, నిజాలను దెబ్బ తీసినట్టు అవుతుంది. నేను ఒక విషయం మాట్లాడుతున్నానంటే ఆ విషయానికి సంబంధించిన ప్రతి వివరం నా దగ్గర ఉండితీరాలి. లేకపోతే మాట్లాడను, రాయను’ అని పీవీ సమాధానం ఇచ్చారు.

భారతి లాంటి పత్రికలు రావాలి

పీవీ ఏ పదవి నిర్వహించినా ఆయన ధ్యాసంతా భాషాభివృద్ధి మీదే ఉండేది. సాహిత్యం గురించే ఆలోచించేవారు. ఒక సందర్భంలో సాహిత్య పత్రిక భారతి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎవరో అలాంటివి తెలుగువారు చదవరు అని వ్యాఖ్యానించారట. దానికి ఆయన ఎంతగానో నొచ్చుకున్నారు. అలా అనడం సరికాదన్నారు. తెలుగులో భారతి, త్రివేణి వంటి సాహిత్య పత్రికల అవసరం ఎంతో ఉందని మరో సందర్భంలో ఆయన అన్నారు. భారతి ఈ శతాబ్దపు తెలుగు ఆస్తి అని, మూతపడిన ఆ పత్రికను తిరిగి తెరిస్తే తెలుగుజాతికి ఎంతో మేలు జరుగుతుందని పీవీ చెప్పారు. ఆత్మ చెడకుండా అనువాదాలు జరగాలని కూడా ఆయన అభిప్రాయం. మరి ఆ పనిని ఎవరు చేయాలి? అంటే ప్రభుత్వ నిధులు పొందే సాహితీ, సాంస్కృతిక సంస్థలు.. పాఠకులు ఉన్నరా లేరా అనే మీమాంసకు పోకుండా గ్రంథాలను ప్రచురించాలని చెప్పారు. 

కంప్యూటర్‌లో అవధానం

పీవీ ఎంత ఆధునికుడో అంత సంప్రదాయవాది. కొత్త మీది వ్యామోహంతో పాతది అంతా చెత్త అనుకోవడం సరికాదని ఆయన గట్టిగా నమ్మేవారు. తెలుగు సాహిత్యంలో పాతకొత్తలను ఔపోసన పట్టిన పీవీకి అవధాన ప్రక్రియ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ధారణశక్తికి, ఏకాగ్రతకు, సృజనాత్మకతకు ఇదొక పరీక్ష. అవధానంలో పాండిత్యంతోపాటు శబ్దాధిపత్యం ఉండాలి. మూడు, నాలుగు వందల సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని పీవీ అభిప్రాయం. తాను ఎక్కడ ఏ పదవిలో ఉన్నా అవధానాలకు మాత్రం క్రమం తప్పకుండా హాజరయ్యేవారు.    ప్రపంచ సాహిత్య చరిత్రలో మరే భాషలో ఇలాంటి ప్రక్రియ లేదని, దానిని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేవారు. కంప్యూటర్‌లో చదరంగాన్ని ప్రవేశపెట్టినట్టుగానే అవధాన ప్రక్రియను కూడా అందులోకి ఎక్కించాలని అభిలషించారు. కంప్యూటర్ల వాడకం తప్పనిసరి అని గట్టిగా వాదించిన నేత ఆయన.  

మౌనస్వామిగా ముద్ర వేశారు

ఏ అంశంపై, ఎవరితో మాట్లాడాలన్నా పీవీ నరసింహారావుకు జంకు ఉండేది కాదు. ఆయనకున్న విషయపరిజ్ఞానం, సంభాషమా చతురత అలాంటివి. ఆయన హాస్య ప్రియత్వం గురించి సమకాలిక మిత్రులు ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకోవడం తెలిసిందే. కాసు బ్రహ్మానందరెడ్డి ఒక సందర్భంలో పీవీని మా బృహస్పతి అని పొగిడారు. మాటరాని మౌనిని అలా ఎవరైనా పొగడుతారా? కానీ ఆయన ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి జాతీయ మీడియా ఆయన మీద ‘పెదవి విప్పని మౌని’ అన్న ముద్ర వేసింది. కార్టూనిస్టులైతే పీవీ అనగానే పెదవులు బిగించిన గంభీరముద్రను ఎంచుకునేవారు. హిందూకేశవ్‌ అయితే ఏకంగా మూతికి జిప్పు వేసుకున్నట్టు చిత్రించారు. ఏదేమైనా ఒకదేశ ప్రధాని పిచ్చాపాటీ కబుర్లు పెట్టరనే సంగతి ఎవరికీ పట్టలేదు.logo