మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 00:26:22

‘బాబ్రీ’లో పీవీపై నిందలేల?

‘బాబ్రీ’లో పీవీపై నిందలేల?

‘బాబ్రీ మసీదు కూల్చివేత.. అప్పటికప్పుడు, ఆకస్మికంగా జరిగిన ఘటన. కట్టడాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతో నిందితులంతా ముందుగానే సమావేశమై ప్రణాళిక రచించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కరసేవకు అనుమతించినందున అక్కడ 144 సెక్షన్‌ కింద ఆంక్షలేవీ విధించలేదు. అప్పుడు లాంఛనప్రాయ కరసేవకు సుప్రీంకోర్టు కూడా ఎలాంటి అభ్యంతరాలు తెలుపలేదు. అందువల్ల నిందితులంతా చట్ట వ్యతిరేకంగా గుమిగూడారనే అభియోగం ఇక్కడ వర్తించదు’.. ఇదీ బాబ్రీ కూల్చివేత కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు వెలువరించిన 2300 పేజీల తీర్పు సారాంశం. బీజేపీ అగ్రనేతలు ఎదుర్కొన్న అభియోగాల్ని కోర్టు కొట్టివేసింది. 

వారు నిర్దోషులు అని నిర్ధారించింది. బాబ్రీ కేసు తీర్పు వెలువడిన తరుణంలో కొన్ని చారిత్రక సత్యాల్ని చర్చించుకోవాల్సిన అవసరముంది. అవకాశవాద రాజకీయాల ఫలితంగా జరిగిన అన్యాయాల్ని గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందులో ముఖ్యమైన విషయం.. బాబ్రీ ఘటనకు సంబంధించి నాటి ప్రధాని పీవీ నరసింహారావుపై మోపిన నిందల గురించి చర్చించుకోవాలి. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పీవీ ప్రేక్షక పాత్ర వహించారని చరిత్రను వక్రీకరించారు.. నిందలు మోపారు. బాబ్రీ విధ్వంసాన్ని నిలువరించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రపతి పాలన విధించో లేక వివాదాస్పద స్థలం కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తెచ్చుకునో, విధ్వంసాన్ని ఆపాల్సి ఉండేదని.. పీవీ అలా చేయలేదని అభాండాలు మోపారు. ఇది వందశాతం అసత్య ప్రచారం. ఎందుకంటే.. నిజానికి అప్పుడు కరసేవకు ముందు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వివాదాస్పద స్థలాన్ని తమ అధీనంలోకి ఇమ్మని కోరింది. లక్షల మంది కరసేవకులు చేరనుండటం వల్ల బాబ్రీ మసీదు కట్టడానికి ముప్పు వాటిల్లే ఆస్కారం ఉందని పిటిషన్‌లో పేర్కొంది.

యూపీలోని బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వాదించింది. బాబ్రీ మసీదుకు ముప్పు ఏమీలేదని, శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. ఆ బాధ్యతను తాము పూర్తిగా నిర్వహిస్తామని, అందులో కేంద్ర ప్రభుత్వ జోక్యం అనవసరం అని నిర్ద్వంద్వంగా తెలియజేసింది. సుప్రీంకోర్టు యూపీ రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఒప్పుకుని.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని నిలువరించింది. అయోధ్యలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నివేదించేందుకు ఓ అధికారిని పరిశీలకుడిగా నియమించింది. ఇక రాష్ట్రపతి పాలన విధించలేదనే విమర్శ గురించి చూద్దాం. రాజ్యాంగం ప్రకారం యూపీలో రాష్ట్రపతి పాలన ఏకపక్షంగా విధించే ఆస్కారం అప్పటికి లేదు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతేనే రాష్ట్రపతి పాలన విధించే వెసులుబాటు ఉంటుంది. డిసెంబర్‌ 5వరకు కూడా సుప్రీంకోర్టు నియమించిన పరిశీలకుడుగానీ, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ సత్యనారాయణరెడ్డిగానీ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగిందనో, కలుగుతుందనో చెప్పలేదు. అలా చెప్పకపోగా.. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాష్ట్రపతి పాలన దిశగా చర్యలు తీసుకుంటే కరసేవకుల్ని రెచ్చగొట్టినట్టు అవుతుందని, అది బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీస్తుందని గవర్నర్‌ తన లేఖలో తెలిపారు. ఒకపక్క సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇంకోపక్క గవర్నర్‌ నకారాత్మక దృక్పథం.. పీవీకి ఆనాడు రాజ్యాంగబద్ధంగా ప్రతిబంధకాలుగా ఉన్నాయి.

బీజేపీ అగ్రనేతలు, సంఘ్‌ పరివార్‌ ప్రతినిధులు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి, కేంద్రానికి హామీ ఇచ్చి కరసేవ ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కౌన్సిల్‌లోనూ నిర్ద్వంద్వంగా అదే మాటను ధ్రువపరిచారు. కరసేవ కేవలం నామమాత్రంగానే ఉంటుందని పదేపదే అన్నారు. కానీ 1992 డిసెంబర్‌ 6న జరిగిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కరసేవ కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన బీజేపీ, సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు బాబ్రీ కట్టడాన్ని కూల్చివేశారు. ఇతర విపక్షాలు, స్వపక్షాల అభియోగం ఏమిటంటే.. బీజేపీ నాయకుల్ని పీవీ ఎలా నమ్మారని. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే నమ్మకం కలిగించింది ఎవరు? గౌరవ పార్లమెంటేరియన్లు. నమ్మకం కలిగించింది ఎవరికి? సుప్రీంకోర్టుకు, నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కౌన్సిల్‌కు, ప్రధానికి. ప్రజాస్వామ్యంలో విపక్షనేతల్ని సుప్రీంకోర్టు, ఎన్‌ఐసీ, ప్రధాని నమ్మడం నేరమా? అందులోనూ సుప్రీంకోర్టు సాక్షిగా జరిగిన అంశమది.

కరసేవకు లక్షల మంది తరలివచ్చారు. వేల మంది కూల్చివేతలో పాల్గొంటున్నారు. అంతా గందరగోళంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా నిలువరించే చర్యకు ఉత్తర్వులు ఇస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయో ఊహించగలమా? మానవత్వం ఉన్న ఏ మతమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా అలాంటి పరిణామాల్ని కోరుకుంటారా? ఏదో ఒకటి చేసి విధ్వంసాన్ని ఆపాల్సి ఉండేదని పీవీపై అభియోగాలు మోపారు. కానీ ఏం చేయాల్సి ఉండెనో విధ్వంసానికి ముందుగానీ తర్వాతగానీ ఎవరూ ఇతమిత్థంగా చెప్పలేదు. ఆనాడు పీవీ చేయగలిగినంతా చేశారు. రాజ్యాంగానికి లోబడి తన విధిని నిర్వర్తించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకారం రాజకీయాల్ని పక్కనపెట్టి ఒక్కసారి ఈ దృష్టికోణంలో చూస్తే.. ఆనాటి కరసేవకుల విధ్వంసక ఉన్మాదం, దొమ్మీ పంథాలో అప్పటికప్పుడు జరిగిన హఠాత్‌ పరిణామంగా భావించాల్సి ఉంటుంది.

పీవీ విషయానికి వస్తే.. ఆయన లౌకికవాది. సర్వధర్మ సమభావం అని నమ్మిన మానవతావాది. ఏ మాత్రం కుట్ర జరిగే అవకాశం ఉన్నా ఆ కుట్రను భగ్నం చేయాలనే ఉద్దేశంతో అన్నివిధాలా రాజ్యాంగపరంగా సాధ్యపడే అన్ని చర్యలూ తీసుకున్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వంగానీ, పీవీగానీ పూర్తిగా నిర్దోషి అని లిబర్హాన్‌ కమిషన్‌ నిర్ద్వంద్వంగా పేర్కొంది. పైగా సీబీఐ ప్రత్యేక కోర్టు అసలు కుట్రే జరగలేదని తేల్చిచెప్పింది. ఆశ్చర్యం ఏమిటంటే.. పీవీపై ఇలాంటి హాస్యాస్పద ఆరోపణలు చేయడమే కాకుండా వాటిని విస్తృతంగా ప్రచారం చేసి ఆయనను ఒక దోషిగా, రాజకీయంగా అంటరానివాడిగా చిత్రీకరించింది కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం. ఓటు బ్యాంకు రాజకీయం ద్వారా లబ్ధి పొందాలని ఆశించి సొంత పార్టీ నాయకత్వమే అసత్యాల్ని ప్రచారం చేయడం విచారకరం. ఏది ఏమైనా.. చరిత్ర ఎవరిని ఎలా గుర్తించాలో అలా గుర్తిస్తుంది. ఎవరు ధర్మానికి కట్టుబడి నిలిచారో, ఎవరు దోషులో, ఎవరికి మకిలి అంటిందో, ఎవరు బురద చల్లారో కాలమే సమాధానం చెప్తుంది. సత్యమేవ జయతే.

పీవీ విషయానికి వస్తే.. ఆయన లౌకికవాది. సర్వధర్మ సమభావం అని నమ్మిన మానవతావాది. ఏ మాత్రం కుట్ర జరిగే అవకాశం ఉన్నా ఆ కుట్రను భగ్నం చేయాలనే ఉద్దేశంతో అన్నివిధాలా రాజ్యాంగపరంగా సాధ్యపడే అన్ని చర్యలూ తీసుకున్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వంగానీ, పీవీగానీ పూర్తిగా నిర్దోషి అని లిబర్హాన్‌ కమిషన్‌ నిర్ద్వంద్వంగా పేర్కొంది. 

(వ్యాసకర్త: పీవీ తనయులు)

పీవీ ప్రభాకర్‌రావు