బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 00:26:22

నర‘సింహుడే’!

నర‘సింహుడే’!

పీవీ మౌనముని అని.. ఆయనది సమస్యలను వెంటనే పరిష్కరించకుండా వాయిదా వేసే స్వభావమని  ఎక్కువగా ప్రచారమయిందిగానీ, ఆయనలోని తీక్షణత ప్రదర్శితమైన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. భూసంస్కరణల అంశానికి వస్తే ముఖ్యమంత్రిగా ఆయన ఇందిరాగాంధీ అజెండాను అమలుచేసి చూపించాలనుకున్నారు. ఆ విషయంలో దూకుడుగానే వ్యవహరించారు. 1972 మే 2 అర్ధరాత్రి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ భూస్వాములకు ఆటంబాంబులా పేలింది. పీవీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. భూస్వాములపై నిఘా పెట్టారు. ప్రత్యక్షచర్య తీసుకోవాల్సి వస్తుందని బెదిరించారు. 

పీవీ రెండు సందర్భాల్లో ఇద్దరు ప్రముఖులతో భూసంస్కరణల అవసరం గురించి తీవ్రంగానే స్పందించారు. ‘ఈ కామందులంతా మర్రిచెట్లలా పెరిగిపోయారయ్యా. వీళ్ల నీడలో ఇంకే చెట్టూ పెరుగకూడదనుకుంటారు. ఇలాంటి మహావృక్షాల్ని పెకలించి, మంచి మొక్కల్ని పెరగనిద్దాం’, ‘భూపరిమితి చట్టం వచ్చి తీరాలి. లేకపోతే రక్తం ఏరులై పారుతుంది’.

ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలోని భూస్వాములంతా కుతకుత ఉడికిపోయారట. అప్పుడు ముఖ్యమంత్రి పీవీ తన సీటు నుంచి లేచి అసెంబ్లీ హాలు ప్రవేశద్వారం దగ్గరికి వెళ్ళి ‘భూసంస్కరణలను సమర్థించేవారంతా శాసనసభలో కూర్చోవచ్చు. మిగతావాళ్ళంతా వెళ్ళిపోవచ్చు’ అంటూ ద్వారం వైపు చూపించారు. అప్పుడు బడాబడా కామందులైన సభ్యులంతా లేచి కేకలు అరుపులతో విరుచుకుపడ్డారు. ఆ బిల్లు చట్టమయ్యాక ఆయనకు వ్యతిరేకులను పెంచింది. అదే సమయంలో ముల్కీ నిబంధనల అంశం వారికి కలిసొచ్చింది. ముఖ్యమంత్రి పదవికి పీవీని సమర్థించిన బ్రహ్మానందరెడ్డి కూడా ఆయనను తప్పించాలనుకున్నారు. రాష్ట్రపతి పాలన అనంతరం పీవీనే ముఖ్యమంత్రిని చేస్తారని భావించినా, ఇందిరాగాంధీ అప్పుడు జలగం వెంగళరావును నియమించారు. ‘వెంగళరావు ఆంధ్రలోని పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టినవాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డాడు. అందుకే ఆయన ఆంధ్రుల్ని కూడా కలుపుకుపోగలడు. ఇంక ఉద్యమం తలెత్తే ప్రశ్న ఉండదు కదా’ అని పీవీ మంత్రివర్గ సహచరుడొకరు వ్యాఖ్యానించారు. భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే వెంగళరావు కారణంగా భూసంస్కరణల వ్యతిరేకోద్యమం చల్లారిపోయింది.

(వినయ్‌ సీతాపతి రాసిన నరసింహుడు పుస్తకం నుంచి)