శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 02:40:14

తైవాన్‌తో స్నేహ సంబంధాలు

తైవాన్‌తో స్నేహ సంబంధాలు

  • మన పీవీ ఘనతలివీ 

పీవీ ప్రధాని అయిన తరువాత ఇజ్రాయెల్‌తో అనుబంధం పెనవేసుకోవడం తెలిసిందే. కానీ తైవాన్‌తో కొన్ని పరిస్థితుల మూలంగా దౌత్య సంబంధాలు నెలకొల్పలేక పోయినప్పటికీ, స్నేహ బంధాన్ని పీవీ ప్రభుత్వం నెలకొల్పగలిగింది. పీవీ వేసిన బాటలో నానాటికీ తైవాన్‌తో సంబంధాలు బలపడుతూనే ఉన్నాయి. చైనాతో సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో తైవాన్‌తో దౌత్య సంబంధాలను నెలకొల్పుకోవాలనే ఒత్తిడి మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్నది. కొన్ని చారిత్రక కారణాల వల్ల ఆనాడు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనానే అసలైన చైనాగా భారత్‌ గుర్తించింది. రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (తైవాన్‌)ను గుర్తించలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతున్నది. కానీ ఒకప్పటి మాదిరిగా తైవాన్‌ను దూరం పెట్టడం లేదు. 

తైవాన్‌ పట్ల భారత్‌ విముఖంగా ఉండటంతో ఆ దేశ విధానం కూడా అదే విధంగా ఉండేది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న  అరుణాచల్‌ ప్రదేశ్‌ను 1987లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంగా మార్చింది. ఈ చర్యను తైవాన్‌ ఖండించింది. తాము మెక్‌ మహాన్‌ రేఖను గుర్తించబోమని తైవాన్‌ దౌత్య ప్రతినిధి పెయి ఇన్‌ టెంగ్‌ 1995లో వ్యాఖ్యానించారు. ఈ స్థాయిలో విభేదాలు పీవీ విధానం వల్ల సమసిపోయాయి. ఆ తరువాత భారత వ్యతిరేక ప్రకటనను తైవాన్‌ ఇప్పటి వరకు చేయలేదు. తైవాన్‌ను అధికారికంగా గుర్తించడం అంత సులభం కాదు. అందువల్ల భారత్‌ క్రమ పద్ధతిలో తైవాన్‌తో అనుబంధాన్ని పెంచుకుంటున్నది. పీవీ ప్రభుత్వ విధానం మేరకు 1995లతో తైవాన్‌లో ఇండియా - తైపేయి అసోసియేషన్‌ ఏర్పాటయింది. దీని ద్వారా రెండు దేశాల మధ్య ప్రభుత్వేతర సంబంధాలు ఏర్పడ్డాయి. వాణిజ్యం, పర్యాటకం, శాస్త్ర సాంకేతికం, పర్యావరణం మొదలైన రంగాల్లో సంబంధాలు నెలకొన్నాయి. ప్రజల మధ్య వ్యవహారాలు పెరిగిపోయాయి. ఇండియా- తైవాన్‌ అసోసియేషన్‌కు దౌత్య వ్యవహారాలు నెరపడానికి, పాస్‌పోర్టులు జారీ చేయడానికి అధికారం కల్పించారు. ఢిల్లీలో తైపేయి ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం ఏర్పాటయింది. ఈ విధంగా తైపేయి, న్యూఢిల్లీలో ఏర్పాటయిన సంస్థల ద్వారా వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు కొనసాగడం మొదలైంది. 

2002లో ఇరు పక్షాలు ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహ, పరిరక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సుంకాల రద్దు ఒప్పందం కూడా కుదిరింది. పరస్పర వాణిజ్య ప్రదర్శనల్లో పాల్గొనడానికి అంగీకారం కుదిరింది. 2007లో తైవాన్‌లోని అతి పెద్ద పార్టీ కోమింగ్‌టాంగ్‌ నాయకుడైన మా ఇంగ్‌ -జేవో భారత్‌ను అనధికారికంగా సందర్శించారు. 2012లో చెన్నైలో తైపేయి ఆర్థిక సాంస్కృతిక కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రం దక్షిణ భారత దేశంలోనే కాకుండా శ్రీలంక, మాల్దీవ్స్‌లో తైవాన్‌ తరఫున వ్యవహారాలు నిర్వహిస్తున్నది. 2019 గణాంకాల ప్రకారం రెండు దేశాల మధ్య ఏడు వందల కోట్ల డాలర్ల మేర వాణిజ్యం సాగుతున్నది. యంత్రసామాగ్రి, ఎలక్ట్రానిక్‌ పరికరాలను తైవాన్‌ నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంటున్నది. ఇప్పటి వరకు ఎనభైకి పైగా తైవాన్‌ కంపెనీలు భారత్‌లో ప్రవేశించాయి. ఈ పరిణామాలన్నీ పీవీ విధానానికి కొనసాగింపే.


logo