మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:34:44

మయన్మార్‌తో మారిన సంబంధాలు

మయన్మార్‌తో మారిన సంబంధాలు

  • మన పీవీ ఘనతలివీ 

పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పడక ముందు పొరుగునే ఉన్న మయన్మార్‌తో సంబంధాలు ఎంత వైషమ్యపూరితంగా ఉండేవో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. మయన్మార్‌లో తిరుగుబాటుదారులకు ఆల్‌ ఇండియా రేడియో ద్వారా భారత్‌ ప్రోత్సాహం ఇస్తుండేది. భారత్‌లో వేర్పాటువాద తీవ్రవాదులకు మయన్మార్‌ ఆశ్రయం ఇచ్చేది. చైనా మాత్రం భారత్‌కు పొరుగునే ఉన్న పాకిస్థాన్‌కు అన్ని విధాలా అండగా నిలిచింది. బంగ్లాదేశ్‌ను కూడా మంచి చేసుకున్నది. శ్రీలంక, మాల్దీవ్స్‌ వరకు తన ప్రాబల్యం పెంచుకుని భారత్‌ను అష్టదిగ్బంధం చేసే క్రమంలో ఉన్నది. ఈ క్రమంలో మయన్మార్‌ను పూర్తిగా తన ఉపగ్రహంగా చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మయన్మార్‌ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరుపుకొని అక్కడి ఓడరేవులో కాంట్రాక్టులు సంపాదించి, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యూహాత్మక కేంద్రంగా మార్చుకోవడం మొదలుపెట్టింది. 

లుక్‌ఈస్ట్‌ పాలసీ ప్రకారం తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలకు మయన్మార్‌ ముఖద్వారంగా ఉంటుంది. రెండు దేశాలకు మధ్య 1643 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది. 25 లక్షల మంది భారతీయులు మయన్మార్‌లో నివసిస్తున్నారు. నాలుగు ఈశాన్య రాష్ర్టాలు మయన్మార్‌ సరిహద్దులో ఉన్నాయి. ఈశాన్య రాష్ర్టాలకు వాణిజ్యానికి, సముద్రతీరానికి మయన్మార్‌ దారి అవసరం. మయన్మార్‌ బంగాళఖాత తీరంలో ఉండి, నికోబార్‌ దీవులకు దగ్గరగా ఉండటం వల్ల భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉన్నది. అందువల్ల మయన్మార్‌తో సత్సంబంధాలను పీవీ కాంక్షించారు. 

పీవీ ప్రధాని అయిన తరువాత పరిస్థితి మొత్తంగా మారిపోయింది. పొరుగునే ఉన్న దేశంతో సత్సంబంధాల ప్రాధాన్యాన్ని పీవీ గ్రహించారు. 1993 నుంచి మయన్మార్‌ పట్ల భారత్‌ విధానం మారిపోయింది. మయన్మార్‌లో పెట్టుబడులు పెట్టడానికి రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. భారత దేశ పబ్లిక్‌ రంగ సంస్థలు ప్రధాన రహదారులు, పైప్‌లైన్లు నిర్మించడానికి రేవులు మెరుగు పరచడానికి కాంట్రాక్టులు లభించాయి. చమురు, సహజవాయువు రంగంలో కూడా భారత్‌ అడుగు మోపింది. దీనివల్ల పలు లాభాలున్నాయి. ఒకటి-  వాణిజ్యపరంగా లబ్ధి పొందడం. రెండు - మయన్మార్‌ వనరులపై చైనా గుత్తాధిపత్యాన్ని తగ్గించడం. మూడు- మన ఇంధన అవసరాలు తీర్చుకోవడం. నాలుగు- పశ్చిమాసియా దేశాలపై శిలాజ ఇంధనాల కోసం ఆధారపడటం తగ్గించడం. మయన్మార్‌కు రక్షణ సామాగ్రి చైనా నుంచే అందుతున్నది. దీంతో మయన్మార్‌ సైన్యానికి శిక్షణ ఇచ్చే బాధ్యత భారత్‌ స్వీకరించింది. ఈశాన్యంలో వేర్పాటువాదులను ప్రోత్సహించడాన్ని మయన్మార్‌ నిలిపివేసింది. 

1992 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు రెండు దేశాల విదేశాంగ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఆగస్టు 11 నుంచి 13 వ తేదీ వరకు మయన్మార్‌ విదేశాంగ శాఖ ఉప మంత్రి భారత్‌ పర్యటించారు. ఆర్థిక, భద్రత, సాంకేతిక రంగాలలో పరస్పర సహకారానికి అంగీకారం కుదిరింది. 1994 నుంచి 96 వరకు ద్వైపాక్షిక సంబంధాలు భారీగా బలపడ్డాయి. మయన్మార్‌ విదేశాంగ శాఖ ఉప మంత్రి పర్యటన 1994లో జరిగినప్పుడు ద్వైపాక్షిక సంబంధాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. పీవీ వేసిన బాటలో ఇప్పటికీ భారత్‌ మయన్మార్‌ ప్రాధాన్యాన్ని గుర్తించి స్నేహాన్ని కొనసాగిస్తున్నది. 


logo