శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 00:51:25

పీవీ | ప్రణబ్‌ సమాంతర రేఖలు

పీవీ | ప్రణబ్‌ సమాంతర రేఖలు

స్వాతంత్య్రానంతరం, దేశ రాజకీయ చరిత్రలో నెహ్రూ కుటుంబానికి చెందిన ఇద్దరు మహనీయుల వ్యక్తిత్వాల గురించి చెప్పుకోవాల్సిన తరుణమిది. అంతేకాదు దేశానికి వారందించిన సేవలను సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలి. వారిలో ఒకరు మన తెలంగాణ ఠీవీగా అభివర్ణింపబడిన పూర్వ ప్రధాని పీవీ నరసింహారావైతే, మరొకరు బెంగాలీ దీప్తిగా భాసిల్లిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.  విశేషమేమిటంటే...పీవీ రాష్ట్రపతి కాబోయి, ప్రధానమంత్రి అయితే..ప్రణబ్‌, ప్రధాని కావాలనుకొని రాష్ట్రపతి అయ్యారు!

పీవీ, ప్రణబ్‌.. ఇద్దరూ సామాన్య మధ్య తరగతి బ్రాహ్మణ వర్గానికి చెందినవారే. పీవీ వయసులో ప్రణబ్‌ ముఖర్జీకంటే పద్నాలుగు సంవత్సరాలు పెద్ద. రాజకీయాలలో దాదాపు 20 సంవత్సరాలు సీనియర్‌! పీవీ ‘వందేమాతరం’ నినాదంతో ఇంటర్‌ తరగతులను బహిష్కరించేనాటికి (1938), ప్రణబ్‌ మూడు సంవత్సరాల బాలుడు!

పీవీకి రాజకీయ నేపథ్యంలేదు. ఆయన పూర్వీకులెవ్వరూ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదు. వారిది భూస్వామ్య కుటుంబం. వ్యవసాయం ప్రధాన వృత్తి. ప్రణబ్‌ ముఖర్జీ తండ్రి కిమదాకింకర ముఖర్జీ. స్వాతంత్య్ర సమరయోధుడు.బిపిన్‌ చంద్రపాల్‌, సుభాష్‌ చంద్రబోస్‌ మొదలగు నాయకులతో కలిసి పని చేశారు. పశ్చిమబెంగాల్‌ భిర్‌భం జిల్లా, మిరాఠి గ్రామానికి చెందిన వీరు 1952 నుంచి 1964 వరకు పశ్చిమబెంగాల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ పార్టీ సభ్యునిగా పని చేశారు. ప్రణబ్‌ ముఖర్జీ తల్లి రాజ్యలక్ష్మి ముఖర్జీ కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సన్నిహితంగా ఉంటూ, రెండు సమాంతర రేఖలవలె సాగిన పి.వి., ప్రణబ్‌ల జీవిత వ్యక్తిత్వాలు బింబ, ప్రతిబింబాలవలె, సారూప్య, వైరుధ్యాలతో సాగిన వైనాన్ని విశ్లేషించుకోవాలి.

పీవీ ఇంటర్‌, డిగ్రీ, లాపరీక్షలో యూనివర్సిటీ ప్రథమునిగా నిల్చినారు. అందివచ్చిన జ్యుడీషియల్‌ ఉద్యోగాన్ని, అభిలషించిన న్యాయవాద వృత్తిని వదలి, రాజకీయాలలో ప్రవేశించా రు.1952 తొలి జనరల్‌ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, 1957 నుంచి 1972 వరకు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ప్రణబ్‌ ముఖర్జీ ఢాకాలో స్కూలు ఫైనల్‌, ఇంటర్‌ చదివి, బీర్‌భంలో ఎల్‌ఎల్‌బీ, కలకత్తా వర్సిటీలో ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌) చదివి, డిప్యూటీ అకౌంట్‌ జనరల్‌(పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌) ఆఫీసులో యూడీసీగా ఉద్యోగం చేసి, బెంగాలీలో వెలువడే ‘దేశేర్‌డెక్‌' (మదర్‌లాండ్‌) పత్రికలోజర్నలిస్టుగా పని చేశారు.

1962లో పీవీ తన మిత్రుడు నూకల రామచంద్రారెడ్డి పట్టుదలవల్ల నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో జైళ్లు, న్యాయశాఖ సహాయమంత్రిగా చేరారు. తదుపరి కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్‌లో దేవాదాయశాఖ, విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ‘బృహస్పతి’గా పేరు గడించారు. తెలంగాణ ఉద్యమం (1969) అనంతరం, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా (1971-73) ఎన్నికై, భూ సంస్కరణ బిల్లును ప్రవేశపెట్టి మొత్తం దేశ దృష్టిని ఆకర్షించాడు.

ప్రణబ్‌ ముఖర్జీ ఎన్నడూ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకోలేదు. అయితే 1962-64 మధ్యకాలంలో పశ్చిమబెంగాల్‌, రెండు, మూడుపర్యాయాలు రాజకీయసంక్షోభాన్నిచూసింది. ఆనాటి ముఖ్యమంత్రి పీసీ సేన్‌, బియ్యంపైన లెవీ విధించి, రాష్ట్ర ఖజానా నింపే ప్రయత్నం చేయడంతో రైతాంగం తిరుగుబాటు చేసింది. నారాయణచంద్ర ఘోష్‌అనే లెక్చరర్‌ విద్యార్థులందరినీ సంఘటితంచేసి ప్రజా ఉద్యమాన్ని నిర్వహించి, బంగ్లా కాంగ్రెస్‌ అభ్యర్థిగా అజయ్‌ ముఖర్జీని 1967 ఎన్నికలలో పి.సి. సేన్‌కు పోటీగా నిలిపి గెలిపించారు. ఆ ఉద్యమంలోవిద్యార్థుల పక్షాన ప్రణబ్‌ముఖర్జీ, అజయ్‌ముఖర్జీకి తోడుగా ఉన్నారు.

1969లో మిద్నాపూర్‌ (పశ్చిమ బెంగాల్‌) లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రణబ్‌ ముఖర్జీ స్వతంత్ర అభ్యర్థి వీకే మీనన్‌ తరఫున ప్రచారం చేసి, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దృష్టిని ఆకట్టుకొన్నారు. ముఖ్యమం త్రి అజయ్‌ముఖర్జీ ప్రతిపాదన మేరకు, ప్రణబ్‌ముఖర్జీని రాజ్యసభ సభ్యునిగా, కాంగ్రెస్‌పార్టీపక్షాన గెలిపించారు. 1969లో మొదలైన ప్రణబ్‌ రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగి, 1975, 81, 93, 99 వరకు నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా గెలుపొందారు.

1973లో ప్రణబ్‌ తొలిసారిగా కేంద్ర పరిశ్రమాభివృద్ధి మంత్రిగా నియుక్తులయ్యారు. అదే సంవత్సరం పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. అయితే పీవీని అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శిగా ఇందిరాగాంధీ నియమించి, ఆయన సేవలను జాతీయ స్థాయిలో తీసుకోవాలన్న సంకేతాన్ని అందించింది.

1973లో పీవీ ప్రణబ్‌ల స్నేహబంధం చిగురించింది. మృధుభాషణ, మితభాషణ, సౌమ్యతలో ఇద్దరికీ పోలికలుండటం, వారి బంధానికి కారణం కావచ్చు. ముఠా రాజకీయాలకు దూరంగా, అధిష్ఠానానికి విధేయంగా ఉండటంతో ఇందిరా గాంధీ ఇద్దరికీ ప్రాధాన్యం ఇచ్చారు.

1977లో జరిగిన లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేక కాంగ్రెస్‌ ఉత్తరాదిన ఓడిపోయినా, దక్షిణాదిన నెగ్గగలిగింది. పీవీ హనుమకొండనుంచి గెలిచి, పార్లమెంట్‌లో ప్రతిపక్ష స్థానంలో కూర్చొన్నారు. 1978లో బ్రహ్మానందరెడ్డితో విభేదాలు వచ్చినపుడు పీవీ ఇందిరాగాంధీని బలపరిచారు.

1980లో జరిగినలోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయంసాధించింది. ఇందిరమ్మ మళ్లీ ప్రధాని అయ్యారు. పీవీని మంత్రిగా నియమించారు. తర్వాత 1982లోప్రణబ్‌ ముఖర్జీకి ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించారు. 

1984లో ఇందిరాగాంధీ మంత్రులశాఖలలో మార్పులు చేస్తూ పీవీకి హోంశాఖను, ప్రణబ్‌కు వాణిజ్యశాఖను కేటాయించారు.  ఇందిర దారుణ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రణబ్‌ రాజకీయ జీవితంలోనూ విషాదమేఘాలు ముసిరాయి. ఆయన ప్రధాని కావడానికి ప్రయత్నిస్తున్నాడన్న ‘చెప్పుడు మాటలు’ విని రాజీవ్‌గాంధీ ఆయన్ని దూరం పెట్టారు. దాంతో ప్రణబ్‌ తీవ్ర మనస్తాపం చెంది, పీవీతో తన బాధ వెలిబుచ్చారు. ఈ ఘటన తాలూకు నిజానిజాల గురించి, ప్రణబ్‌ ‘ది ట్రబులెంట్‌ ఇయర్స్‌ 1980-86’ పుస్తకంలో వివరించారు.

ఇందిరాగాంధీ హత్య జరిగిన సమయంలో ప్రణబ్‌, రాజీవ్‌గాంధీతో కలిసి ఈశాన్య రాష్ర్టాల పర్యటనలో ఉన్నారు. వారు వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులంతా రాజీవ్‌గాంధీని నేతగా ఎన్నుకొని, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని కోరారు. ఆ సమయంలో జైల్‌సింగ్‌ రాష్ట్రపతి హోదాలో విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే ఉప రాష్ట్రపతి ఆర్‌. వెంకటరామన్‌ సమక్షంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలని రాజీవ్‌ అనుచరవర్గం ఒత్తిడి చేసింది. రాష్ట్రపతి వచ్చే వరకు ఆగాలని, రాజ్యాంగ విరుద్ధమని ప్రణబ్‌ ముఖర్జీ వారించడమే పొరపాటయింది. అప్పటికే జ్ఞానీ జైల్‌సింగ్‌, ఇందిరాగాంధీల మధ్య సఖ్యత లేనందున, ఆయన రాజీవ్‌ను ఆహ్వానించకపోవచ్చుననే అనుమానంతో రాజీవ్‌ అనుచరులు, ప్రణబ్‌ను దోషిగా చూపారు. తను ప్రధాని కావడానికి ప్రయత్నం చేస్తున్నాడని, రాజీవ్‌గాంధీ మనసును విషంతో నింపారా ‘పెద్దలు’.

1984లో రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో పీవీకి స్థానం దక్కింది, కానీ ప్రణబ్‌ని విస్మరించడంతో ఆయన పీవీని సంప్రదించారు. కొంతకాలం ఓపికతో మౌనంగా ఉండాలని పీవీ సూచించారు. కానీ ప్రణబ్‌ పార్టీ వీడి రాష్ట్రీయ సమాజ్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. రాజీవ్‌గాంధీకి పీవీ మాత్రం ప్రణబ్‌ ముఖర్జీ గురించి, వీలైనప్పుడల్లా మంచే చెబుతూ వచ్చారని, 1989 నాటికి రాజీవ్‌కు ప్రణబ్‌పట్ల అపోహలు తొలగిపోవడంతో ప్రణబ్‌ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు. పీవీ ప్రణబ్‌ల బంధం ప్రతి సంఘటననూ తట్టుకుంటూ చెక్కుచెదరకుండా కొనసాగింది.

1991లో రాజీవ్‌గాంధీ దారుణ హత్యానంతరం, మళ్లీ ఇందిరమ్మ మరణంనాటి పరిస్థుతులే పునరావృతమయ్యాయి. ఈసారి ప్రణబ్‌, పీవీ నోరెత్తలేదు. పీవీ ఏకంగా మూటాముల్లె సర్దుకొని హైదరాబాద్‌కు చేరారు. సోనియా భజనమండలి ఆమెను నాయకురాలిగా ఉండాలని ఒత్తిడి తెచ్చారు. దుఃఖ తీవ్రతలో ఉన్న ఆమె నిరాకరించింది. దాంతో శరద్‌పవార్‌, అర్జున్‌సింగ్‌, తివారి తమ ప్రయత్నాలు తీవ్రం చేశారు. అయితే పార్టీ నేతగా తమకు ఇష్టమైన అభ్యర్థి పేరును సూచిస్తూ స్లిప్పులను అందించాలని సోనియా సూచించినపుడు పీవీనే ఎక్కువమంది కోరుకున్నారని ప్రణబ్‌ముఖర్జీ తన ఆత్మకథలో, టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రధానిగా పీవీ పనితీరు నిరుపమానమని ప్రణబ్‌ ముఖర్జీ శ్లాఘించారు. మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికశాఖమంత్రిగా తీసుకోవడంలోనే పీవీ వివేకం బయటపడిందని తెలిపారు. అసలు చమత్కారమేమిటంటే 1984లో ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా మన్మోహన్‌సింగ్‌ నియామక పత్రంపై సంతకం చేశారు. తిరిగి మన్మోహన్‌ ప్రధాని అయ్యాక ప్రణబ్‌ మళ్లీ ఆర్థికమంత్రిగా నియమితులయ్యారు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ను ఆర్థికశాఖమంత్రిగా నియమించడాన్ని కొందరు విమర్శించారు. అయితే 1950లోనే అప్పటి ప్రధాని నెహ్రూ, రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ సీడీ దేశ్‌ముఖ్‌ను ఆర్థికమంత్రిగా నియమించారని మళ్లీ నాలుగు దశాబ్దాలనంతరం పీవీకే ఈ ఖ్యాతి దక్కిందని ప్రణబ్‌ 2012లో హైదరాబాద్‌లో ‘ది హాన్స్‌ ఇండియా’ పత్రిక నిర్వహించిన పీవీ మెమోరియల్‌ లెక్చర్‌లో ఉటంకించారు. ఈ సభలో పీవీని ఆయన అభ్యుదయవాదిగా, సంస్కరణశీలిగా అభివర్ణించారు. రాజీవ్‌గాంధీకి దూరమైన తనను పీవీ 1991లో మళ్లీ ఆహ్వానించి, ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌గా నియమించారని, తదుపరి 1995లో విదేశాంగమంత్రిగా బాధ్యతలు అప్పగించారని గుర్తు చేసుకొన్నారు. 


1996లో పీవీని అష్టకష్టాలు చుట్టుముట్టాయి. పలు కోర్టు కేసులను ఒంటటిరిగా ఎదుర్కొని, సుదీర్ఘ పోరాటం చేసి నిర్దోషిగా బయటపడ్డారు. ఈ కాలంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీని కానీ సోనియాగాంధీని కానీ ఎక్కడా పల్లెత్తు మాట అనకుండా సంస్కారాన్ని చూపారు.

1998లో ప్రణబ్‌ ముఖర్జీ సోనియాగాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలవడానికి ప్రధాన భూమిక నిర్వహించారు. దాంతో ఆయనపట్ల సోనియాగాంధీ సానుకూల దృక్పథంతో వ్యవహరించడం ప్రారంభించారు. 2004లో, 2009లోనూ మన్మోహన్‌సింగ్‌ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని గట్టిగా బలపరచారు. ఇందిరమ్మ క్యాబినెట్‌లో చివరివరకు (1984) మంత్రిగా పనిచేసిన 10 సంవత్సరాలకు (1995) పీవీ మంత్రివర్గంలో చోట్టు దక్కించుకొన్న ప్రణబ్‌, మళ్లీ దశాబ్దకాలం తదుపరి మన్‌మోహన్‌ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా స్థానం  నిలుపుకోవడం, ఆయన లౌక్యానికి నిదర్శనం. ఏ స్థానంలో ఉన్నప్పటికీ, పీవీని మాత్రం తన హృదయంలో స్థానమిచ్చిన స్నేహశీలి ప్రణబ్‌. మన్‌మోహన్‌సింగ్‌కు పీవీ జీవిత సాఫల్యం పురస్కారం ఇచ్చిన సందర్భంలో (28.02.2019), ప్రణబ్‌ పీవీని ‘భరతపుత్రునిగా’, దార్శనికునిగా ప్రస్తుతించారు.

2017లో రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ప్రణబ్‌ ముఖర్జీ, 2018లో నాగపూర్‌లో జరిగిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యక్రమానికి హాజరై, ఆ సంస్థ వ్యవస్థాపకులు హెడ్గేవార్‌కు నివాళులు అర్పించారు. ప్రణబ్‌ చర్యను, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు అహ్మద్‌పటేల్‌, జైరాం రమేశ్‌ ప్రభృతులు విమర్శించారు. అంతేకాదు, ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ఠ కూడా ట్విట్టర్‌లో తప్పుపట్టింది.

2019లో బీజేపీ ప్రభుత్వం, ప్రణబ్‌ముఖర్జీకి ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది. ఈ అవార్డు ప్రణబ్‌ నాగపూర్‌ ట్రిప్‌కు ‘రిటర్న్‌ గిఫ్ట్‌' అని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఏది ఏమైతేనేం ప్రణబ్‌ రాజకీయ జీవన ప్రస్థానం అత్యున్నత రాజ్యాంగ పదవితో, అత్యున్నత పురస్కారంతో విజయవంతంగా ముగిసింది.  పీవీ ప్రధానిగా భారతదేశాన్ని, ఒక్క ఆర్థిక సంస్కరణలతోనే కాదు, పలు ఇతర ప్రగతిశీల నిర్ణయాలతో, బంగారు బాటలోకి నడిపారు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు కానీ సరైన అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోయారు. సొంతపార్టీ నిరాదరణకు గురికావడం అత్యంత విషాదపరిణామం. ఇది కాంగ్రెస్‌పార్టీ పీవీకి అందించిన ‘రిటర్న్‌ గిఫ్ట్‌'.

రాజకీయ ప్రస్థానంలో పీవీ నరసింహారావు, ప్రణబ్‌ ముఖర్జీ... ఇద్దరూ సమాంతర రేఖలుగానే సాగిపోయారు. పీవీ కర్మయోగి, అయితే ప్రణబ్‌ రాజయోగి! ఇద్దరూ గొప్పవారే! ఎవరి అదృష్టం వారిది!

పీవీని అటల్‌బిహారీ వాజపేయి ప్రశంసించి ‘కవిరత్న’ అని సంబోధించారు.  ప్రణబ్‌ను నరేంద్రమోదీ మెచ్చుకొని ‘భారతరత్న’ను చేశారు. రాజకీయ గగనాన పీవీ., ప్రణబ్‌లిద్దరూ ధ్రువ నక్షత్రాలే! ఎందుకో గుర్రం జాషువా పద్యం గుర్తుకొస్తున్నది.

రాజు మరణించె  ఒక తార రాలిపోయే కవియు మరణించె  ఒక తార గగనమెక్కె రాజు జీవించె రాతి విగ్రహములందు సుకవి జీవించె ప్రజల నాలుకలయందు!!

ఆసియాదేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశాలకు కృషిచేసి, పాశ్చాత్య దేశాలవైపు కాకుండా ‘తూర్పు వైపు చూడండి’ అని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చిన ఖ్యాతి పీవీకే దక్కిందని ప్రణబ్‌ తెలిపారు.

బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో మాత్రం పీవీని తొలుత నిలదీసిన మాట నిజమేనని, అయితే పీవీ రాజ్యాంగబద్ధమైన కారణాలు, బీజేపీ నాయకుల ధోరణి వివరించాక, పీవీ చర్యలో పొరపాట్లు ఏమీ కనిపించలేదని, తన ఆత్మకథలో వివరించారు ప్రణబ్‌.

డాక్టర్‌  వీవీ రామారావు, 

సాహితీ విశ్లేషకులు

ఆకాశవాణి ప్రయోక్త

9849237663


logo