ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 01:06:32

రాజీవ్‌ వైఫల్యాలపై ‘మౌన’ వ్యాఖ్యానం

రాజీవ్‌ వైఫల్యాలపై ‘మౌన’ వ్యాఖ్యానం

  • మన పీవీ ఘనతలివీ 

వర్తమాన రాజకీయాలపై విశ్లేషణలు చేయడంలో, సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన పీవీ నరసింహారావుకు మించిన సాధికారత మరెవరికి ఉంటుంది? అందులోనూ తాను సీనియర్‌  మంత్రిగా ఉన్న రాజీవ్‌గాంధీ పరిపాలన గురించి! 1984 ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ 400కు పైగా స్థానాలు సాధించింది. కాంగ్రెస్‌ చరిత్రలోనే ఇది అసాధారణ విజయం. దేశ చరిత్రలో మరే పార్టీ ఇంతవరకు సాధించలేదు. ఇందిరాగాంధీ హ త్యానంతరం సానుభూతి పవనాలు వీయడం వల్ల లభించిన ఘన విజయమది. ఇందులో రాజీవ్‌గాంధీ గొప్పతనమేమీ లేదు. రాజీవ్‌ ఐదేండ్ల పాలన తర్వాత 1989 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది. ఐదేండ్లలోనే ఎంత తేడా! రెండు ఫలితాలకు మధ్య ఇంత తేడా ఉండటానికి కారణం ఏమిటి? 

రాజీవ్‌గాంధీ నాయకత్వలోని కాంగ్రెస్‌ పార్టీ పరాజయానికి కారణం ఏమిటనేది పీవీ నరసింహారావు విశ్లేషించారు. 

అకడమిక్‌ దృష్టితో రాసిన ఈ వ్యాసం ‘మెయిన్‌ స్ట్రీమ్‌" పత్రికలో ‘ది గ్రేట్‌ సూసైడ్‌' అనే పేరుతో ప్రచురితమైంది. కానీ వ్యాసకర్త పేరు పీవీ అని కాకుండా ‘కాంగ్రెస్‌ మాన్‌' అని ఉంది. రాజీవ్‌గాంధీ పాలనపై పీవీ రాసిన విమర్శనాత్మక వ్యాసమిది. ఆ తరువాత కాలంలో ‘ఫ్రంట్‌లైన్‌' పత్రిక దీనిని పీవీ వ్యాసం అంటూ పునర్ముద్రించింది. మెయిన్‌ స్ట్రీమ్‌ పత్రిక సంపాదకుడు నిఖిల్‌ చక్రవర్తి వ్యా సకర్త పీవీ కాదని అన్నారు. కానీ ఎవరో చెప్పలేదు. పేరు రహస్యంగా పెట్టడం ఆయన బాధ్య త. ఈ వ్యాసం తాను రాయలేదంటూ పీవీ ఖం డించలేదు. తన సహజమైన మౌనభాషలో ‘అంగీకరించారు’ కావచ్చు. రాజీవ్‌గాంధీ మం త్రివర్గంలో సీనియర్‌ నేతగా తన విద్యుక్త ధర్మా న్ని సమర్థంగా నిర్వహించిన పీవీ, ఒక రాజకీయ విశ్లేషకుడిగా నిర్మొహమాటంగా రాశారు. 

రాజీవ్‌గాంధీ విఫల పాలనను ఈ వ్యాసంలో  పీవీ నిష్పాక్షికంగా వివరించారు.  ఒక నాయకుడిగానే కాకుండా, వ్యక్తిగా కూడా రాజీవ్‌గాంధీ పట్ల పీవీ సదాభిప్రాయం వ్యక్తం చేయలేదు. వర్తమాన రాజకీయాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, సామాజిక పరిస్థితులు దిగజారడానికి రాజీవ్‌గాంధీ పాలనావైఫల్యాలే కారణమని అభిప్రాయపడ్డారు. రాజీవ్‌కు లభించిన ఘన విజయం వ్యతిరేకత ఫలితాలను ఇచ్చిందని పీవీ విశ్లేషించారు. ఈ విజయం ఆయనలో భద్రతా రాహిత్యాన్ని పెంచింది. ఆయన అహంకారంతో, పరిణతి లేకుండా, స్వీయ విధ్వంసకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో హిందూ మతవాద శక్తులు ప్రబలాయి. భిన్న సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనిని ఆ యన నాలుగు తలల రాక్షసిగా అభివర్ణించారు. 


logo