శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 01:37:55

రియోలో వర్ధమాన దేశాల పైచేయి

రియోలో వర్ధమాన దేశాల పైచేయి

  • మన పీవీ ఘనతలివీ 

పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు వాతావరణ మార్పును అరికట్టడానికి ప్రపంచ దేశాలు తీసుకోవలసిన చర్యలపై చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. వాతావరణ మార్పునకు కారణం పారిశ్రామిక దేశాల పరిశ్రమల నుంచి వచ్చిన కార్బన్‌ ఉద్గారాలే. ఇప్పుడు అన్ని దేశాలకు ఒకే నిబంధన అమలు అయితే వర్ధమాన దేశాలు నష్టపోతాయి. అందువల్ల పారిశ్రామిక దేశాలు తమ బాధ్యతను గుర్తించి, తమకు వెసులుబాటు కల్పించాలనేది వర్ధమాన దేశాల వాదన. ఈ 1992 జూన్‌ మూడవ తేదీనుంచి 14 వ తేదీ వరకు బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరిగిన ధరిత్రి సదస్సు ఈ చర్చలలో ఒక మూలమలుపు. ఈ సందర్భంగా రియో డిక్లరేషన్‌ విడుదలైంది. ఈ సదస్సు సందర్భంగా పర్యావరణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలనే వాదన బలపడలేదు. కానీ సూత్రప్రాయంగా కట్టుబడే విధంగా అభివృద్ధి చెందిన దేశాలను ఒప్పించడంలో వర్ధమాన దేశాలు కొంత విజయం సాధించాయి. 

భారత్‌ వర్దమాన దేశాలకు ప్రాతినిధ్య సంస్థ అయిన జీ 77లో భాగంగా పారిశ్రామిక దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించింది. నిబంధనలను పారిశ్రామిక దేశాలు కచ్చితంగా  అమలు చేయాలని కానీ వర్ధమాన దేశాలు మాత్రం స్వచ్ఛందంగా పాఠించవలసి ఉంటుందని జీ 77 వాదించింది. అభివృద్ధి చెందిన దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆర్థిక తోడ్పాటును అందచేసినట్టయితేనే  వర్ధమాన దేశాలు కూడా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయగలవనేది జీ 77 వాదన. ఈ క్రమంలో వర్ధమాన దేశాలు కొంత వరకు విజయం సాధించగలిగాయి. వర్ధమాన దేశాలకు రెండేండ్ల పాటు చర్చలు సందర్భంగా వెసులు బాటు లభించడానికి 1995లో బెర్లిన్‌ ఒప్పందం కుదరడంలో భారత పాత్ర ఉన్నది. ఈ క్రమంలోనే 1997లో క్యోటో ప్రొటోకోల్‌ సాధ్యపడింది. ఈ ఒప్పందాలను అన్నింటినీ అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నది. 

రియో చర్చలు సాగినప్పుడు పీవీ నరసింహారావు ఏ మాత్రం ఆవేశ పడకుండా ఆచితూచి మాట్లాడారు. ఆయన మాటల్లో ఘర్షణ పూరిత వైఖరి లేదు. ‘మనం ఒకే భూగోళంపై నివసిస్తున్నాం. కానీ ఎన్నో ప్రపంచాలలో మనది ఒకటి. భిన్నత్వం గల భూగోళంతో మనం మమేకం కాలేకపోతే మనుగడ సాధ్యం కాదు. ఎంతో మందిని పేదరికంలోకి దింపడం ద్వారా కొందరు సంపన్నులు కాకుండా మనం హామీ ఇవ్వగలగాలి’ అని పీవీ పిలుపునిచ్చారు. పీవీ మెతకగా మాట్లాడినా భారత్‌ అనుసరించిన వైఖరి మాత్రం వర్ధమానదేశాలకు ఇప్పటి వరకు కొంత వెసులు బాటు కల్పిస్తూనే ఉన్నది. 


logo