శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:29:42

అమెరికా పర్యటన అదిరింది!

అమెరికా పర్యటన అదిరింది!

మన పీవీ ఘనతలివీ పీవీ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు చేపట్టగానే సరిపోలేదు. విదేశీ సంబంధాలను మొత్తంగా మార్చవలసి ఉన్నది. పారిశ్రామిక దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించవలసి ఉన్నది. అమెరికాను మంచి చేసుకుంటే పారిశ్రామిక దేశాలతో సంబంధాలు మెరుగు కావడం సులభం. కానీ ఇక్కడ రెండు సమస్యలు ఎదురయ్యాయి. ప్రచ్ఛన్న యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు. అమెరికా ఇంకా ఎక్కడ చిచ్చు పెడుతుందో అనే భయం మూడవ ప్రపంచ దేశాలకు ఉంటుంది. భారత్‌ పరిస్థితి కూడా అదే. అమెరికా కూడా భారత్‌ను ఒకనాటి సోవియెట్‌ యూనియన్‌ మిత్రదేశంగా చూస్తున్నది. విదేశీ పెట్టుబడులను తిరస్కరించే సామ్యవాద వ్యవస్థగా భావిస్తున్నది. ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పటికీ విదేశీ కంపెనీలకు నమ్మకం కలిగించడం అంత సులభం కాదు. మొదట విదేశీ కంపెనీలను మెప్పిస్తే, అమెరికా ప్రభుత్వాన్ని వారే ఒప్పిస్తారు. ఇందుకు పీవీ అమెరికా పర్యటన కీలక ఘట్టంగా మారింది. 

1994 మే 14వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు పీవీ అమెరికా యాత్ర సాగింది. పర్యటనకు మూడు వారాల ముందు నుంచే రోజుకు రెండు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగేవి. అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో సమావేశం లో తలెత్తే ప్రశ్నలను అంచనా వేసుకుని సమాధానాలు రూపొందించుకోవడంపై పీఎంవో, విదేశాంగశాఖ అధికారులతో వారంరోజుల పా టు కసరత్తు జరిగింది. క్షిపణి ప్రయోగాలు మొ దలు టెలికం విధానం వరకు పలు రంగాలలో కొన్ని అనుకూల సూచనలు ఇవ్వాలని అమెరికా విదేశాంగ ప్రముఖుడు స్ట్రోబ్‌ టాల్బాట్‌ కోరారు. క్లింటన్‌ కూడా అనుకూలంగా ఉంటాడని చెప్పారు. భారత్‌కు అనుకూలంగా ఉండే సెనేటర్లు అమెరికాలో లాబీయింగ్‌ జరిపారు. ఏటీ అండ్‌ టీ, కోకాకోలా, ఐబీఎం, జీఈ మొదలైన 26 కార్పొరేట్‌ దిగ్గజాలు ఇండియా ఇంటరెస్ట్‌ గ్రూప్‌ పేర అప్పటికే ఏర్పడ్డాయి. అవి భారత అనుకూల సంకేతాలిచ్చాయి. పీవీ వ్యాపారస్తుల బృందాన్ని వెంట తీసుకుపోవడం అమెరికనులకు బాగా నచ్చింది. ఈషర్‌ సీఈవో సుబోధ్‌ భార్గవ, ఐటీసీ చైర్మన్‌ కేఎల్‌ చుగ్‌, హిందుస్థాన్‌ మోటార్స్‌ అధినేత సి.కె. బిర్లాతో పాటు జి.హెచ్‌. సింఘానియా, రాహుల్‌ బజాజ్‌ వంటి పారిశ్రామిక దిగ్గజాలు పీవీ బృందంలో ఉన్నారు. 

భారత దౌత్యవేత్తలు ప్రణాళికాబద్ధంగా పీవీ యాత్రను నిర్వహించారు. పీవీ మొదట న్యూయార్క్‌, హూస్టన్‌, బోస్టన్‌ సందర్శించి, భారత దేశంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. ఫోర్బ్‌స్‌ 500 జాబితాలోని కంపెనీల పెద్దలతో మాట్లాడారు. ఆర్థిక విధానాలు స్థిరంగా ఉంటాయనే నమ్మకం కలిగించారు.  కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత వాషింగ్టన్‌లో అడుగు పెట్టారు. ఫోర్బ్‌స్‌ మే 23 సంచిక భారత దేశంలో అవకాశాల గురించి కవర్‌ పేజీ కథనాన్ని ప్రచురించింది. ఇంటర్నేషనల్‌ ఎకానమీ పత్రిక ప్రత్యేక వ్యాసాన్ని వెలువరించింది. వ్యాపార రంగంలో ముందడుగు పడటంతో అధ్యక్షుడు క్లింటన్‌ సమావేశానికి ముందే సౌహార్ద పూరిత వాతావరణం ఏర్పడింది. క్లింటన్‌తో భేటీ నిర్ణీత సమయం కన్నా మరో ఇరవై నిమిషాలు ఎక్కువగా సాగింది. అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించాలని అనుకున్న కశ్మీర్‌, మానవ హక్కులు మొదలైనవన్నీ ప్రాధాన్యం కోల్పోయాయి. ఈ పర్యటన భారత అమెరికా సంబంధాలను మొత్తంగా మార్చేసింది. భారత్‌లో అమెరికా పెట్టుబడులు పెరగడమే కాకుండా, రెండు దేశాల మధ్య స్నేహం బలపడ్డది.


logo