ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 11:40:47

పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి : సీఎం కేసీఆర్‌

పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో గల పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ... పీవీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అన్నారు. సంస్కరణల లక్ష్యానికి నిలువెత్తు రూపం పీవీ అని కొనియాడారు.  ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చరాన్నారు. విద్యాశాఖ పేరును హెచ్‌ఆర్‌డీగా మార్చింది ఆయనేనన్నారు. 

విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్‌లో గురుకుల పాఠశాలను ప్రారంభించారు. పీవీ చొరవతో దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలు ప్రారంభమైనట్లు తెలిపారు. జైళ్లశాఖలో అనే సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పీవీ జీవిత ప్రస్థానమంతా సంస్కరణలతో సాగిందన్నారు. తాను నమ్మింది, అనుకున్నది గొప్పగా చెప్పిన వ్యక్తి అన్నారు.  ప్రపంచదేశాలకు ఉత్తమ సందేశాలను ఇచ్చారన్నారు.

భూస్వామ్య వ్యతిరేక పోరాటం చూసి సంస్కరణలు తెచ్చారు. తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణ శీలిగా నిలిచారన్నారు. 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అన్నారు. అటువంటి వ్యక్తిత్వ పటిమను వర్ణించడానికి మాటలు చాలవన్నారు. ప్రధాని పదవి ముఠాలు కట్టి తెచ్చుకోలేదు. ఆయన్ను వరించి వచ్చిందని పేర్కొన్నారు.


logo