బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 02, 2020 , 02:22:36

భారత ‘నవోదయా’నికి ఆద్యుడు

భారత ‘నవోదయా’నికి ఆద్యుడు

ఒక్క పాఠశాల దేశ విద్యాగతినే మార్చేసింది.. దాని ఫలితం ఎంతో మంది గ్రామీణ, పేద విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేసింది.. యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్‌లో స్థాపించిన గురుకుల పాఠశాల దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు బీజం వేసింది. ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు గురుకులాలను స్థాపించగా, ఢిల్లీకి చేరిన ఆయన నవోదయ విద్యాలయాలను తీసుకొచ్చారు. రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పటివరకు ఉన్న విద్యాశాఖను ప్రక్షాళన చేశారు. మానవ వనరుల శాఖగా పేరు మార్చి, ఆ శాఖకు తొలి మంత్రి అయ్యారు. 

1985 సెప్టెంబర్‌ 25 నుండి 1988 జూన్‌ 25 వరకు ఆయన ఆ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలోనే విద్యాసంస్కరణలకు శ్రీకారం చుట్టారు పీవీ. 1986లో కొత్త జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించింది. ఈ విధాన రూపకల్పనలో పీవీది క్రియాశీలక పాత్ర. మహిళలు, ఎస్టీ, ఎస్సీలకు స్కాలర్‌షిప్‌లు, వయోజన విద్య, ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకం, ‘ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డ్‌' పీవీ చేపట్టిన సంస్కరణలే. దూరవిద్య కోర్సులకు కూడా పీవీయే శ్రీకారం చుట్టారు. 1985లో నవోదయ విద్యా సంఘటన్‌ను ఏర్పాటు చేసి, 1986లో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకో జవహర్‌ నవోదయ విద్యాలయాన్ని ప్రారంభించారు. దేశ సమైక్యతకు తోడ్పడేలా, దేశంలోని ఇతర ప్రాంతాల విద్యార్థులు కూడా రాష్ర్టేతర భాషలను నేర్చుకొనేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

- సెంట్రల్‌ డెస్క్‌logo