శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:22

పేదోళ్ల భూమిపుత్రుడు

పేదోళ్ల భూమిపుత్రుడు

అది 1972, ఆగస్టు 30.. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి.. ముఖ్యమంత్రి హోదాలో పీవీ నరసింహారావు అసెంబ్లీలోకి ఎంటరయ్యారు.. పెద్ద నోట్స్‌, కాసిన్ని పత్రాలను చేతపట్టుకొని వచ్చిన ఆయన.. చరిత్రాత్మక భూసంస్కరణల బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు.. ఒక్కసారిగా అక్కడున్న శాసనసభ్యులు, రాష్ట్రంలోని భూస్వాముల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. భూస్వాముల చేతుల్లో వేలాది ఎకరాల భూమి వుండకూడదని ఈ సంచలన బిల్లును ప్రవేశపెట్టారు. 

పేదోళ్లను పెద్దోళ్లుగా మార్చాలన్న దృఢ సంకల్పం, వారి కడుపు నింపాలన్న కోరిక ఆయన్ను భూ సంస్కరణల చట్టంవైపు నడిపించాయి. అందుకే కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా అహోరాత్రులు కష్టపడి పకడ్బందీగా భూసంస్కరణల బిల్లు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేశారు. సొంత పార్టీ నాయకులకు, అధికారులకు తెలిస్తే చట్ట ఉద్దేశం నీరుగారిపోతుందని తానొక్కరే రూపకల్పన చేశారు. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. బిల్లును తేవడానికి ముందే తనకున్న వందల ఎకరాలను తన స్వగ్రామం వంగరలోని పేద ప్రజలకు పంచిపెట్టారు. 

బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతూ భూసంస్కరణలకు రామాయణ కాలంలోనే బీజం పడిందని వ్యాఖ్యానించారు. భూస్వాములకు లాభం చేకూరవద్దన్న ఉద్దేశంతోనే ముందుగా ఆర్డినెన్స్‌ తెచ్చామని, ఎవరి మీద కోపం, ద్వేషం, పగతో ఈ బిల్లు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రకటించారు. సమాజంలోని అసమానతలు తొలగించి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. లక్షలాది ఎకరాల భూమిని షెడ్యూల్‌ కులాల తెగలు, బలహీన వర్గాల వారికి వ్యవసాయం కొరకు పంచాలని పీవీ ఆకాంక్షించేవారు. వ్యవసాయ కూలీలకు ఉజ్వల భవిష్యత్తు కలిగించేందుకు, గ్రామీణ సామాజిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశమే భూసంస్కరణల చట్టం ఉద్దేశమని ఆయన పేర్కొనేవారు. పీవీ తీసుకొచ్చిన ఆ భూసంస్కరణల చట్టం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఒక విప్లవం.
logo