గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:44

ఆర్థిక సంస్కరణల సంచలనం

ఆర్థిక సంస్కరణల సంచలనం

పీవీ పరిపాలన ప్రస్తావనకు రాగానే చెప్పుకునేది ప్రధానిగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలే. ఆర్థిక విధానాల్లో మార్పులు చేయడం, విదేశీ కంపెనీలకు తలుపులు తెరువడం అనేది అనేది రాజీవ్‌ గాంధీ హయాంలోనే మొదలైంది. కానీ పీవీ హయాంలో వచ్చినది భారీ మార్పు. బ్రిటిష్‌ పాలకులు వెళ్ళిపోయిన తరువాత దేశంలో మన దేశ ప్రయోజనాలకు అనుగుణమైన ఆర్థిక వ్యవస్థలను రూపకల్పన చేసే బాధ్యత నెహ్రూ ప్రభుత్వం మీద పడినది. మూడవ ప్రపంచ దేశాలలో స్వదేశీ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం అప్పటికి అనుభవం లేదు. దీంతో నెహ్రూ ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్తల సహాయం తీసుకున్నారు. అనేక మంది ఆర్థిక వేత్తలు మన దేశం చేరి స్వావలంబన గల ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేశారు. ఆ ఆర్థిక వ్యవస్థ స్థానంలో కొత్త ఆర్థిక వ్యవస్థలను నెలకొల్పడం పీవీ హయాంలో ప్రారంభమైంది. 

ఎల్‌పీజీ- సరళీకరణ (లిబరలైజేషన్‌), ప్రైవేటీకరణ (ప్రైవేటైజేషన్‌), ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్‌) పేర ఈ విధానాలు పేరొందాయి. దేశంలోని స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఉన్న లైసెన్స్‌ రాజ్‌ను రూపుమాపడమే ఉదారవాద విధానాల లక్ష్యం. 1993 జూలైలో ఈ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఈ విధానపరమైన మార్పును స్థూలంగా ఆర్థిక సంస్కరణలుగా చెప్పుకోవచ్చు. ఇందులో విత్త సంస్కరణలు, ద్రవ్య ఫైనాన్స్‌ రంగ సంస్కరణలు, పారిశ్రామిక రంగ సంస్కరణలు, వాణిజ్య విధాన సంస్కరణలు, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహమివ్వడం, ఎగుమతి దిగుమతి విధానాల్లో మార్పులు తేవడం వంటి అనేక అంశాలు ఈ ఆర్థిక సంస్కరణలలో అంతర్భాగాలుగా ఉన్నాయి. 

దేశీయంగా పారిశ్రామిక రంగంలో ఉన్న ఆంక్షలను తొలగించడం, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం పట్ల భారత దేశ పారిశ్రామికులలో హర్షం వ్యక్తమైంది. అయితే ఉన్నపళంగా విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా తెరిస్తే తమ సంస్థలు తట్టుకోలేవని వారు అభ్యంతరం చెప్పారు. పీవీ వీరితో సమావేశానికి అంగీకరించారు. వీరు చెప్పిన అభ్యంతరాలన్నీ విన్నారు. కానీ పీవీ ప్రభుత్వ విధానం మాత్రం మారలేదు. పీవీ ప్రభుత్వ వైఖరి దృఢంగా ఉందని దేశీయ వ్యాపార దిగ్గజాలకు అర్థమైంది. వీరికి పీవీ ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు చెప్పే సాహసం లేదు. 

పీవీ ప్రభుత్వం ఏర్పడగానే ఎదుర్కొన్న ప్రధాన సమస్య చెల్లింపుల సమతౌల్యం దెబ్బతినడం. దీనిని పరిష్కరించే క్రమంలోనే మొత్తం ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులను పీవీ ప్రభుత్వం చేపట్టింది. ఈ ఆర్థిక సంస్కరణలలో ప్రధానమైనవి - విత్త సంస్కరణలు, ద్రవ్య ఫైనాన్స్‌ సంస్కరణలు, వడ్డీ రేటు సరళీకరణ, పారిశ్రామిక విధానంలో సంస్కరణలు, వాణిజ్య విధాన సంస్కరణలు, సుంకాల క్రమబద్ధీకరణ, పరిణామాత్మక ఆంక్షల తొలగింపు, విదేశీ పెట్టుబడుల పెంపుదల బోర్డు మొదలైనవి ఉన్నాయి. వ్యవసాయం, రహదారులు, ఇంధనం, నీటిపారుదల, పరిశ్రమలు మొదలైన రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆదాయాలు పెరుగుతాయని, ఉపాధి కల్పన జరుగుతుందనేది సంస్కరణల లక్ష్యాలుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ సంస్కరణలు మన ఆర్థిక రంగ మౌలిక స్వభావాన్ని మార్చివేశాయి. 


logo