బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:20:43

రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు

రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు

పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టగానే 1991 జూన్‌ 22న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన మొదటి ప్రసంగంలోనే మత, భాష, జాతి పరమైన అల్పసంఖ్యాక వర్గాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ అంటే ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఆర్‌పీఎఫ్‌లోనే ఆర్‌ఏఎఫ్‌ పేరుతో ఒక ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేశారు. 

సైనిక విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన దళానికి ‘ప్రెసిడెన్షియల్‌ కలర్స్‌' అవార్డు ఇస్తారు. ఈ అత్యున్నత అవార్డు రావడమంటే ఎంతో గర్వదాయకంగా సైనిక దళాలు భావిస్తాయి. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ తన అసాధారణ సేవలకు ఈ అవార్డును దక్కించుకున్నది. 

1991 డిసెంబర్‌ 11వ తేదీన ఈ రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ విభాగం ఏర్పాటయింది. కలహాలు, ప్రదర్శనలను అదుపు చేయడంతోపాటు విపత్తు సహాయ చర్యలు చేపట్టడం వంటి భిన్న కార్యకలాపాలకు ఈ దళాన్ని వాడుతున్నారు. నిర్దేశిత స్థలానికి అతి వేగంగా చేరుకొని పరిస్థితిని అదుపులోకి తేవడం ఈ దళం ప్రత్యేకత. మన హైదరాబాద్‌ నగరంతో పాటు ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, భోపాల్‌, అలీగఢ్‌, మీరట్‌, జంషెడ్‌పూర్‌, కోయంబత్తూర్‌, అలహాబాద్‌ నగరాలలో ఈ దళాలు అప్రమత్తంగా ఉంటాయి. మహిళా ప్రదర్శకులు ఉంటే వారిని అదుపు చేయడానికి ఆర్‌ఏఎఫ్‌లో మహిళా విభాగం కూడా ఉన్నది. ప్రదర్శకులకు హాని జరగకుండా, మారణాయుధాలు కాకుండా సాధారణ ఆయుధ బలాన్ని ఉపయోగిస్తారు. 


మన దేశంలో వరదలు, భూకంపాలు, తుఫానులు, మహమ్మారులు తలెత్తినప్పుడు రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సేవలు అందించి తన మానవతా పార్శాన్ని చాటుకున్నది. ఐక్యరాజ్య సమితి పనుపున లైబేరియాలో శాంతి స్థాపనకు రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దళాలు వెళ్ళాయి. అందులో మహిళా విభాగం కూడా ఉన్నది. ప్రపంచంలో, శాంతి పరిరక్షణకు తరలిన మొదటి మహిళా విభాగం ఆర్‌ఏఎఫ్‌. 

2008 నవంబర్‌లో ముంబయిలో ఉగ్రవాదం పంజా విసిరినప్పుడు రాఫ్‌ రంగంలోకి దిగి ఒబెరాయి ట్రైడెంట్‌, తాజ్‌మహల్‌ హోటళ్ళ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. 2001లో పార్లమెంటు భవనంపై దాడి జరిగినప్పుడు రక్షణ కల్పించే క్రమంలో ఆర్‌ఏఎఫ్‌ మహిళా బెటాలియన్‌కు చెందిన కమలేశ్‌ కుమారి వీరమరణం పొందారు. ఆమెకు మరణానంతరం అశోక్‌ చక్ర లభించింది.

  • గత ఏడాది నవంబర్‌లో అయోధ్యలోని వివాద స్థలంపై  న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతున్నవేళ.. అయోధ్యలో శాంతి భద్రతల కాపాడటానికి రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌- రాఫ్‌)ను తరలించారనేది ఒక వార్త. 
  • తమిళనాడులోని కోయంబత్తూరులో మత కలహాలు చెలరేగే ప్రమాదం ఉన్నప్పుడు, కేరళలో వరదలు వచ్చిన ప్పుడు, ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు జరిగినప్పు డు అక్కడికి రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను తరలించారు. 


logo