గురువారం 02 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:50:51

పేదలకు 360 ఎకరాల భూమి దానం

పేదలకు 360 ఎకరాల భూమి దానం

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పీవీ నరసింహారావు ఏది చేసినా సంచలనమే.. ఏది చేయకపోయినా సంచలనమే.. మౌనంగా ఉన్నారంటే త్వరలో ఏదో సునామీ ముంచుకొస్తుందనే అర్థం. అందులో ఒకటి భూ సంస్కరణల చట్టం. ఇంట్లో కూర్చొని ఈ చట్టానికి రూపకల్పన చేశారు. చట్టం తెచ్చేకంటే ముందు తన గ్రామంలోని భూమిలేని నిరుపేదలకు, తమ వద్ద పనిచేసే పాలేర్లకు 360 ఎకరాల భూమిని దానం చేసి భూస్వామ్య పద్ధతికి చరమగీతం పాడారు. 

పల్లెల్లో భూమిలేని నిరుపేదలు పడే బాధలను, వారి పేదరికాన్ని దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా పీవీ తన భూమిని దానం చేశారు. ఆ తర్వాతే భూ పరిమిత చట్టాన్ని (ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌)ను తెచ్చి దేశంలో భూ సంస్కరణలకు నాందిపలికారు. ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టేదాకా ఇతరులెవ్వరికీ తెలియకపోవడం గమనార్హం. ‘సీలింగ్‌ చట్టం రాకముందే మాకు మా అయ్యలకు మా దొర (పీవీ నర్సింహారావు) భూములిచ్చిండు’ అని పీవీ ఇంట్ల పాలేరుగా పనిచేసిన రొడ్డ ఓదేలు పేర్కొన్నాడు. ‘రొండెడ్ల నాగలి ఉన్నోడికి, నాగండ్లు దున్నేటోనికి, వాళ్ల ఇండ్లండ్ల (కుటుంబంల) ఎంతమంది ఉన్నారు అని ఇసారిచ్చి దొర మాకు భూములిచ్చిండు’ అని ఆయన పేర్కొన్నాడు. 

‘అందరూ మంచిగ దున్నుకొని బతుకుండ్లి అని మా దొర మాకు ఖరార్‌నామా కాయితాలిచ్చిండు’ అని వెల్లడించాడు. అంతేకాకుండా ఇండ్లు లేనివారికి పీవీ నివాస గృహాల నిర్మాణానికి ఇంటి జాగా ఇచ్చారు. ఆయన ఇందిరా ఆవాస్‌యోజన ద్వారా అందరికీ ఇండ్లు కట్టించారు. ప్రస్తుతం వంగరలో ఉన్న దేవాలయం, పీవీ తనయుడి పేరు (పీవీ రంగారావు) మీద 19.20 ఎకరాల ప్రభుత్వ గురుకుల విద్యాలయం, దీనికి ఎదురుగా ఏడున్నర ఎకరాల స్థలంలో పీవీ స్మృతివనం, వంగర పోలీస్‌ స్టేషన్‌ ఇలా అన్నీ పీవీ భూముల్లోనే ఉండటం విశేషం. 
logo