గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:21

రాజకీయ అపరిచితుడు

రాజకీయ అపరిచితుడు

పీవీ నరసింహారావు తన రాజకీయ జీవితంలో కుట్రలు చేయలేదు.. కుతంత్రాలు చేయలేదు.. తనకంటూ వర్గం లేదు.. పార్టీలో గొప్ప స్థాయిలో అభిమానించే వ్యక్తులు లేరు.. అయినా రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగానే ప్రజలకు తెలిసిన ఆయన.. రాజకీయ ఉద్ధండుడని పెద్దగా తెలియదు. వాస్తవానికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి పదవులు చేపట్టినవాళ్లంతా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కానీ,దేశంలోని కీలక పదవులనుచేపట్టిన పీవీకి రావాల్సిన పేరు మాత్రం రాలేదు. అందుకే ఆయన అపరిచితుడు. 

1957లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన పీవీ.. ఏ శాఖకు మంత్రి అయినా తన మార్కు చూపించేవారు. ప్రజలు కోరిన సేవ చేయాలంటే సంస్కరణలు చేయాల్సిందేననేవారు. కులపరంగా రాజకీయబలం లేకున్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించి వాటికే వన్నె తెచ్చారు. కేంద్రంలో విద్యాశాఖను సమూలంగా మార్చేసి మానవ వనరుల శాఖగా రూపం ఇచ్చి కొత్త విద్యావ్యవస్థకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలోనూ పలు మంత్రిత్వ శాఖలు చేపట్టి కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక, సన్యాసిగా జీవితం ప్రారంభిద్దామనుకున్న తరుణంలో ఆకస్మాత్తుగా ప్రధానమంత్రి పదవి ఆయన్ను ఆహ్వానించింది. 

వచ్చీరాగానే ఆర్థిక సంస్కరణలు చేపట్టి సరికొత్త విప్లవానికి తెరతీశారు. ప్రైవేటు రంగానికి తలుపులు తెరిచి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అయినా.. పీవీ నరసింహారావు అంటే ఈ తరానికి ఎక్కువగా పరిచయం లేదు. ఎందుకంటే ఆయన ప్రచారాన్ని కోరుకోలేదు. తనను కీర్తించాలని పార్టీ శ్రేణులను ఆదేశించలేదు. ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని సృష్టించుకోలేదు. దాంతో ఆయన గురించి మిగతా ప్రధానులకంటే ఎక్కువగా తెలియకుండా పోయింది. అందుకే ఆయన రాజకీయ అపరిచితుడు.logo