బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:17

పేద బీసీల కోసం ఎన్‌బీసీ ఎఫ్‌డీసీ సృష్టికర్త పీవీ

పేద బీసీల కోసం ఎన్‌బీసీ ఎఫ్‌డీసీ సృష్టికర్త పీవీ

పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టిన వెంటనే వెనుకబడిన వర్గాల సాధికారతకు ఒక సంస్థను నెలకొల్పుతానని చెప్పారు. రెండు నెలల్లోనే వెనుకబడిన తరగతులవారిని ఆదుకోవడానికి ‘నేషనల్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌' (ఎన్‌బీసీ ఎఫ్‌డీసి)ను ఏర్పాటుచేశారు. 1992 జనవరి 13వ తేదీన సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ పరిధిలో ఏర్పాటయిన ఈ సంస్థ బడుగువర్గాల సాధికారతకు ఇతోధిక సేవలు చేసింది. వ్యవసాయం, రవాణా, సేవా రంగాలలో రుణాలు ఇచ్చింది. స్టేట్‌ చానెలింగ్‌ ఏజెన్సీ ద్వారా స్వయం సహాయక బృందాల ద్వారా ఎన్నో రుణాలిచ్చింది. 

వార్షిక ఆదాయం మూడు లక్షల కన్నా తక్కువ ఉన్నవారికి 3.5 నుంచి ఏడు శాతం వడ్డీ రేటుతో రుణాలివ్వడం విశేషం. మహిళలకు ఐదు శాతం, స్వయం సహాయక బృందాలకు నాలుగు శాతం వడ్డీరేటుతో రుణాలు ఇస్తున్నది. దాదాపు రెండున్నర దశాబ్దాలలో  లక్షలాది మందికి 4, 362 కోట్ల రూపాయల రుణాలిచ్చింది. గత ఐదేండ్లలో 1, 786 కోట్ల  మేర రుణాలిచ్చింది. ఇచ్చిన రుణాల వసూలు 95 శాతం ఉండటం కూడా గొప్ప విషయమే. దాదాపు ఒక్కో లబ్ధిదారునికి పది లక్షల పరిమితి వరకు రుణాలు ఇస్తున్నది. ఇందులో 85 శాతం ఎన్‌బీసీ ఎఫ్‌డీసీ, మిగతా పదిహేను శాతం ఆయా రాష్ర్టాల స్టేట్‌ చానెలింగ్‌ ఏజెన్సీ భరిస్తుంది. వ్యవసాయం- అనుబంధ రంగాలు, రవాణా, సేవ, సాంకేతిక, వృత్తి నైపుణ్య రంగాలకు, విద్యారంగానికి రుణాలు ఈ సంస్థ ద్వారా లభిస్తున్నాయి. 

సంప్రదాయ వృత్తుల వారు తమ జీవనోపాధి కోసం ఈ రుణాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని వెల్లడైంది. తమిళనాడు, కేరళ రాష్ర్టాలలోని చాలామంది మహిళలు ఈ సంస్థ నెలకొల్పిన ‘మహిళా సమృద్ధి యోజన’  ద్వారా రుణాలను ఉపయోగించుకుంటున్నారు. ఒక్కొక్కరు నాలుగు శాతం వడ్డీతో అరువై వేల రూపాయల రుణం తీసుకుంటున్నారు. స్వర్ణిమ పథకం కింద ఐదు శాతం వడ్డీతో లక్ష రూపాయల రుణం పొందుతున్నారు. లబ్ధిదారులను నియమ నిబంధనల పేరుతో వేధించకుండా సులభంగా రుణ వితరణ జరుపాలనేది ఎన్‌బీసీ ఎఫ్‌డీసీ లక్ష్యం. ఏదో ఒక ఆస్తిని హామీగా చూపితే తప్ప బ్యాంకులు రుణాలు ఇవ్వవు. స్టేట్‌ చానెలింగ్‌ ఏజెన్సీలుగా ఉండే ఫైనాన్షియల్‌ కార్పొరేషన్లు పూచీకత్తు ఇవ్వడం లేదు. వసూళ్ళు కూడా సమర్థవంతంగా చేయడం లేదు. దీంతో ఎన్‌బీసీ ఎఫ్‌డీసీ ప్రత్యామ్నాయ మార్గంగా  ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పబ్లిక్‌ రంగ బ్యాంకుల మీద ఆధారపడి రుణాలు ఇస్తున్నది. 


నగర ప్రాంతాలకు వలస వచ్చిన వారికి తమ సొంత రాష్ర్టాల కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగా రుణాలు లభిస్తున్నాయి. స్వీయ ఆదాయ పత్రాన్ని గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించినా రుణం సులభంగా లభిస్తుంది. బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ ఇచ్చే రుణం కూడా ప్రాతిపదిక అవుతుంది. ఒక మనిషి సంవత్సరాదాయం కూడు, గుడ్డ, గూడుకు సరిపోయేంతగా ఉంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు లెక్కించరు. కానీ వారు జీవితంలో సగకాలమే పనిచేస్తారు కనుక దానిని డబుల్‌ పావర్టీ లైన్‌ కింద ఉన్నవారిగా చెబుతారు. ఇలాంటివారిని ఆదుకోవడానికి ఈ ఎన్‌బీసీ ఎఫ్‌డీసీ ఉపయోగపడుతుంది. ఈ ఎన్‌బీసీ ఎఫ్‌డీసీ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఆదుకొని వారి జీవితాలలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది.


logo