గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 09, 2020 , 02:34:53

నవభారత నిర్మాత పీవీ

నవభారత నిర్మాత పీవీ

  • ఆయనకు భారతరత్న ఇవ్వడమంటే దేశం తనను తాను గౌరవించుకోవడమే: కేసీఆర్‌
  • శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం ప్రకటించాలి
  • తెలంగాణ శాసనసభ, మండలి  ఏకగ్రీవ తీర్మానం
  • గ్లోబల్‌ ఇండియా సృష్టికర్త..  నేటి అభివృద్ధి ఫలాలు ఆయన చలువే
  • సరళీకృత ఆర్థిక విధానాలతో  విప్లవాత్మక మార్పు: సీఎం

 తీర్మానం

తెలంగాణ బిడ్డ, దక్షిణాదినుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థికసంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదుడు, బహుభాషావేత్త, దేశప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాల్లో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకటనరసింహారావుగారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంట్‌ ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువునూ ప్రతిష్ఠించాలని, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావుగారి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది.

- కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానం పూర్తిపాఠం..

అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధోసంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు శ్రీ పీవీ నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారతదేశం రూపొందడానికి బాటలువేసిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు. భారత పూర్వ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావుగారి శతజయంతి దేశచరిత్రలో ఒక విశిష్ట సందర్భం. తెలంగాణ అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పీవీ నరసింహారావుగారి శతజయంతి ఉత్సవాలను సంవత్సరకాలంపాటు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. 2020 జూన్‌ 28న పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ఈ శతజయంతి ఉత్సవాల నిర్వహణ ద్వారా పీవీ నరసింహారావుగారు దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ ఉజ్వలంగా స్మరించుకునేలా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది. ఈ రోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారతదేశం నిలువడానికి, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూలకారకులు పీవీ నరసింహారావుగారు. దేశ ప్రధాని పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి దక్షిణ భారతీయునిగా, తెలంగాణ ముద్దుబిడ్డగా చరిత్ర సృష్టించిన ఘనుడు పీవీ నరసింహారావుగారు. అందుకే ఇది పీవీ మన ఠీవి అని తెలంగాణ సగర్వంగా చాటుకుంటున్న సందర్భం. ఆధునిక భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నాయకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు స్వాతంత్య్రానంతరం జవహర్‌లాల్‌ నెహ్రూ, మోడ్రన్‌ ఇండియా నిర్మాత. రెండోవారు పీవీ నరసింహారావు, గ్లోబల్‌ ఇండియా నిర్మాత. పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్నది. దేశ ఆర్థికస్థితి అధోగతిలో ఉన్నది. సోవియట్‌ యూనియన్‌, అమెరికా నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి అమెరికా కేంద్రంగా ఏకధ్రువ ప్రపంచం ఏర్పడుతున్న సంధికాలంలో అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాలానుగుణంగా పరిణామశీలంగా ఆర్థిక దృక్పథంలో మార్పులు తేవాల్సిన ప్రత్యేక పరిస్థితుల నడుమ దేశం నిలబడి ఉన్నది. ఇంకో దిక్కు పంజాబ్‌లో వేర్పాటువాదం బుసలు కొడుతున్నది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు మారణహోమం కొనసాగిస్తున్నారు. వీటన్నిటితోపాటు మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పాలి. కాలం విసిరిన ఇన్ని సవాళ్ల నడుమ తనదైన, దార్శనికతతో, ధైర్యంగా ముందడుగు వేశారు శ్రీ పీవీ నరసింహారావుగారు. నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అత్యంత సాహసోపేతంగా వేగంగా, చాకచక్యంగా, సమర్థంగా అమలుచేశారు. రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్‌సింగ్‌గారిని ఆర్థికశాఖమంత్రిగా నియమించి పీవీగారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థికవ్యవస్థ గమనాన్నే మార్చేశారు. లైసెన్స్‌, పర్మిట్‌రాజ్‌ను అంతంచేశారు. దేశాభివృద్ధిలో ప్రైవేటురంగం భాగస్వామ్యాన్ని పెంచారు. కూపస్థ మండూకంలా మారిన దేశ ఆర్థికవ్యవస్థను, ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానం చేశారు. అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుంచి, దేశాన్ని బయటపడేసి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు తీయించారు. నేడు భారతీయ మేధావులు విదేశాల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారన్నా, దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెద్దఎత్తున సమకూరాయన్నా,

ఈనాడు దేశానికి ప్రపంచం నలుదిక్కుల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయన్నా, స్వదేశీ కంపెనీలు విదేశీ కంపెనీలను కొనేస్థాయికి ఎదిగాయన్నా, ప్రభుత్వరంగ సంస్థల్లో సైతం పోటీతత్వం పెరిగిందన్నా, ప్రైవేటురంగంలో ఉపాధి పెరిగిందన్నా, సగటు భారతీయుని జీవన శైలి ఎంతో మారిందన్నా వీటన్నిటి వెనక పీవీ నరసింహారావుగారి దార్శనికత ఉన్నది. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం. పీవీ నరసింహారావుగారు సంస్కరణలనే వృక్షాలునాటితే ఈనాడు మనం వాటి ఫలాలు అనుభవిస్తున్నాం. అందుకే ఆయన నూతన ఆర్థిక విధానాల విధాత, గ్లోబల్‌ ఇండియాకు రూపశిల్పి. భారత విదేశాంగ విధానంలో మేలి మలుపులు పీవీ దౌత్యనీతి ఫలితమే. అంతవరకూ సోవియట్‌ యూనియన్‌తో మాత్రమే సంబంధాలు కలిగిన భారత్‌ను ఒకే ఒక్క అగ్రరాజ్యమైన అమెరికాకు మిత్రదేశంగా మార్చిన ఘనత పీవీదే. భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండిన నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌ను సుముఖం చేసుకున్నది పీవీ వ్యూహమే. ‘లుక్‌ ఈస్ట్‌ పాలసీ’ ప్రవేశపెట్టి సింగపూర్‌, మలేషియా, ఇండోనేషియా వంటి ఏషియన్‌ టైగర్స్‌కి భారత్‌ను చేరువచేసి వ్యాపారాభివృద్ధికి దోహదం చేసింది పీవీ దూరదృష్టే. ఇప్పుడు ఆ విధానాన్నే ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’గా కొనసాగిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యను పక్కనపెట్టి, వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాలని ప్రతిపాదించి, బీజింగ్‌ వెళ్లి ఒప్పందం కుదుర్చుకొని వచ్చింది పీవీనే. దాదాపు మూడు దశాబ్దాలు భారత్‌-చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పీవీ దౌత్యమే కారణం. రెండో అణుపరీక్షకు రంగం సిద్ధంచేసిన దక్షత కూడా పీవీగారిదే. ఉగ్రవాదుల పీచమణచడంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా పేరుతెచ్చుకున్న కేపీఎస్‌ గిల్‌కు సంపూర్ణ మద్దతు, వ్యూహాత్మకమైన తోడ్పాటు అందించడం ద్వారా పంజాబ్‌లో శాంతిని పునరుద్ధరించారు. కేఆర్‌ వేణుగోపాల్‌ వంటి సమర్థులైన అధికారుల సహకారంతో కశ్మీర్‌లో శాంతి నెలకొల్పగలిగారు. 

పీవీగారు భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనే భూ సంస్కరణలకు నాంది పలికారు. దేశంలో భూసంస్కరణలను అత్యంత నిజాయితీగా అమలుచేసిన ముఖ్యమంత్రి ఆయన. 1972లో భూసంస్కరణల చట్టం తెచ్చారు. భూస్వామ్యవర్గం కన్నెర్రజేసినా లెక్కచేయలేదు. భూగరిష్ఠ పరిమితి దాటిన వారు భూములు ప్రభుత్వానికి అప్పజెప్పాలనే విధానాన్ని రూపొందించారు. భూ సంస్కరణల స్ఫూర్తికి తనే ఆదర్శంగా నిలవాలని తన సొంత భూమి 800 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం పరిచారు. ఆ భూమిని 479 మంది లబ్ధిదారులకు అందేలా చూశారు. పీవీ చలువవల్లనే తెలంగాణలో పేదవాళ్లకు భూమి లభించింది. 93 శాతానికి పైబడి చిన్న కమతాలున్న రైతుల వ్యవసాయ వ్యవస్థ పీవీ గారి నేతృత్వంలో జరిగిన భూ సంస్కరణల కారణంగానే ఏర్పడ్డది. భూసంస్కరణలను చిత్తశుద్ధితో అమలుచేసినందుకు, ముల్కీరూల్స్‌ను సమర్థ్ధించినందుకు తదనంతరం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. అయినా పీవీగారు చలించలేదు. నిబద్ధతను కోల్పోలేదు. 

రాష్ట్రమంత్రిగా, కేంద్రమంత్రిగానూ ఏ శాఖ నిర్వహించినా అందులో సంస్కరణలు ప్రవేశపెట్టిన సృజనశీలి. నిత్య సంస్కరణాభిలాషి పీవీ నరసింహారావుగారు. అనన్యసామాన్యమైన మేధో సంపత్తి, సామాజిక సమస్యల పట్ల లోతైన అవగాహన ఉన్న పీవీగారు వివిధ శాఖల్లో అనేక అభివృద్ధికరమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు. రాష్ట్ర విద్యామంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. కేంద్రంలో మానవ వనరులశాఖ మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. ఈ విద్యాలయాలు గ్రామీణ విద్యార్థులకు నేటికీ ఉచితంగా ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తున్నాయి. ఈ విద్యాలయాల్లో శిక్షణ పొందిన వారెందరో ఉన్నతస్థాయి పదవులు పొందారు. ఉన్నత ఉద్యోగాల్లో రాణించారు. నేటికీ రాణిస్తున్నారు. ఏడు నుంచి పదో తరగతి వరకు మధ్యన ఉండే తరగతుల్లో డిటెన్షన్‌ పద్ధతిని రద్దు చేశారు. పిల్లలు జీతగాళ్లుగా, బాలకార్మికులుగా డ్రాప్‌ఔట్స్‌గా మిగిలిపోతున్నారనే ఉద్దేశంతో మానవీయ కోణంలో ఆలోచించి, ఆయన ఈ సంస్కరణ చేశారు. అన్ని కోర్సుల అకడమిక్‌ పుస్తకాలన్నీ తెలుగులో లభించాలనే ఉద్దేశంతో తెలుగు అకాడమీని నెలకొల్పారు. జైళ్లశాఖ మంత్రిగా బహిరంగ జైళ్ల విధానం ప్రవేశపెట్టారు. శిక్షార్హులలో, ఖైదీలలో పరివర్తనకు ఓపెన్‌ జైళ్లు ఉపయోగపడతాయని విశ్వసించిన మానవీయమూర్తి పీవీ. విదేశాంగ మంత్రిగా ఇజ్రాయెల్‌ను గుర్తించి ఆ దేశంతో ప్రప్రథమంగా దౌత్యసంబంధాలు నెలకొల్పారు. విదేశాంగ మంత్రిగా, రక్షణమంత్రిగా విధానపరంగా అనేక కొత్త పుంతలు తొక్కారు. 

పీవీ వ్యక్తిత్వం ఒక సహస్ర దళపద్మం- అనేక కోణాలున్న సమున్నత వ్యక్తిత్వం. పీవీ బహుభాషా కోవిదుడు, మహోన్నత సాహిత్యవేత్త బాలగంగాధర తిలక్‌, పండిట్‌ గోవిందవల్లభ్‌ పంత్‌, కేఎం మున్షీ, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటివారి సరసన లెక్కించదగిన అఖండ పాండిత్యం ఉన్నవారు మన పీవీ. తెలుగు, సంస్కృతం, మరాఠీ, కన్నడ, ఉర్దూ, పర్షియన్‌ మొదలైన భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌ వంటి విదేశీభాషల్లోనూ అనర్ఘళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన వేయిపడగలు అనే బృహన్నవలను హిందీ భాషలోకి సహస్రఫణ్‌ పేరుతో అనుసృజించారు. అందరూ వేయి పడగలు నవలకు పీవీగారు చేసింది అనువాదం అనుకుంటారు.. కానీ అది అనుసృజన అని, స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ గారే పేర్కొన్నారు. వేయిపడగలు నవల అనేక పాత్రలు సన్నివేశాలతో ఒక ఇతిహాసం వలె ఉంటుంది. ‘క్లిష్టతరమైన ఈ నవలను పీవీ అనుసృజన చేసినతీరు చూస్తే హిందీ నుంచి తెలుగులోకి నేను అనువాదం చేశానా అనేంత గొప్పగా ఉన్నదని’ విశ్వనాథ సత్యనారాయణ గారంతటి వారు అంతగా ప్రశంసించారంటే పీవీ గారి పాండిత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. వేయిపడగలు నవలను బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం మీద తిరుగుబాటుగా పీవీగారు అభివర్ణించారు. అబలా జీవితం అనే మరాఠీ నవలను తెలుగులోకి అనువదించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన అనుభవాలకు అక్షరరూపమిస్తూ ‘గొల్ల రామవ్వ’ అనే అత్యద్భుతమైన కథ రాశారు. ఈ కథలో ఆనాడు తెలంగాణలో రామవ్వ వంటి సామాన్యులు చేసిన త్యాగాలను గొప్పగా చిత్రించారు. ఇంకా ఎన్నో కథలు, పద్యాలు, గేయాలు, నవలికలూ రాశారు. ఆయన ఉపన్యాసాల్లో భాషాసాహిత్య పరిమళాలు, గుబాళించేవి. ఆయన అసమాన పాండిత్యం అద్భుత తేజస్సుతో ప్రకాశించేది. విశ్వనాథ సత్యనారాయణగారికి, సీ నారాయణరెడ్డిగారికి జ్ఞానపీఠ పురస్కారాలు లభించడం వెనుక, కాళోజీ నారాయణరావుగారికి పద్మవిభూషణ్‌ బిరుదు రావడం వెనుక పీవీగారి కృషి దాగిఉన్నది. మనవాళ్ల ప్రతిభ జాతీయస్థాయిలో వెలుగులోకి రావడానికి పీవీగారే వారధి అయ్యారు.

 ఒక చిన్న గ్రామంలో పుట్టి, విద్యార్థి దశలోనే నిజాంరాజుకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తినందుకు.. విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణ చేసినా కూడా పీవీగారు వెరవలేదు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాగపూర్‌, పుణెలో ఇంటర్‌, బీఎస్సీ, లా డిగ్రీలు పూర్తిచేసి అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆనాడు ప్రముఖ న్యాయవాది, గొప్ప రాజకీయవేత్త అయిన బూర్గుల రామకృష్ణారావుగారి దగ్గర జూనియర్‌ లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన పీవీగారు.. పత్రికా సంపాదకత్వం పట్ల, రామానందతీర్థ నాయకత్వంలోని స్వాతంత్య్ర పోరాటం పట్లనే మొగ్గుచూపించారు. అద్భుతమైన గ్రహణ, ధారణశక్తి పీవీ సొంతం. పేదల పట్ల సానుభూతి, ప్రయోగశీలత, పార్టీ పట్ల, ఆదర్శాల పట్ల్ల అంకితభావంతో పీవీగారు రాజకీయ ప్రస్థానం సాగించారు. గాంధీ, నెహ్రూల పట్ల ఆరాధానాభావం, అసమాన పాండిత్యం, అసాధారణమైన అభివ్యక్తి, సృజనశీలం ఆయనను ఉన్నతపథంలో నడిపించాయి. ఎన్నో శిఖరాలు ఎక్కించాయి. 

1991 ఎన్నికల్లో పోటీచేయకుండా హైదరాబాద్‌కు తిరిగి రావడానికి సిద్ధంగా ఉండిన పీవీగారు రాజీవ్‌గాంధీ దారుణ హత్యానంతరం అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి, దేశ ప్రధానిగా సర్వోన్నతమైన పదవిని అధిష్ఠించారు. ప్రధానిగా భారతదేశాన్ని ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో అసమానమైన ప్రతిభతోపాటు విమర్శలకు వెరవని సాహసాన్ని ప్రదర్శించారు. అటువంటి మహనీయుడికి, తెలంగాణ ముద్దుబిడ్డకు, ప్రపంచమేధావికి, బహుభాషావేత్తకు, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారతనిర్మాతకు జాతిరత్నమై భాసిల్లిన నాయకునికి మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారం ఇచ్చి భారతజాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. పీవీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రకటించడం సముచితంగా ఉంటుంది. 

  • తెలంగాణ అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పీవీ నరసింహారావుగారి శతజయంతి ఉత్సవాలను సంవత్సరకాలంపాటు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. 2020 జూన్‌ 28న పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది.
  •  పీవీ చలువవల్లనే తెలంగాణలో పేదవాళ్లకు భూమి లభించింది. 93 శాతానికి పైబడి చిన్న కమతాలున్న రైతుల వ్యవసాయ వ్యవస్థ పీవీ గారి నేతృత్వంలో జరిగిన భూ సంస్కరణల కారణంగానే ఏర్పడ్డది. భూసంస్కరణలను చిత్తశుద్ధితో అమలుచేసినందుకు, ముల్కీరూల్స్‌ను సమర్థ్ధించినందుకు తదనంతరం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. 
  • రాజకీయాలతో సంబంధంలేని ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్‌సింగ్‌గారిని ఆర్థికశాఖ మంత్రిగా నియమించి పీవీగారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థికవ్యవస్థ గమనాన్నే మార్చేశారు. లైసెన్స్‌, పర్మిట్‌రాజ్‌ను అంతంచేశారు. దేశాభివృద్ధిలో ప్రైవేటురంగం భాగస్వామ్యాన్ని పెంచారు. 
  • దాదాపు మూడు దశాబ్దాలు భారత్‌-చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పీవీ దౌత్యమే కారణం. రెండో అణుపరీక్షకు రంగం సిద్ధంచేసిన దక్షత కూడా పీవీగారిదే. 
  • తెలుగు, సంస్కృతం, మరాఠీ, కన్నడ, ఉర్దూ, పర్షియన్‌ మొదలైన భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌ వంటి విదేశీభాషల్లోనూ అనర్ఘళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు.


logo