గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:13:19

అధికారులను హడలగొట్టిన పీవీ

అధికారులను హడలగొట్టిన పీవీ

ప్రధానిగా పీవీ నరసింహారావు వివిధ దేశాలు పర్యటించి తాను చేపట్టిన ఆర్థిక సంస్కరణలను వివరించి, పెట్టుబడులను ఆహ్వానించారు. అమెరికా మొదలుకొని, యురోపియన్‌ దేశాల వరకు ఆయన ఎంతో జాగ్రత్తగా సంబంధాలను నిర్వహించారు. పెట్టుబడిదారులలో విశ్వాసం కల్పించారు. అయితే ఇవేవీ ప్రధానిగా తన హోదాను దిగజార్చేవి కావు. దేశ ప్రతిష్ఠను, ప్రధానిగా తన గౌరవాన్ని ఆయన ఏనాడు పణంగా పెట్టలేదు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినా అనుభవజ్ఞుడిగా తన పద్ధతిలోనే నడుచుకునే వారు. 

పీవీ జపాన్‌ పర్యటన 1992 జూన్‌ 22 నుంచి 26వ తేదీ వరకు జరిగింది. ఇక్కడి విదేశాంగ శాఖ అధికారులు, టోక్యోలోని దౌత్యాధికారులు జపాన్‌ అధికారులతో సమన్వయం సాధించి పర్యటనను ఖరారు చేశారు. కానీ కార్యక్రమం రూపకల్పనలో పీవీని పూర్తిగా సంప్రదించినట్టు లేదు. నిర్దేశిత కార్యక్రమం ప్రకారం- పీవీ ఉదయమే జపాన్‌ చేరుకోవాలి. ఆ తరువాత అకసాక రాజభవనంలో జపాన్‌ ప్రధానితో క్లుప్త సమావేశం జరుపాలి. ఈ చర్చలు ఆ తరువాత అధికారుల స్థాయిలో సాగుతాయి. మధ్యాహ్నం విందులో వివిధ కంపెనీల సీఈవోలు పాల్గొంటారు. సాయంత్రం మరికొందరు వ్యాపారులు వ్యక్తిగతంగా కలుసుకుంటారు. 

పర్యటనకు రెండు రోజుల ముందు కంపెనీ సీఈవోలలో సమావేశం లేదని పీవీ ఖరాఖండిగా చెప్పారు. ప్రిన్సిపల్‌ కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఆయనను కలుసుకొని సీఈవోలతో భేటీ ప్రాధాన్యాన్ని వివరించినా ఆయనలో మార్పు లేదు. ఈ నిర్ణయం వల్ల జపాన్‌లోని పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పినప్పుడు ఆయన ‘నేను సేల్స్‌మన్‌ను కాదు. ఆ పని వేరే వారు చేస్తారు’ అని బదులిచ్చారు. అంత సుదీర్ఘ విమాన ప్రయాణం చేసిన తరువాత ఆ వెంటనే సమావేశాలలో పాల్గొనడం తనకు సాధ్యం కాదని కూడా అన్నారు. చివరికి ఆయన ఉదయం వేళ కాకుండా, అంతకు ముందు రాత్రే టోక్యో చేరే విధంగా పర్యటనను మార్చారు. పీవీ మనోభావాలు తెలుసుకోకుండా అధికారులు ఎక్కడో పొరపాటు చేశారు. దీంతో ఆయన గట్టి షాక్‌ ఇచ్చారు. జపాన్‌ వారు దారికి వచ్చారు. 

జపాన్‌ పర్యటన ఇందుకు ఉదాహరణ. జపాన్‌ సాంకేతికాభివృద్ధి గురించి తెలువనిది కాదు. ఆసియా దేశమైన జపాన్‌లోని పారిశ్రామికాధిపతులు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అత్యంత ఆసక్తిగా ఉన్నారు. పీవీ పర్యటన మూలంగా భారత జపాన్‌ సంబంధాలు భారీ మార్పుకు లోనయ్యాయి. భారత దేశంలో పెట్టుబడి పెట్టే దేశాలలో ఇప్పుడు జపాన్‌ మూడవ స్థానంలో ఉన్నది. గత రెండు దశాబ్దాలలో 30.27 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జపాన్‌ నుంచి భారత్‌లోకి వచ్చాయి. భారత దేశ మొత్తం ఎఫ్‌డీఐలలో 7.2 శాతం జపాన్‌ నుంచి వచ్చినవే. 12.77 బిలియన్‌ డాలర్ల మేర జపాన్‌ నుంచి భారత్‌కు దిగుమతులు సాగుతున్నాయి. logo