గురువారం 02 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:51:54

అన్ని భాషలు ఎలా ఔపోసన పట్టారంటే..

అన్ని భాషలు ఎలా ఔపోసన పట్టారంటే..

పీవీ నర్సింహారావు అనేక భాషలను నేర్చుకున్నాడు అనడం కంటే ఔపోసన పట్టారనడమే ఎంతో బాగుంటుంది. ఆయా భాషల్లో మాట్లాడడమేగాక అపార పాండిత్యాన్ని సముపార్జించారు. పీవీ నర్సింహారావుది పండిత కుటుంబం. సంస్కృతం చిన్నప్పటి నుంచే చదువుకున్నారు. ఆయన పుట్టి పెరిగిన లక్నేపల్లి, వంగరే కాకుండా అప్పటి నిజాం స్టేట్‌ భిన్నసంస్కృతుల సంగమం. పార్సీ, ఉర్దూ భాషలనే కాకుండా ఒరియా, కన్నడ, మరాఠీ భాషలను మాట్లాడేవారు ఎక్కువ. అలా ఆ భాషలపై పట్టు సాధించారు. అదీగాక ఓయూ నుంచి బహిష్కృతమయ్యాక పీవీ విద్యాభ్యాసం అంతా నాగ్‌పూర్‌, పూణాలోనే సుమారు ఐదేళ్లపాటు కొనసాగింది. ఈ క్రమంలో మరాఠీ భాషను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. 

అటు తర్వాత పీవీ రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి విశ్రాంతి తీసుకునేందుకు మద్రాసు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగువారికి ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత సభ తెలుగులో ప్రారంభమైనా అటు తరువాత పూర్తిగా తమిళ భాషలో సాగింది. ఆ భాష రాని పీవీకి ఏమీ అర్థం కాలేదట. దీంతో సమావేశం అనంతరం వెంటనే తమిళ వ్యాకరణ పుస్తకాలను తెప్పించుకుని వాటిని అధ్యయనం చేశారట. 15రోజుల్లోనే అనర్ఘళంగా మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పీవీ అక్కడా తనకు లభించిన ఖాళీ సమయాన్ని విదేశీ భాషలను నేర్చుకునేందుకు  కేటాయించారు. 

కేంద్రంలో 1978లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయాక పీవీకి మళ్లీ కాస్తా విరామ సమయం లభించింది. ఆ సమయంలో జెఎన్‌యూ లైబ్రరీకి వెళ్లి స్పానిష్‌ నేర్చుకున్నారు. అప్పటికి ఆయన వయస్సు 67 ఏండ్లు. అలా వివిధ సందర్భాల్లో తెలుగు మినహా 10 దక్షిణ భారత భాషలను, ఆరు విదేశీభాషలను మొత్తంగా 16 భాషలపై పీవీ పట్టు సాధించారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళ్‌, బెంగాళీ, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ, ఒరియా, హిందీ భాషల్లో పాండిత్యాన్ని సముపార్జించారు. ఇక ఇంగ్లీష్‌, ఫ్రెంచి, స్పానిష్‌, అరబిక్‌, పర్షియన్‌, జర్మన్‌, లాటిన్‌ భాషలను నేర్చుకున్నారు. logo