సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 02:43:18

దశదిశలకూ పీవీ ఖ్యాతి

దశదిశలకూ పీవీ ఖ్యాతి

  • పీవీ ఠీవి ప్రతిబింబించేలా శత జయంతి ఉత్సవాలు
  • కలాం మెమోరియల్‌ తరహాలో పీవీ స్మృతి చిహ్నం
  • ఆయన గురించి ప్రతి విషయం ప్రజలకు తెలిసేలా ప్రణాళిక
  • పీవీ సంస్కరణల ప్రాముఖ్యతను తెలిపేలా కార్యక్రమాలు
  • పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని దేశవిదేశాల్లో తెలియజేసేలా ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావు తెలిపారు. ఆయన దేశానికి అందించిన సేవలకు గుర్తుగా హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని జ్ఞానభూమిలో పీవీ స్మృతిచిహ్నాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు తెలిపారు. తమిళనాడు రామేశ్వరంలోని అబ్దుల్‌కలాం మెమోరియల్‌ మాదిరిగా దీనిని నిర్మించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే ఒక ప్రత్యేక కమిటీ త్వరలోనే అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ పరిశీలనకు వెళ్తుందన్నారు. 

ఇక పీవీ ఠీవి ప్రతిబింబించేలా, ఆయన గురించి ప్రతి విషయం ప్రజలకు తెలిసేలా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కేకే తెలిపారు. రవీంద్రభారతిలో గురువారం శతజయంతి ఉత్సవాల లోగోను కేశవరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక, విద్య, రాజకీయ రంగాల్లో పీవీ తెచ్చిన సంస్కరణలు అసామాన్యమైనవని చెప్పారు. ఈ మూడు రంగాల్లో ఆయన చేసిన సేవలు, సంస్కరణలు ప్రజలందరికీ తెలిసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. మహాత్మాగాంధీ నినాదాన్ని అనుసరించి భూమిలేని వాడికి భూమి అంటూ పేదల పక్షాన నిలిచిన గొప్ప భూసంస్కర్త పీవీ అని కొనియాడారు. ప్రపంచీకరణకు ద్వారాలు తెరిచినా.. బడుగులకు రాజకీయ అవకాశం కల్పించినా ఆ ఘనత పీవీదే అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పీవీకి సన్నిహితంగా ఉన్న వారందరినీ పిలిచి వారి అనుభావాలతో ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించాలని భావిస్తున్నట్లు తెలిపారు. పీవీ రాసిన పుస్తకాలను కమిటీ పరిశీలిస్తున్నదని, కొన్నింటిని తిరిగి ముద్రిస్తామని తెలిపారు. పీవీ గురించిన చాలా నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 


భారత్‌తోపాటు 50 దేశాల్లో ఉత్సవాలు

భారత్‌తోపాటు మరో 50 దేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదంటే అందుకు పీవీ సంస్కరణలే కారణమని తెలిపారు. ఎన్నో సంస్కరణలకు తెరతీసిన పీవీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం విచారకరమన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బిడ్డ ఖ్యాతిని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పీవీ కూతురు వాణి, కుమారుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ.. తమ తండ్రి శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు రమణాచారి, దేశపతి, టంకశాల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

పీవీ కీర్తిని చాటేలా లోగో

పీవీ కీర్తిని తెలియజేసేలా ఆయన శతజయంతి ఉత్సవాల లోగోను వినూత్నంగా రూపొందించారు. పీవీ జన్మించిన వరంగల్‌ జిల్లా గుర్తుగా కాకతీయ తోరణాన్ని, ప్రధానిగా దేశంలో చేసిన సంస్కరణలకు గుర్తుగా ఆశోక చక్రాన్ని, పీవీ మేధస్సు ప్రకటించేలా.. పైన ‘తెలంగాణ తేజోమూర్తి.. భారతీయ భవ్యకీర్తి’ అని ముద్రించారు. ఇక కింద శతజయంతి ఉత్సవాలను ప్రతిబింబించేలా 100 సంఖ్యను ముద్రించి దీనిపై పీవీ మన ఠీవి అని రాశారు.


logo