యువతకు స్ఫూర్తి.. పీవీ

పీవీ నరసింహారావు రాజకీయాల్లో ఎన్ని ఉన్నత పదవులను అలంకరించినా అంతే ఒదిగి ఉండేవారు. ఉదారస్వభావి. ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా ఉండేవారు అంటున్నారు కరీంనగర్‌కు చెందిన సీనియర్ న్యాయవాది వేముగంటి జగదీశ్చందర్రావు. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పీవీకి, తన తండ్రి, కమ్యూనిస్టు యోధుడు వేముగంటి నరహరిరావుకు ఉన్న అనుబంధాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
పీవీతో మీ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం ఏమిటీ?
పీవీ నరసింహారావు, మానాన్న వేముగంటి నరహరిరావు ఇద్దరూ నిజాం వ్యతిరేక ఉద్యమంలో కలిసి పనిచేశారు. చందా క్యాంపులో ఉన్నారు. అదీగాక పీవీ కుటుంబానికి, మా వేముగంటి కుటుంబానికి దగ్గరి బంధుత్వం కూడా ఉంది. అదీగాక పీవీ స్వగ్రామం, మా స్వగ్రామం ఎగ్లాస్పూర్ మధ్య 15కిలో మీటర్ల దూరం మాత్రమే ఉండేది. అప్పుడు ఆ రెండు గ్రామాలు కూడా ఒకే తాలూకాలో ఉండేవి. తరచూ అక్కడికి, ఇక్కడికి రాకపోకలు సాగుతుండేవి. పీవీ వచ్చారని తెలిస్తే చాలు వెళ్లి కలిసేవారు మానాన్న. అలా పీవీతో సత్సంబంధాలు కొనసాగాయి. వివాహాది శుభకార్యాలు, ఇతరత్ర కుటుంబ వేడుకల సందర్భంగానూ కాకుండానే అవకాశం చిక్కినప్పుడల్లా పీవీని కలుస్తుండేవాడిని.
కుటుంబీకులను, బంధువులను పీవీ ఎలా ఆదరించేవారు?
రాజకీయంగా ఎన్ని ఉన్నత పదవులను అధిష్టించినా కుటుంబ విలువలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారు. బంధువులు తనను ఎవరు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. బంధువుల యోగక్షేమాల గురించి పేరుపేరున అడిగి ఆరా తీసేవారు. 1983లో మా నాన్నగారు చనిపోయిన సందర్భంలో పీవీ రాలేకపోయారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆయన కరీంనగర్‌కు ఏదో కార్యక్రమానికి విచ్చేశారు. ఆ సందర్భంగా నన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని పరామర్శించారు. ధైర్యం చెప్పారు.
పీవీ సాన్నిహిత్యంలో మీరు మరచిపోలేని జ్ఞాపకం?
మా నాన్న గారి వల్ల పీవీతో మాకు పరిచయం ఏర్పడింది. నేను మొదటిసారిగా 1965లో అనుకుంటా మా పెద్దక్క వివాహ కార్యక్రమానికి వచ్చినప్పుడు పీవీని చూశాను. అది మొదలు ఆయనను ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. ఇక నాకు మరచిపోలేని జ్ఞాపకమంటే 1971-72లో ముఖ్యమంత్రి హోదాలో హన్మకొండలోని కేడీసీ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి పీవీ విచ్చేశారు. అప్పుడు నేను ఆ కాలేజీలోనే చదువుతున్నాను. ఆ సభలో పీవీ చేసిన ఉపన్యాసం, యువతకు ఆయన మార్గనిర్దేశనం ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. నేను ఎంతో మైమరచిపోయాను. అది నా మీద ఎంతో ప్రభావం చూపింది. అప్పటి నుంచి పీవీ మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేవాడిని. 1977లో ఎంపీ ఎన్నికలప్పుడు పీవీతో కలిసి ప్రచారంలో పాల్గొన్నా. అదేవిధంగా 1985లో కరీంనగర్ రేకుర్తిలోని కంటి దవాఖాన ప్రారంభోత్సవానికి మానవ వనరులశాఖామాత్యులుగా పీవీ విచ్చేశారు. ఆ సందర్భంగా మానవ వనరుల అంశంపై ఆయన ఇచ్చిన ప్రసంగం కూడా నాకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. అది నాలో ఎంతో స్పూర్తిని నింపింది.
పీవీ ఉపన్యాసాల కోసం కచ్చితంగా వెళ్లేవాడిని అన్నారు కదా. వారి ప్రసంగంలో అంతటి ప్రత్యేకత ఏమిటీ?
పీవీ ప్రతి మాటలో కూడా ఎంతో లోతైన అర్థముంటుంది. ప్రతి విషయాన్ని కూడా పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే రీతిలో విడమరచి చెప్పగల నేర్పరి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రసంగాలను వినే వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా జీపులో వెళ్తున్నప్పుడు ఆయన ఒక్కమాట కూడా మాట్లాడకపోయేవారు. వేదికపైనా కూడా తాను ప్రసంగించాల్సిన సమయం వచ్చే వరకూ మౌనంగానే ఉండేవారు. కానీ ఆయన అన్నింటినీ ఆకళింపు చేసుకునేవారు. తన ప్రసంగంలో ఆ గ్రామం పేరు, అక్కడ ఏ రకం భూములున్నాయి? ఏ పంటలు పండుతున్నాయి? అక్కడి సమస్యలు ఏమిటీ? వారికి ఏం కావాలి? తాను గెలిస్తే ఏం చేస్తాను? అనే అంశాలను చిన్న పిల్లవానికి కూడా అర్థమయ్యేలా.. వాళ్ల భాషలో చెప్పేవాడు. అంతే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశంతో ప్రపంచానికి ఉన్న సంబంధాలను ఎన్నో విషయాలను అరటి పండు వొలిచినట్లుగా వివరించేవారు. కొత్త ఆలోచనలను రేకేత్తించేవారు. స్ఫూర్తినింపేవారు. అదే పీవీ ప్రత్యేకత.
పీవీ రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్నప్పుడు మీరు యువకుడిగా ఉన్నారు కదా? ఎలాంటి సలహాలు ఇచ్చేవారు? యువతపై పీవీ అభిప్రాయం ఎలా ఉండేది?
పీవీ నరసింహారావుకు యువతపై అపరి మితమైన ప్రేమ ఉండేది. దేశభవిష్యత్తును మార్చే శక్తి వారికుందనే అభిప్రాయం ఆయనలో స్పష్టంగా కనిపించేది. ఆయన తన ప్రతి ప్రసంగంలో యువతకు మార్గనిర్దేశనం చేసేవారు. నేనే కాదు.. నాలా తనను కలిసే ప్రతీ యువకుడిని ఆయన ఒకటే అడిగేవారు. ఏం చేస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? అని ఆరా తీసేవారు. అంతేకాదు. ఎంచుకున్నది ఏ రంగమైన సరే అందులో నిష్ణాతులు కావాలని, అది నిరంతర అధ్యయనం.. పరిశీలన వల్లే సాధ్యమవుతుందని సూచించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఈతరానికి కూడా స్ఫూర్తి ప్రదాతనే.
ఇంటర్వ్యూ.. -మ్యాకం రవికుమార్
కరీంనగర్ పీవీ సాహిత్యం పీఠం సభ్యులుగా పీవీ శతజయంతి ఉత్సవాల గురించి మీ మాటల్లో వివరిస్తారా?
భారతదేశ గతిని మార్చిన మేధావి. అయినా దేశానికి ఆయన అందించిన సేవలు వెలుగులోకి రాకపోవడం మమ్మల్ని ఇప్పటికీ బాధిస్తుంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు పీవీ గురించి, ఆయన సేవలను గురించి తెలియాలనే సంకల్పంతో పీవీ సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేశారు. అందులో పీఠం అద్యక్షుడు కల్వకోట సంతోష్‌బాబు పాత్ర కీలకం. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడం చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడే కాదు తెలంగాణ ఏర్పాటు తరువాత మరుగునపడ్డ అనేకమంది తెలంగాణ ముద్దుబిడ్డలను, వారి సేవలను కేసీఆర్ వెలుగులోకి తీసుకొస్తున్నారు. పీవీ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చారు. ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు ఏకంగా శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇది యావత్ దేశానికే గర్వకారణం. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
సీనియర్ న్యాయవాదిగా పీవీ చేసిన చట్టాల్లోని ప్రత్యేకతలు..
న్యాయవిభాగానికి ఆయన కృషిని వివరిస్తారా?
పీవీ చేసిన సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైనది భూసంస్కరణలు. ఆ చట్టాన్ని ఆయన స్వయంగా రూపొందించారు. అందులోని అంశాలను గమనిస్తే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కో అంశాన్ని లోతుగా అధ్యయనం చేశారు కాబట్టే ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా చాలా పకడ్బందీగా ఆ చట్టాన్ని సిద్ధం చేశారని అనిపించింది. న్యాయశాస్త్రంపై ఆయన ప్రతిభకు అద్దంపడుతుంది అది. అదేకాదు కోర్టులు నేడు నిర్వహిస్తున్న లోక్ అదాలత్, లీగల్ సెల్ అథారిటీ సేవలను ప్రవేశపెట్టడంలోనూ పీవీ కీలకభూమికనే పోషించారు. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి ముఖ్యమైన సలహాలను అందించారు. నేను న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన తరువాత ఆయనను కలిసిన ప్రతి సందర్భంలోనూ న్యాయవ్యవస్థలో మార్పులు, కోర్టుల పనితీరు, విస్తరణ, అందిస్తున్న సేవలు తదితర అంశాలపై ఆరా తీసేవారు.
మేధావి మాట
ప్రతీ మనిషికీ ఒక లక్ష్యం ఉండాలి. తన వ్యక్తిగత జీవితంతో బాటు సమాజం పట్ల తాను నిర్వహించవలసిన కొన్ని బాధ్యతల పట్ల స్పష్టమైన అవగాహన కల్గి ఉండాలి. జీవితం అంటే కేవలం కాలం గడపడం కాదు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన ఉండాలి. మేధో వికాసం మాత్రమే మనకు మంచి మార్గదర్శనం చేస్తుంది. మన సుసంపన్నమైన సంస్కృతి, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం గురించి ఎరుక ఉండడం ఎంతో అవసరం. అందుకు కళాశాలల్లో చదివి పట్టాలు పొందాల్సిన అవసరం లేదు.అందరికీ అవకాశం దొరకకపోవచ్చు. అందుకు నిరాశ చెందవద్దు. మన నిత్యజీవిత సంఘటనల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. పుస్తకాలను ఓర్పుతో చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. బాగా అధ్యయనం చేసే అలవాటు పెంచుకోవాలి. నేను చేస్తున్నది అదే.
తొలివిజయానికి రూపాయి దండ..
పీవీ నర్సింహారావు తొలి సారి కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత మంథని శాసనసభ స్థానం నుంచి బరిలో దిగారు. ఆ ఎన్నిక ఫలితాలను రేడియోలో ప్రకటిస్తున్న సమయంలో పీవీ వెంట కాళోజీ నారాయణరావు, ఆప్తమిత్రుడు కృష్ణగోపాల్‌తో కలిసి బిరుదురాజు రామరాజు ఇంట్లో చర్చల్లో మునిగిపోయి ఉన్నారు. ఎన్నికల్లో పీవీ గెలిచారని రేడియోలో సాయం త్రం వార్తల్లో ప్రకటించగానే అక్కడున్న వారం తా సంతోషంతో ఉప్పొంగిపోయారు. కాళోజీ అయితే ఆనందబాష్పాలు రాల్చారు. అప్పటికప్పుడు బిరుదురాజు రామరాజు ఒక రూపాయితో పూలదండను తెప్పించి కాళోజీతో పీవీ మెళ్లో వేయించి సత్కరించారు. వారిని పీవీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత అక్కడే గోధుమ పిండితో స్వీట్ చేయించుకుని వారంతా పీవీ తొలి విజయానందాన్ని ఆస్వాదించారు. ఆ సంఘటన తనకొక మధురజ్ఞాపకమని బిరుదురాజు రామరాజు అనేకసార్లు వెల్లడించారు.
అపరిచితుడికి ఆతిథ్యం..
18జూన్,2018లో న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ప్రచురితమైన లేఖ. పీవీతో తన అనుభవాలను ఓ బ్యాంకు ఉద్యోగి జ్ఞాపకం చేసుకున్నారు.
పీవీ ఎంత స్థాయిలో ఉన్నా ఇతరులకు సహాయకారిగా ఉండేవారు. ఇందుకు ఒక ఉదాహరణ తమిళనాడుకు చెందిన ఎంఆర్ ఆనంద్ అనే వ్యక్తి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటర్వ్యూకు ఢిల్లీ వెళ్లాలి. అక్కడ చుట్టాలు కానీ, దోస్తులు కానీ ఎవరూ లేరు.
ఏదేమైనా కానీ ఒక ఆలోచన చేశాడు. ఢిల్లీలో ఉండే కొంత మంది రాజకీయ నేతలకు నేరుగా తన పరిస్థితిని వివరించి, తనకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ లేఖలను రాశాడు. అలా ఓ లేఖను ఢిల్లీలో ఉన్న పీవీ నరసింహారావుకు కూడా రాశాడు. ఎవరూ ఆ లేఖలకు స్పందించలేదు. కానీ ఆశ్చర్యకరంగా పీవీ మాత్రం ఆనంద్‌కు రిప్లయ్ ఇచ్చారు. మీరు తప్పకుండా ఢిల్లీ రండి. ఎక్కడో ఎందుకు మీకు అభ్యంతరం లేకుంటే మా ఇంట్లోనే ఉండవచ్చు” అని ఆ లేఖ సారాంశం. ఆ లేఖను చదివిన ఆనంద్ నమ్మలేకపోయాడు. ఒకటికి నాలుగుసార్లు చదువుకుని నిజమేనని నిర్ధారించుకుని ఢిల్లీ రైలెక్కాడు. 99 షాజహాన్ రోడ్‌లోని పీవీ ఇంటికి చేరుకున్నాడు. తలుపుతట్టగానే పీవీ గారే ఎదురొచ్చారు. ఆనంద్ తన వివరాలను చెప్పగానే మీరేనా రండి అని ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకెళ్లారు. తరువాత నేను స్నానాది కార్యక్రమాలు ముగించుకుని వచ్చేసరికి నాకోసం డైనింగ్ టేబుల్ వద్ద వేచిచూస్తున్నారు. నేను అక్కడి వెళ్లి మళ్లీ ఆశ్చర్యపోయాను. అదీ ఇడ్లీలు.. ఢిల్లీలో. ఆనందానికి అవధులు లేవు. ఆ తరువాత నా ఇంటర్వ్యూ వివరాలను కనుక్కొని తన వంట మనిషిని పిలిచి“ఈ అబ్బాయికి ఏం కావాలో తెలుసుకుని మధ్యాహ్నానికి వండండి” అని చెప్పారు. ఆ తరువాత ఎలాగో నేను ఇంటర్వ్యూ పూర్తి చేశాను. మరుసటి రోజు నా ప్రయాణానికి కావాల్సిన టిక్కెట్టును పీవీనే స్వయంగా తెప్పించారు. సాయంత్రం ఆయనే స్వయంగా తన పద్మినీ ప్రిమియర్ కారులో నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశరు. నాకు అప్పటి అంతా ఓ కలలా ఉంది. తనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కాలేదు. కళ్లల్లో నీళ్లొచ్చాయి. వంగి పాదాలను టచ్ చేయబోయాను. పీవీ వారించారు. అప్పుడు తన మొహంలో కనీకనిపించని చిరునవ్వు. ఇక నేను రైలు ఎక్కుతుండగా “నీకు ఓ సూచన.. రాసేటప్పుడు గానీ, మాట్లాడేప్పుడు గానీ సరళమైన ఇంగ్లీషు పదాలు వాడాలి” అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. కానీ నాడు పీవీ చెప్పిందే ఈ రోజుకూ నేను పాటిస్తున్నాను. అంతకు మించి నివాళి నేనేమివ్వగలను ఆ మహానుభావుడికి. ఆ సంఘటన నాయకులపై నాకున్న అభిప్రాయాలను పటాపంచలు చేశాయి. ఇలాంటి నాయకులు కూడా ఉంటారా? అని నమ్మలేకపోయాను. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ల ముందు కదలాడుతుంది.
తాజావార్తలు
- కార్గిల్‌లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్‌లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి
- మీకు డస్ట్ అలర్జీ ఉందా.. అయితే ఇవి తాగండి
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు