బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 12:36:57

కుల, ధన బలం పార్శ్యమే లేకుండానే సీఎం, పీఎం అయిన పీవీ

కుల, ధన బలం పార్శ్యమే లేకుండానే సీఎం, పీఎం అయిన పీవీ

హైదరాబాద్‌ : పీవీ నరసింహారావు రాజకీయ ప్రస్థానంలో కుల, ధన బలం పార్శ్యమే లేదని.. కుల, ధన బలం లేకుండానే సీఎం, ప్రధాని అయిన వ్యక్తి పీవీ నరసింహారావు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పీవీ జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.. మన్మోహన్‌ను ఆర్థికమంత్రిగా చేసి సంస్కరణలు తెచ్చిన వ్యక్తి పీవీ అన్నారు. ఆయన తెచ్చన సంస్కరణలు ఇప్పుడు ఫలితాలిస్తున్నాయన్నారు. మనందరం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛకు కారణం పీవీనే అన్నారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి నవభారత నిర్మాతల్లో ఒకరిగా నిలిచారన్నారు. నెహ్రుకు సమాంతర వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. అందరికీ అధికార భోగం దక్కాలని పీవీ అభిలషించినట్లు తెలిపారు. 

పీవీ శత జయంతి ఉత్సవాలు 51 దేశాల్లో జరుగుతున్నట్లు సీఎం తెలిపారు. పీవీ శత జయంతి ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. పీవీకి చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారని.. ఉత్సవ కమిటీలో తాము కూడా ఉంటామని విదేశాల నుంచి ఆసక్తి చూపుతున్నారన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఉత్సవాలు ఘనంగా జరగాలన్నారు. బిల్‌ క్లింటన్‌ సహా ప్రపంచ నేతలతో పీవీకి మంచి సంబంధాలున్నట్లు తెలిపారు. పీవీకి అనేక దేశాలతో దౌత్య సంబంధాలున్నాయన్నారు. 

పీవీ 360 డిగ్రీల వ్యక్తిత్వంపై పెద్ద పుస్తకమే రాయవచ్చొని సీఎం కేసీఆర్‌ అన్నారు. వ్యక్తిత్వ పటిమ తెలుసుకునేందుకు పీవీ జీవితం గైడ్‌గా నిలుస్తుందని తెలిపారు. వెనుక ఎవరూ లేకున్నా ఎన్నో గొప్ప పదవులు అలంకరించారన్నారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి కలిగిన గొప్ప వ్యక్తి. అనుకున్నదే తడవుగా ఏదైనా నేర్చుకునే నిరంతర విద్యార్థి అని అన్నారు. సహాయకులున్నా స్వయంగా కంప్యూటర్‌ ఆపరేట్‌ చేసిన వ్యక్తి. నిరంతర విద్యార్థి, అధ్యయనశీలి, సామాజిక దృక్పథం గల వ్యక్తి. విజ్ఞాన సముపార్జన చేసి ఆ వెలుతురు ప్రపంచానికి అందించారని సీఎం అన్నారు.

వేయి పడగలు నవలను హిందీలోకి తర్జుమా చేయడంలో నవలను అనువాదం కాకుండా అనుసృజన చేశారన్నారు. పీవీ జయంతి ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల ముగింపు సభ లక్ష మందితో జరగాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. 


logo