బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 02:20:05

రేపు కొలంబస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు

రేపు కొలంబస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధానమంత్రి పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యుడు, ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల తెలిపారు. మొదటిసభను అమెరికా ఒహియో ప్రావిన్స్‌లోని కొలంబస్‌లో శనివారం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇందులో పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కే కేశవరావు, పీవీ కుమార్తె వాణీదేవి పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో చూసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 6న ఉదయం 6 గంటలకు అమెరికా టీవీ ఏసియా తెలుగు ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. Youtube : https://www.youtube.com/tvasiatelugu, Facebook live: https://www.facebook.com/ TVASIA TELUGUUSA లింక్‌ల ద్వారా  ఈ కార్యక్రమాన్ని చూడవచ్చన్నారు. 

కాగా, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కెనడా, డెన్మార్క్‌, మారిషస్‌, టాంజానియా, కతర్‌లో సభలు నిర్వహించి పీవీ కమిటీ సభ్యులు ఆన్‌లైన్‌లో, అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించామని మహేశ్‌ బిగాల తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అమెరికాలోని లోకల్‌ గవర్నమెంట్‌, అన్ని తెలుగు సంఘాలతో చర్చించి ఆ దేశంలోని అన్ని ప్రాంతాల్లో పీవీ విగ్రహాలను ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. వచ్చే జనవరి నుంచి మిగతా దేశాల్లోనూ పీవీ విగ్రహాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇప్పటికే అమెరికా, యూకే, సింగపూర్‌, దక్షిణాఫ్రికా, మలేషియా, మారిషస్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా తదితర దేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. మిగతా దేశాల్లోనూ నిర్వహణకు షెడ్యూల్‌ రూపొందించామని ఆయన తెలిపారు.


logo