మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 17:24:57

'ప్ర‌ముఖ ప‌ర్యాట‌క, సాంస్కృతిక కేంద్రంగా పీవీ జ‌న్మ‌స్థ‌లం'

'ప్ర‌ముఖ ప‌ర్యాట‌క, సాంస్కృతిక కేంద్రంగా పీవీ జ‌న్మ‌స్థ‌లం'

వ‌రంగ‌ల్ రూర‌ల్ : మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు పుట్టిన న‌ర్సంపేట మండ‌లం ల‌క్నేప‌ల్లి గ్రామాన్ని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్ద‌నున్న‌ట్లు రాష్ర్ట‌ మంత్రులు తెలిపారు.  పీవీ జ‌న్మించిన ల‌క్నేప‌ల్లి గ్రామాన్ని రాష్ర్ట ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌, పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, మ‌హిళా-శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ నేడు సంద‌ర్శించారు.  గ్రామాన్ని ప‌రిశీలించిన మంత్రులు ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి ప‌రిచేందుకు ఉన్న అవ‌కాశాల‌పై స‌మాలోచ‌న‌లు చేశారు. స్మార‌క‌చిహ్నం, వార‌స‌త్వ సంప‌ద‌గా పీవీ పుట్టిన ఇంటినీ అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్‌గా ల‌క్నేప‌ల్లి చెరువును తీర్చిదిద్ద‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ... దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నేత పీవీ అన్నారు. ద‌క్షిణాది నుంచి ప్ర‌ధాని అయిన మొద‌టి ప్ర‌ధాని మాత్ర‌మేగాక‌, ఒకే ఒక్క తెలుగువాడు పీవీ అన్నారు. పీవీ మ‌న తెలంగాణ ముద్దు బిడ్డ కావ‌డం, అదీ న‌ర్సంపేట‌లోని ఈ ల‌క్నేప‌ల్లి లో పుట్ట‌డం ఈ ప్రాంతం చేసుకున్న పుణ్యమ‌న్నారు. పీవీ మ‌న ఠీవీ అంటూ పీవీ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ ప‌రంగా ఏడాదిపాటు నిర్వ‌హిస్తున్నార‌న్నారు. పీవీ కోరుకున్న సంస్క‌ర‌ణ‌ల‌ను కేసీఆర్ చేసి చూపిస్తున్నార‌ని, అందులో భాగ‌మే చారిత్రాత్మ‌క‌ రెవిన్యూ కొత్త చ‌ట్ట‌మ‌ని చెప్పారు.


న‌ర్సంపేట అభివృద్ధి పనుల‌కు మంత్రుల శ్రీ‌కారం..

అంత‌కుముందు మంత్రులు ముగ్గురు న‌ర్సంపేటలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.  వ‌రంగ‌ల్ రూర‌ల్ జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ గండ్ర జ్యోతి, మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత‌, ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిల‌తో క‌లిసి స్థానిక శివాజీ న‌గర్‌లో రూ.3 కోట్ల 11 ల‌క్ష‌ల‌తో చేప‌ట్టిన‌ బీటీ రోడ్డుకు శంకుస్థాప‌న చేశారు. ఈ రోడ్డు శివాజీ న‌గ‌ర్ నుంచి ల‌క్ష్మీపురం వ‌ర‌కు వేయ‌నున్నారు. అలాగే దుగ్గొండి మండ‌లం తిమ్మంపేట‌లో నిర్మించిన‌ విద్యుత్ స‌బ్ స్టేషన్‌ను ప్రారంభించారు. అనంత‌రం ప‌ల్లె ప్ర‌గ‌తిలో భాగంగా రెండు ఎక‌రాల్లో ఏర్పాటు చేసిన ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాన్ని సంద‌ర్శించి మంత్రులు మొక్క‌లు నాటారు. logo