బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 01:52:32

పల్లె గల్లాపెట్టె గలగల

పల్లె గల్లాపెట్టె గలగల

  • గ్రామీణ, సెమీఅర్బన్‌లో కొనుగోళ్ల జోరు
  • కిరాణా దుకాణాలు కళకళ
  • లాక్‌డౌన్‌కు ముందులా గిరాకీ 
  • క్లాత్‌ షాపులకు ‘శ్రావణ’ ఆఫర్‌
  • మళ్లీ నిర్మాణ పనులు మొదలు
  • పుంజుకున్న వాహన విక్రయాలు 
  • ప్రస్తుతం సంపదంతా పల్లెల్లోనే

‘సిద్దిపేట జిల్లాలో ఉన్న మా సూపర్‌ మార్కెట్‌లో లాక్‌డౌన్‌కు ముందు రోజుకు రూ.1.5 లక్షల వరకు విక్రయాలు జరిగేవి. లాక్‌డౌన్‌లో గిరాకీ బాగా తగ్గింది. ఆంక్షల సడలింపు తర్వాత గతనెల సూపర్‌మార్కెట్‌ విక్రయాలు  100 శాతం నమోదయ్యాయి. వస్త్ర విక్రయాలు 70 % వరకు ఉన్నాయి.హైదరాబాద్‌లో ఉన్న మా స్టోర్లకు సగటున గతంలో రూ.4 లక్షల వరకు గిరాకీ ఉంటే.. ఇప్పుడు సగానికి తగ్గింది’.. జాతీయస్థాయిలో చెయిన్‌స్టోర్లు ఉన్న ఓ కంపెనీ పరిస్థితి ఇది. ఇదొక్కటే కాదు. గ్రామీణ, సెమీఅర్బన్‌ ప్రాంతాల్లో అనేకరంగాల్లో క్రయవిక్రయాలు పెరిగాయి. వెరసి దుకాణాలు కళకళ.. గల్లాపెట్టెలు గలగల!!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభ సమయంలోనూ గ్రామీణ ప్రాం తాల్లో మునుపటి మాదిరే సందడి కనిపిస్తున్నది. వస్తు క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. చిన్న పట్టణాలు సైతం క్రమంగా కళను సంతరించుకుంటున్నాయి. కిరాణా, వస్త్ర దుకాణాలు, బైక్‌, కారు షోరూంలు.. ఇలా ప్రధాన వ్యాపారాలన్నింటికీ గిరాకీ పెరిగింది. మూడునెలలు బోసిపోయిన గల్లాపెట్టెలు ఇప్పుడు మళ్లీ గలగలలాడుతున్నాయి. ప్రస్తుతం సంపదంతా పల్లెల్లో కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు. కరోనా కేసులు పల్లెల్లో పెద్దగా వెలుగుచూడకపోవటం కూడా మరో కారణమని విశ్లేషిస్తున్నారు.

మళ్లీ కొనుగోలు బాట

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు నేపథ్యంలో పల్లె ప్రజలు కొనుగోలు బాటపట్టారు. సమీపంలోని చిన్న పట్టణాల్లో సైతం ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. లాక్‌డౌన్‌కు ముందున్న గిరాకీకి దాదాపు సమానంగా ఇప్పుడు వ్యాపారం సాగుతున్నదని పలువురు వ్యాపారులు చెప్తున్నారు. పట్టణప్రాంతాలతో పోల్చితే గ్రామీణప్రాంతాల్లో డిమాండ్‌ పెరిగిందని ‘ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌'(ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు అంటున్నాయి. కరోనాకు మందు అమ్మకాలతోపోల్చితే జూన్‌లో 85 శాతం వరకు వ్యాపారం సాగిందని తెలిపాయి. పట్టణాల్లో వ్యాపారం 60-70 శాతమే సాగుతున్నదని పేర్కొన్నాయి.

పెండ్లిళ్ల సీజన్‌తో కళ

లాక్‌డౌన్‌ కారణంగా మూడునెలలు వస్త్ర దుకాణాలు మూతపడ్డాయి. గత నెల తెరుచుకున్నా.. ప్రజలు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. మరికొన్ని రోజుల్లో శ్రావణమాసం వస్తుండటం, పెండ్లిళ్ల సీజన్‌ కావడంతో కొనుగోళ్లు కాస్త పెరిగాయి. నిర్వహణ ఖర్చుల వరకు వస్తున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. ఇక హోటళ్లు, చాయ్‌ బండ్లు, పాన్‌షాపులు వంటివి కాస్త సందడిగా కనిపిస్తున్నాయి. నిర్మాణరంగంలో పనులు ప్రారంభం కావడంతో.. దాని అనుబంధ దుకాణాలైన సిమెంట్‌, హార్డ్‌వేర్‌, పెయింటింగ్స్‌ వంటివాటికి సైతం గిరాకీ పెరిగింది.

పెరిగిన బండ్ల కొనుగోళ్లు

లాక్‌డౌన్‌ తర్వాత గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతంలో వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. బైక్‌ల కొనుగోళ్లు మే నెలతో పోల్చితే జూన్‌లో నాలుగు రెట్లు పెరిగాయి. జూన్‌లో 4.5 లక్షల బైక్‌లను డెలివరీ చేసినట్టు హీరో సంస్థ తెలిపింది. కరోనాకు ముందు అమ్మకాలతో పోల్చితే ఇది 90 శాతం. ఇక రాష్ట్రంలో వరికోత యంత్రాలు, ట్రాక్టర్ల అమ్మకాలూ గత ఏడాది కన్నా పెరుగడం మరో విశేషం. మే 7వ తేదీ నుంచి జూన్‌ 30 వరకు రెండు నెలల్లో రాష్ట్రంలో 10,333 ట్రాక్టర్లు, వరికోత యంత్రాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. గత ఏడాది తొలి ఆరునెలల్లో మొత్తం రిజిస్ట్రేషన్లు 13,736 మాత్రమే. 

పథకాలతో పల్లెలకు నిధులు

లాక్‌డౌన్‌తో నగరాల్లో వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో దీని ప్రభావం పల్లెల్లో పెద్దగా కనిపించలేదు. ప్రధానమైన వ్యవసాయ పనులు, పంట అమ్మకాలు యథావిధిగా కొనసాగాయి. పంట కొనుగోళ్లు, రైతుబంధు, పింఛన్లు, ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా రూ.60 వేల కోట్లకుపైగా నిధులు పల్లెలకు చేరాయి. పల్లెల్లో క్యాష్‌ఫ్లో 30-40 శాతం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. దీనికితోడు దాదాపు అందరికీ పని దొరికింది. నెల కిందట దాదాపు 20 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఇప్పుడు 8 శాతానికి తగ్గింది. ఫలితంగా డబ్బు చేతికి వచ్చింది.

 ఎఫ్‌ఎంజీసీ అమ్మకాల్లో గ్రామీణ మార్కెట్‌ వాటా: 36%

మరో తొమ్మిది నెలల్లో వృద్ధి అంచనా 10%

లాక్‌డౌన్‌తో పనులన్నీ ఆగిపోయి ఆగమాగం అయినం. ఆంక్షల సడలింపుతో ఇప్పుడు నిర్మాణ పనులు మళ్లీ గాడినపడుతున్నాయి. కరోనాకు ముందున్నంత జోరు లేకపోయినా.. నాతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నా. నగరాల నుంచి ప్రజలు తిరిగి వస్తుండటంతో కూలీల కొరత తీరింది. 

- ఎండీ రఫీయుద్దీన్‌, ప్రైవేట్‌ గుత్తేదారు, దుద్దెడ, సిద్దిపేట జిల్లా 


logo