గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 11, 2020 , 01:31:39

పట్టా పుస్తకంతో ధాన్యం కొనుగోళ్లు

పట్టా పుస్తకంతో ధాన్యం కొనుగోళ్లు

  • రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • కంట్రోల్‌రూంకు వచ్చిన ఫిర్యాదుల పరిశీలన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులకు ఇబ్బందుల్లేకుండా పంటల కొనుగోలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి  తెలిపారు. రైతుల ఆధార్‌ వివరాలకు, పంట పండించిన గ్రామం వివరాల్లో తేడా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులు తమ పాస్‌బుక్‌ లేదా గ్రామంలో పంట పండించినట్టు స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి లేదా గ్రామ రెవెన్యూ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే కొనుగోళ్లు జరుపాలని అధికారులకు సూచించినట్టు పేర్కొన్నారు. ధాన్యం, మక్కజొన్న కొనుగోళ్ల సందర్భంగా కమిషనరేట్‌లోని కంట్రోల్‌రూంకు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. శుక్రవారం కంట్రోల్‌ రూంకు 130 ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వరకు  దాదాపు 52,388 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, 29,824 మెట్రిక్‌ టన్నుల మక్కజొన్నలు కొనుగోలు చేసినట్టు చెప్పారు. 


logo