సోమవారం 01 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:41:31

కరోనా కట్టడిలో తెలంగాణ భేష్‌

కరోనా కట్టడిలో తెలంగాణ భేష్‌

  • ప్రణాళికాబద్ధంగా చర్యలు.. మెరుగైన చికిత్సలు
  • సమృద్ధిగా పరీక్షల కిట్లు, పీపీఈ కిట్ల నిల్వలు
  • కట్టుదిట్టంగా కంటైన్మెంట్‌ ప్రాంతాల నిర్వహణ
  • తెలంగాణకు మరోసారి కేంద్ర ప్రభుత్వం కితాబు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రశంసల వర్షం కురిపించింది. రోగులకు సకాలంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి మెరుగైన చికిత్సను అందజేస్తున్నదని, ఇందుకోసం ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డును నిర్వహిస్తున్నదని కొనియాడింది. వ్యర్థాల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం పక్కాగా చేపడుతున్నదని, దవాఖానలు, కంటైన్మెంట్‌ జోన్లు, రాత్రి బసకేంద్రాల్లోని ప్రజలకు భోజన సదుపాయాల్లో ఎలాంటి లోటులేకుండా చూస్తున్నదని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ గురువారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు.

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం జిల్లాలవారీగా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నదని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ప్రకటించిన రెండ్రోజులకే కేంద్ర హోంశాఖ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హైదరాబాద్‌లోని దవాఖానలు, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్లు, వసతిగృహాలు, మార్కెట్లను కేంద్ర బృందం స్వయంగా పరిశీలించిందని, తెలంగాణ ప్రభుత్వం వద్ద తగినస్థాయిలో టెస్టు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నట్టు ఈ పరిశీలనలో తేలిందని పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతోపాటు కోలుకున్నవారిని ఇండ్లకు చేర్చేవరకు సర్కార్‌ ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నదని ప్రశంసించారు.  గాంధీ దవాఖానలో బాధితులు డిశ్చార్జి అయ్యేవరకు అన్ని ప్రొటోకాల్స్‌ పాటిస్తున్నారని, అక్కడ 93 శాతానికిపైగా కరోనా కేసులను పరిష్కరించినట్టు కేంద్ర బృందం గుర్తించిందని చెప్పారు.

రోగులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించడంతోపాటు చికిత్స పూర్తిచేసుకొన్న రోగులను ఆ దవాఖాన వాహనాల్లోనే ఇండ్లకు చేరుస్తున్నారని, హోం క్వారంటైన్‌లో ఉన్న రోగులకు 14 రోజులపాటు మొబైల్‌ ద్వారా సంక్షిప్త సందేశాల్ని పంపిస్తున్నారని ఆమె తెలిపారు. కింగ్‌కోఠి హాస్పిటల్‌లో కూడా అన్ని ప్రొటోకాల్స్‌ను పాటిస్తున్నారని, శాంపిల్‌ కలెక్షన్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నదని కితాబిచ్చారు. ప్రతి ఇంటినీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తున్నదని, ప్రజలకు నిత్యావసర వస్తువులన్నింటినీ ఇండ్లవద్దకే తీసుకెళ్లి అందజేస్తున్నదని ప్రశంసించారు. ఇందుకోసం ప్రజలతో కలిసి స్థానిక సంస్థలు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటుచేయడం మంచి ప్రయత్నమన్నారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘాను ముమ్మరంచేసి లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. 

కొవిడ్‌-19 డబ్లింగ్‌ రేటులో తెలంగాణకు రెండోస్థానం

కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యేందుకు అధిక సమయం పడుతున్న రాష్ర్టాల జాబితాలో గురువారం నాటికి తెలంగాణ రెండో స్థానానికి చేరింది. ఈ రేటు 40 రోజుల కంటే అధికంగా ఉన్న రాష్ర్టాల్లో ఛత్తీస్‌గఢ్‌ (89 రోజులు) మొదటిస్థానంలో ఉన్నది. తెలంగాణ (70 రోజులు), అసోం (59 రోజులు) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 

ఔషధ సరఫరాలపై సంతృప్తి

తెలంగాణలోని పలు డ్రగ్‌ కేంద్రాల ను, అక్కడ ఔషధ నిల్వలను, వాటి పం పిణీని కేంద్ర బృందం స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిందని పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. బస కేంద్రా ల్లో నిరుపేదలు, వలసకూలీలకు మంచి భోజనవసతి కల్పించడంతోపాటు వారికి అవసరమయ్యే ఇతర వస్తువులను అందజేస్తున్నారని, ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌ ద్వారా అవసరమయ్యేవారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారని, వృద్ధ, అనాథాశ్రమాల్లోని వారితోపాటు ట్రాన్స్‌జెండర్లకు మొబైల్‌ క్యాంటీన్ల ద్వారా భోజనం అందజేస్తున్నారని వివరించా రు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలను, నిర్ణీత దూరాన్ని కచ్చితంగా పాటిస్తున్నారని, ఈ విషయంలో అక్కడి కమ్యూనిటీ లీడర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.

  కొవిడ్‌-19 బాధితులకు మెరుగైన చికిత్సను అందించడంతోపాటు కోలుకున్న రోగులను ఇండ్లకు చేర్చేవరకు తెలంగాణ సర్కార్‌ ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నది. గాంధీ దవాఖానలో కరోనా బాధితులకు చికిత్స అందించడం మొదలుకొని వారు డిశ్చార్జి అయ్యేవరకు అన్ని ప్రొటోకాల్స్‌ను కట్టుదిట్టంగా పాటిస్తున్నారు. 93 శాతానికిపైగా కరోనా కేసులను పరిష్కరించారు.

- పుణ్య సలీల శ్రీవాస్తవ


logo