శనివారం 04 జూలై 2020
Telangana - May 30, 2020 , 02:09:11

గంగమ్మ తల్లికి చీరెసారె

గంగమ్మ తల్లికి చీరెసారె

  • చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం దంపతులు
  • ఎర్రవల్లి, మర్కూక్‌లో రైతువేదికలకు శంకుస్థాపన

హైదరాబాద్‌/ సిద్దిపేట, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలో కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొండపోచమ్మ ఆలయంలో చండీహోమం పూర్ణాహుతితో ప్రారంభమైన ఆయన పర్యటన సాయంత్రం మీడియా సమావేశంతో ముగిసింది. సీఎం కేసీఆర్‌ దంపతులు ఉదయం 7.48 గంటలకు కొండపోచమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు. రిత్వికులు ఆలయంలో ఉదయం 4.30 గంటలకే చండీయాగం ప్రారంభించారు. కేసీఆర్‌ దంపతులు.. రాష్ట్రమంత్రులు హరీశ్‌రావు, ఇంద్ర కరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

రైతు వేదికలకు భూమిపూజ

ఉదయం 9.35 గంటలకు సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి గ్రామానికి చేరుకొని రైతువేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రైతువేదికను కేసీఆర్‌ తన సొంతఖర్చులతో నిర్మిస్తున్నారు. ఉదయం 9.40కి మర్కూక్‌లో రైతువేదిక భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. 

సుదర్శనయాగం పూర్ణాహుతి

హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా 10.05 గంటలకు మర్కూక్‌కు చేరుకున్న త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామికి సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. అక్కడినుంచి మర్కూక్‌ పంప్‌హౌజ్‌కు చేరుకున్నారు. అక్కడ చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన సుదర్శనయాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. 

పంప్‌హౌజ్‌, మొదటిమోటర్‌ ప్రారంభం

సుదర్శనయాగం పూర్ణాహుతి అనంతరం సీఎం కేసీఆర్‌.. చినజీయర్‌స్వామితో కలిసి మర్కూక్‌ పంప్‌హౌజ్‌ను ప్రారంభించారు.  10.49 గంటలకు పంప్‌హౌజ్‌లో కంప్యూటర్‌పై సిచ్ఛాన్‌చేసి మొదటి మోటర్‌ను ప్రారంభించారు. నిమిషాల్లోనే గోదావరి జలాలు కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ఎగిరిదుంకాయి.

గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు 

మర్కూక్‌ పంప్‌హౌజ్‌ నుంచి చినజీయర్‌తో కలిసి సీఎం దంపతులు, ప్రజాప్రతినిధులు కొండపోచమ్మ రిజర్వాయర్‌ బండ్‌వద్దకు చేరుకున్నారు. గంగమ్మకు చీరెసారె సమర్పించి, పూజలు నిర్వహించారు. మళ్లీ మర్కూక్‌ పంప్‌హౌజ్‌కు వెళ్లి రెండోమోటర్‌ ప్రారంభించారు.

వరదరాజపురంలో ప్రత్యేక పూజలు

సీఎం కేసీఆర్‌, చినజీయర్‌స్వామి వరదరాజ్‌పూర్‌లోని వరదరాజస్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తిరిగి రిజర్వాయర్‌ బండ్‌ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ గంగమ్మకు పూజలుచేశారు. నీళ్లలోకి నాణేలు వేసి.. విజయసంకేతం చూపారు. రిజర్వాయర్‌లోకి ఎగిరి దుంకుతున్న జలాలను కొద్దిసేపు ఆనందంగా చూస్తూ ఉండిపోయారు. బండ్‌పై నేతలతో కలిసి తిరుగుతూ గోదావరి జలాలను చూస్తూ సంబురపడిపోయారు. వచ్చిన అతిథులతో కలిసి భోజనంచేసిన అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.


logo