మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 17:10:42

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి హరీశ్‌రావు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నదే తమ సంకల్పమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం దంతాన్‌పల్లి, సికింద్లాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నివసించేందుకు డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు చేపట్టామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అన్నారు. రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంట్‌, రుణమాఫీ, ధాన్యం కొనుగోలుతో పాటు ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏ ఒక్క రైతు కూడా తమ పొలాలు, భూములు అమ్ముకోవద్దన్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తున్నందున రాబోయే రోజుల్లో రైతే రాజు అవుతాడన్నారు. గుండపల్లి సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. హరితహారంలో గోమారం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని హరితహారం వందశాతం విజయవంతానికి కృషిచేయాలన్నారు. గోమారం గ్రామానికి విలేజ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు గాను జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గోమారంలో నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.

కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. దంతాన్‌పల్లిలో కొందరికి ఇళ్లు మంజూరు కాలేదని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. అర్హులైన వారందరికి తప్పకుండా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామనారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీలు పబ్బ రమేష్‌, శేషసాయిరెడ్డి, మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేష్‌, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్లు, డీపీవో హనోక్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.logo