సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:31:22

సీఎంగా జగన్‌ను తప్పించండి

సీఎంగా జగన్‌ను తప్పించండి

  • ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు
  • జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలన్నీ అబద్ధం
  • సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సీజేఐ ఎస్‌ఏ బాబ్డేకు రాసిన లేఖ తీవ్ర వివాదాస్పదమవుతున్నది. ఏకంగా జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం పదవినుంచి తప్పించేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు బుధవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వైస్‌ జగన్‌ వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థను అస్థిరపర్చేందుకు ప్రయత్నించారంటూ పిల్‌లో జీఎస్‌ మణి, ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌ అనే న్యాయవాదులు ఆరోపించారు. వైస్‌ జగన్‌ రాసిన లేఖ ఆధారంగా జిస్టిస్‌ రమణపై ఎలాంటి విచారణ చేపట్టవద్దని కోర్టును కోరారు. మరోవైపు ఏపీ సీఎం లేఖపై సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయవాదాలు మండిపడుతున్నారు.

జగన్‌ ఆరోపణలన్నీ అబద్ధం

జస్టిస్‌ ఎన్వీ రమణపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని పిల్‌లో పేర్కొన్నారు. రమణ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కుట్రపూరితంగా, దురుద్దేశంతో సీజేఐకి లేక రాశారని తెలిపారు. ఆ లేఖ ఆధారంగా జస్టిస్‌ రమణపై అంతర్గతం కానీ, దర్యాప్తు సంస్థల ద్వారాగానీ ఎలాంటి విచారణ చేపట్టకుండా స్టే ఇవ్వాలని కోరారు. తనపై 30 క్రిమినల్‌ కేసులున్నట్టు వైఎస్‌ జగన్‌ స్వయంగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని, అందువల్ల ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు వైఎస్‌ జగన్‌ అనర్హుడని పేర్కొన్నారు. సీజేఐకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడాన్ని పిటిషనర్లు ఆక్షేపించారు. న్యాయమూర్తిని అప్రతిష్టపాలు చేసేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. సిట్టింగ్‌ జడ్జిపై ఇలాంటి ఆరోపణలు చేస్తే మొత్తం న్యాయవ్యవస్థపైనే ప్రజలకు చెడు అభిప్రాయం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ ఆధిపత్యాన్ని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతనను, న్యాయమూర్తుల ప్రతిష్ఠను కాపాడాలని కోరారు. పిల్‌లో కేంద్ర హోంశాఖ, సీబీఐ, సీఎం వైస్‌ జగన్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రతివాదులగా చేర్చారు.

రమణపై జగన్‌ లేఖాస్త్రం

ఏపీ హైకోర్టును నియంత్రిస్తూ జస్టిస్‌ ఎన్వీ రమణ ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ప్రయోజనాలు కాపాడుతున్నారంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 6న సీజేఐ ఎస్‌ఏ బోబ్డేకు లేఖ రాశారు. ఆ లేఖను ఈ నెల 10న మీడియాకు విడుదల చేయటంతో తీవ్ర దుమారం రేగింది. ఏపీలో గత ప్రభుత్వ అవినీతిపై తన ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులన్నింటిపై హైకోర్టు స్టేలు ఇచ్చేలా జస్టిస్‌ రమణ హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. 


logo