బుధవారం 03 జూన్ 2020
Telangana - May 09, 2020 , 19:18:55

‘ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది’

‘ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది’

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంపట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా కట్టడికోసం, పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషివల్లే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని చెప్పారు. అలా అని ఏ ఒక్కరూ రిలాక్స్‌ అవ్వొద్దని సూచించారు. ప్రస్తుతం డాక్టర్లంటే సమాజంలో గౌరం పెరిగిందని చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా, వైద్యవిద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. 

నిన్నటివరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా వ్యాప్తి నివారణకు పనిచేసిందని, ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో మిగిలిన అన్ని శాఖలు వారివారి పనుల్లో నిమగ్నమవుతాయని చెప్పారు. అందువల్ల ప్రతీ ఉద్యోగి సెలవులు లేకుండా నిబద్ధతతో పనిచేయాలని ఆయన సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, క్లోరోక్విన్‌ టాబ్లెట్లు అందించామని తెలిపారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతంలో గర్భిణీలు ఉంటే కరోనా పరీక్షల చేయించుకోవాలని సూచించారు. కరోనా పరీక్షల విషయంలో ఐసీఎంఆర్‌ కొత్త నిబంధనలు జారీ చేసిందని, తక్కువ లక్షణాలు ఉన్నవారికి ఇంటివద్దే చికిత్స అందిచాలని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.


logo