బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:44

కొత్త భవనాలపై రాద్ధాంతమా?

కొత్త భవనాలపై రాద్ధాంతమా?

  • నూతన సచివాలయ భవనం అవసరమే
  • ఉస్మానియా దవాఖానకూ సహకరించాలి
  • ప్రతిపక్షాలకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచన

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సచివాలయం, ఉస్మానియా దవాఖాన నూతన భవనాల నిర్మాణాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే నూతన నిర్మాణాలపై కేసీఆర్‌ ప్రకటన చేశారని, ఇప్పటిలాగే అప్పుడూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని గుర్తుచేశారు. గత వానకాలంలో కౌన్సిల్‌ హాలులోకి మూడు అడుగుల మేర వర్షపు నీరు వచ్చిందన్నారు. కొత్త భవనాలు అవసరమేనని కౌన్సిల్‌ చైర్మన్‌గా తాను స్పష్టం చేస్తున్నానని చెప్పారు. సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలను అడ్డుకోవాలని భావిస్తున్న ప్రతిపక్షాలు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. 

యువనేతల్లో కేటీఆర్‌దే అగ్రస్థానం..

దేశంలోని యువనేతల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అగ్రస్థానంలో ఉంటారని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌ యువతరానికి కేటీఆర్‌లాంటి వారి అవసరం చాలా ఉన్నదన్నారు. చక్కటి భాష, మంచి విజన్‌ కేటీఆర్‌ సొంతమన్నారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున అంబులెన్స్‌లను సమకూర్చడం అభినందనీయమన్నారు. logo