మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 01:43:48

తెలంగాణ ‘దారి’లోకి ఏపీఎస్‌ఆర్టీసీ

తెలంగాణ ‘దారి’లోకి ఏపీఎస్‌ఆర్టీసీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర బస్సుల పునరుద్ధరణకు మరో అడుగుపడింది. తెలంగాణ ‘దారి’లోకి వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ ఎట్టకేలకు 1.61 లక్షల కిలోమీటర్ల మేర రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు పంపింది. గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణ పరిధిలో 2.64 లక్షల కిలోమీటర్ల వరకు 72 రూట్లలో బస్సులను తిప్పేది. కానీ టీఎస్‌ఆర్టీసీ మాత్రం ఏపీ పరిధిలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర 27 రూట్లలో మాత్రమే బస్సులు తిప్పేది. రెండు ఆర్టీసీలు ఉభయ రాష్ర్టాలలో సమాన కిలోమీటర్ల మేర బస్సులు నడపడమే న్యాయమని టీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదించింది. ఇందుకు ఒప్పుకోని ఏపీఎస్‌ఆర్టీసీ తాము 50వేల కిలోమీటర్ల మేర తగ్గించుకుంటామని, ఆ మేరకు టీఎస్‌ఆర్టీసీ తమ రాష్ట్రంలో పెంచుకోవాలని తెలిపింది. ఇందుకు తెలంగాణ ససేమిరా అనడంతో ఇన్నిరోజులూ చర్చలు కొలిక్కిరాలేదు. ఎట్టకేలకు టీఎస్‌ఆర్టీసీ కోరినట్టు 1.61 లక్షల కిలోమీటర్ల మేర మాత్రమే తెలంగాణ పరిధిలో బస్సులు తిప్పేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ ఓకే చెప్పింది. ఆ ప్రతిపాదనను పరిశీలించి టీఎస్‌ఆర్టీసీ అధికారులు తమ నిర్ణయాన్ని ఏపీ అధికారులకు తెలుపనున్నారు.


logo