బుధవారం 03 జూన్ 2020
Telangana - May 16, 2020 , 01:54:41

రెడ్‌జోన్లలో కరోనాయేతర వైద్యం

రెడ్‌జోన్లలో కరోనాయేతర వైద్యం

  • హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రెడ్‌జోన్లలో కరోనాయేతర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు హైకోర్టు సూచించింది. రెడ్‌జోన్లలో కూడా గర్భిణులు, గుండె, క్యాన్సర్‌ తదితర చికిత్సలకు అనుమతివ్వాలని, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నది. ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారిని పాసులు అడుగొద్దని పేర్కొన్న ధర్మాసనం.. నోడల్‌ అధికారులను ఏర్పాటుచేసి సమన్వయం చేయాలని సూచించింది. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతిచెందిన ఘటనపై న్యాయవాదులు కిశోర్‌కుమార్‌, పూజారి శ్రీనిత దాఖలుచేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఘటనపై విచారణ జరుగుతున్నదని, నివేదిక అందజేస్తామని హైకోర్టుకు తెలిపారు. ధర్మాసనం ఈ మేరకు విచారణను 19కి వాయిదావేసింది.

పీజీ మెడికల్‌  ఫీజుల కేసును మరో ధర్మాసనానికి బదిలీచేయండి 

రాష్ట్రంలోని అన్‌ఎయిడెడ్‌, నాన్‌ మైనార్టీ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజుల ఖరారు అంశంపై దాఖలైన పిటిషన్లను మరో ధర్మాసనానికి మార్చాలని టీఏఎఫ్‌ఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ పీ స్వరూప్‌రెడ్డి హైకోర్టులో శుక్రవారం మెమో దాఖలుచేశారు. దీనిపై జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రారావు, జస్టిస్‌ లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రారావు ధర్మాసనం నుంచి  మరో ధర్మాసనానికి మార్చాలని పిటిషనర్‌ కోరారు.


logo