ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 22:34:55

స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్

స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి : స్థానికులకు పరిశ్రమలో ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై మంగళవారం ఎన్టీపీసీలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేశ్‌ నేత అధ్యక్షతన మంత్రి అధికారులతో కలిసి సమీక్ష స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీపీసీలో స్థానికులకు ఉపాధి కల్పనపై మంత్రి చ‌ర్చించారు. అదేవిధంగా ఎరువుల కర్మాగారంలో భాగంగా ప్రభావితమైన ప్రాంతాల ప్రజల పునరావాసం అంశాలపై చర్చించారు. స్థానిక వనరులను వినియోగిస్తున్నందున పరిశ్రమ ద్వారా వెలువడే కాలుష్యం స్థానిక ప్రజలు ఇబ్బంది చెందుతారని, అవకాశాలు సైతం స్థానికులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఇందుకు అవసరమ‌య్యే నైపుణ్యంకు సంబంధించిన శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్థానికంగా నైపుణ్యం ఉన్న‌ యువత అందుబాటులో ఉన్నందున వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ శశాంక, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రఘవీర్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.