శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:30:14

కిరికిరిలుండవ్‌

కిరికిరిలుండవ్‌

  • ఏడు దశాబ్దాల దందాలకు ధరణితో అడ్డుకట్ట 
  • రక్షిత కౌలుదారుల రికార్డులతో చేసే అక్రమాలకు చెక్‌

‘1950 కన్నా ముందు ఈ భూమి మా తాతలదే. ఈ భూమికి మేమే వారసులం’ రక్షిత కౌలుదారు రికార్డులను చూపించి ఓ వ్యక్తి బెదిరింపు.. ‘ఇది మా నాయనలు సంపాదించింది. ఓనర్లం మేమే. అవతలి వ్యక్తులకు మ్యుటేషన్‌ చేయొద్దు’ రక్షిత కౌలుదారు రికార్డుల సాకుతో మరో వ్యక్తి ఫిర్యాదు. ఇదే అదనుగా కొందరు అధికారులు బెదిరింపులకు దిగి డబ్బు వసూలు చేయడం.. ‘ఇదంతా మనకెందుకు. కైంప్లెయింట్‌ చేసినోడికి, అధికారికి ఎంతో కొంత ఇచ్చేస్తే పోలే’ అంటూ డబ్బులిచ్చి మ్యుటేషన్‌ చేయించుకున్న అసలు యజమానులు ఎందరో ఉన్నారు. ధరణి రాకతో ఇట్లాంటి కిరికిరీలు ఇక కానరావు. తిరకాసులకు అవకాశమే లేదు.

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: రక్షిత కౌలుదారుల (ప్రొటెక్టెడ్‌ టెనెన్సీ) పేరుతో ఏడు దశాబ్దాలుగా సాగుతున్న భూదందాలకు ధరణి పోర్టల్‌తో అడ్డుకట్ట పడింది. 1950 సంవత్సరం కంటే ముందు రక్షిత కౌలుదారు కాలమ్‌లో నమోదైన పేర్లను పట్టుకొని.. ఇది మా తాతల భూమి అని చెప్పుకొంటూ భూకబ్జాలకు పాల్పడేవారి ఆటలు ఇక సాగవు. 1950 కంటే ముందు ఒక వ్యవసాయ భూమిపై మూడునుంచి ఆరేండ్లు రక్షిత కౌలుదారులుగా కబ్జాలో ఉంటూ వ్యవసాయం చేసుకునేవారి రక్షణ కోసం అప్పట్లో ప్రభుత్వం తెలంగాణ రక్షిత కౌలుదారుల చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం భూమిని ఓ కౌలుదారు సాగుచేసుకుంటుండగా.. ఇంకొకరి నుంచి ఎక్కువ కౌలు వస్తుందని మొదటి వ్యక్తినుంచి భూమిని తీసుకోకుండా ఉండేందుకు రక్షిత కౌలుదారు పేరుతో ఓ రికార్డు నమోదుచేశారు. రక్షిత కౌలుదారుగా ఉన్న వ్యక్తి పట్టాదారుడికి కౌలు చెల్లించకుంటే అతడిని కౌలునుంచి తప్పిస్తూ మరో వ్యక్తికి అవకాశం కల్పించే అధికారం అప్పట్లో తాసిల్దార్‌కు ఉండేది. కానీ, ఎక్కువ కౌలు ఆశతో పట్టాదార్‌ను తొలిగించే అధికారం ఎవరికీ లేదు. 50 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉంటే పట్టాదారుడి అనుమతి/అంగీకారంతో ఎక్కువకాలం ఉన్న కౌలుదారులకు యాజమాన్య హక్కులను కల్పిస్తూ గతంలో 38-ఈ సర్టిఫికెట్‌ను జారీచేశారు. కానీ, 38-ఈ సర్టిఫికెట్‌ లేకుండా, కేవలం రక్షిత కౌలుదారు రికార్డులో ఉన్న పేర్లతో నగర శివారు ప్రాంతాలతోపాటు పలు జిల్లా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జరిగిన భూదందాలు కోకొల్లలు. 

కొందరు అధికారులే సూత్రధారులు

ప్రొటెక్టెడ్‌ టెనెన్సీ రికార్డు తాసిల్దార్‌ పర్యవేక్షణలో ఉండేది. కాలక్రమంలో వాస్తవ పట్టాదార్‌ తన భూమిని ఇతరులకు విక్రయించినప్పుడు సమస్యలు ఉత్పన్నమయ్యేవి. కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్‌ చేసుకొని మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కొందరు రెవెన్యూ అధికారులు అసలు కథ మొదలుపెట్టేవారు. ప్రొటెక్టెడ్‌ టెనెన్సీ రికార్డుల్లో ఉన్న పేర్లను గుర్తించి స్థానిక పట్వారీల అండదండలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయించేవారు. 1950 కంటే ముందు ఈ భూమి మా తాతలదేనని కొందరు, మా తండ్రులదని కొందరు, ఈ భూమికి మేమే వారసులమని ఫిర్యాదులు చేసేవారు. దీంతో మ్యుటేషన్‌ ప్రక్రియకు బ్రేకులు పడేవి. అప్పుడు ఫిర్యాదుదారులకు, అధికారులకు ఎంతో కొంత ఇస్తేనే కొనుగోలుదారుడికి మ్యుటేషన్‌ చేసేవారు. లేదంటే రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన భూమి వివాదాలపాలయ్యేది. గతంలో ప్రొటెక్టెడ్‌ టెనెన్సీ రికార్డులో ఉన్న భూమిని మరొకరు కొని లే అవుట్‌ చేసి ప్లాట్లుగా విక్రయించిన తరువాత ఇంటి అనుమతులు రాకుండా ఎమ్మార్వో కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసేవారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు ఇప్పించేవారు. ఎంతో కొంత నగదు ఇస్తే తప్ప.. ప్లాట్లకు ఇంటి అనుమతులు వచ్చేవికాదు. లేదంటే అంతే సంగతులు. నగర శివారులోని మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలతోపాటు భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ భూబేరాలు చాలా జరిగేవి. 

ఇకనుంచి ఆటలు సాగవు 

రైతుల వద్ద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్‌ పట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఉంటే చాలు.. ధరణిలో క్రయవిక్రయాలు పారదర్శకంగా జరుగడంతోపాటు ఏకకాలంలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అవసరమైతే ల్యాండ్‌ కన్వర్షన్‌ జరుగుతుంది. అంటే ఒక భూమిపై ఒకేఒక్క పట్టాదార్‌ పేరు ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు భూములతోపాటు అనేక రకాల భూముల వివరాలను నోటిఫై చేసి ధరణిలో నమోదుచేశారు. తాసిల్దార్లు, ఆర్డీవోలు, గతంలో మాదిరిగా ఏదో తిరకాసు చూపి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల జారీని ఆపలేరని సీనియర్‌ రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. ప్రొటెక్టెడ్‌ టెనెన్సీ పేరుతో తాసిల్దార్‌ కార్యాలయాల్లో జరిగే అవినీతి దందాకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

సమీకృత భూరికార్డుల నిర్వహణ వ్యవస్థను తీసుకురావడం ద్వారా రైతుల కష్టాలను దూరం చేయడం అద్భుతం. సీఎం కేసీఆర్‌ రైతుబాంధవుడని నిరూపించుకున్నారు. భూములను కాపాడుకోవడానికి ధరణి పోర్టల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్కసారి వివరాలు అప్‌డేట్‌ అయితే నిశ్చింతగా ఉండొచ్చు. రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి. మార్చడానికి అవకాశమే లేదు.

- అరుణ్‌ అలిశెట్టి, ఖతార్‌ 

తెలంగాణవాసిగా గర్వపడుతున్నా..

దేశంలోనే మొదటిసారిగా ధరణి పోర్టల్‌ వంటి ఇంటిగ్రేటెడ్‌ వ్యవస్థను ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డిజిటలైజ్డ్‌ విధానాలతో భూలావాదేవీలు, రికార్డుల నమోదు, రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకేచోట జరుగడం బహుశా దేశంలోనే ఇదే మొదటిసారి. ఈ వ్యవస్థను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం తెలంగాణవాసిగా గర్వంగా ఉన్నది. 

- మహ్మద్‌ అష్ఫాక్‌ హుస్సేన్‌, సివిల్‌ ఇంజినీర్‌, ఖతార్‌ 

వివాదాలకు తావే ఉండదు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ఒక బృహత్తర కార్యక్రమం. వ్యవసాయ భూలావాదేవీలు, రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ నిమిషాల్లోనే పూర్తవడం, బ్యాంకు లావాదేవీల మాదిరిగా రికార్డులు అప్‌డేట్‌ కావడం అద్భుతం. ఇకపై కొనుగోళ్లు, అమ్మకాలు, పంపకాల సందర్భంగా వివాదాలకు ఆస్కారమే ఉండదు. ఈ విధానం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంది. 

- కృష్ణమోహన్‌ కేసా, బ్యాంకర్‌, ఖతార్‌