శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 02:40:29

బీజేపీలో రఘునందన్‌పై నిరసన సెగలు

బీజేపీలో రఘునందన్‌పై నిరసన సెగలు

ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గుర్తించడం లేదని ఆవేదన

మిరుదొడ్డి: ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తానెంతో కష్టపడ్డానని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎం రఘునందన్‌రావు తనను గుర్తించడం లేదని ఓ కార్యకర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ మేరకు సోమవారం ఆయన మిరుదొడ్డిలోని తాసిల్‌ కార్యాలయ సమీపంలో రోడ్డుపై నిరాహార దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన ధర్మారం నరహరి బీజేపీ కార్యకర్త. ఈయన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇటీవలి ఉప ఎన్నికల్లో నియోజకవర్గమంతా ప్రచారం నిర్వహించాడు. సొంతంగా బైక్‌లో పెట్రోల్‌ పోసుకొని ఊరూరు తిరిగాడు. అప్పటివరకు రఘునందన్‌రావు తనను పేరు పెట్టి పిలిచే వారని, ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వారని నరేశ్‌ చెప్తున్నాడు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన తీరులో మార్పు వచ్చిందన్నాడు. రఘునందన్‌రావు వద్దకు వెళ్తే తనను గుర్తుపట్టనట్టు, కనీస మర్యాద ఇవ్వకుండా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పలుమార్లు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయకుండా కట్‌ చేస్తున్నారని, ఎప్పుడో ఓసారి ఫోన్‌ మాట్లాడి.. ‘నీ వెవరు?, నీ పేరేమిటి?’ అని అడుగుతుండటంతో తీవ్ర మనస్తాపం చెంది దీక్షకు దిగాల్సి వచ్చిందని నరహరి తెలిపాడు. బీజేపీ మిరుదొడ్డి మండల అధ్యక్షుడు ఎల్ముల దేవరాజు అక్కడికి చేరుకొని ఎంత నచ్చజెప్పినా నరహరి వినకుండా గంటపాటు దీక్షను కొనసాగించాడు. ఆలోగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫోన్‌చేసి మాట్లాడటంతో ధర్మారం నరహరి తన దీక్షను విరమించాడు.

‘పావురాలగుట్ట’ వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్రహాగ్ని 

తిట్లు, శాపనార్ధాలతో 15 వేల కామెంట్లు l సోషల్‌ మీడియాలో నెటిజెన్ల బంతాట

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నేను సైన్స్‌ టీచర్‌ను.. యాక్షన్‌కు రియాక్షన్‌ ఉంటుందని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్‌రావుకు.. 24 గంటలు కూడా గడవకముందే రియాక్షన్‌ ఎలా ఉంటుందో రుచి చూపించారు వైఎస్సార్‌ అభిమానులు. సోషల్‌ మీడియా వేదికగా రఘునందన్‌ను ఆటాడుకున్నారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ చుక్కలు చూపించారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన రఘునందన్‌.. ‘వెనకటికి ఒకాయన పావురాలగుట్టలో పావురమైపోయిండు.. మీకు అదే గతి’ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకత్వంపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తోపాటు ఇతర సోషల్‌ మీడియా వేదికల ద్వారా రఘునందన్‌ను బంతాట ఆడుకున్నారు. ఒక్క రోజులోనే 15 వేల మంది కామెంట్లతో ఆయనపై విరుచుకుపడ్డారు. రఘునందన్‌ వ్యాఖ్యల వీడియో నెట్టింట్లో వైరల్‌ కావడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని వైఎస్‌ఆర్‌ అభిమానులు, వైసీపీ నేతలంతా కాషాయపార్టీ నేతపై కసితీర్చుకున్నారు. తమ అభిమాన, జనహృదయ నేతనే నిందిస్తావా? అంటూ తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. నీ రాజకీయం నువ్వు చేసుకో.. మా పెద్దాయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్‌' అని ట్రోల్‌ చేశారు. బండబూతులు తిట్టారు. రఘునందన్‌ వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం కూకట్‌పల్లిలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే..  బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు.


logo