సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 13:13:42

గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఆస్తిపన్ను పెంపు

గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఆస్తిపన్ను పెంపు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గ్రామాలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఆస్తిపన్ను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ప్రజాప్రతినిధులకు విధులు, బాధ్యతలను స్పష్టంగా చెబుతూ చట్టం తెచ్చినట్లు తెలిపారు. విధులు, బాధ్యతలు, సక్రమంగా నిర్వహించకపోతే ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా తప్పకుండా నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల వేతనాలు నిలుపుదల చేసైనా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 20 ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలకు కూడా ఐదేళ్లలో రూ. 40 లక్షలు వస్తాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో మంది దాతలు విరాళాలు ఇస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దమ్మన్నపేకు చెందిన కామిడి నర్సింహారెడ్డి రూ. 25 కోట్ల విరాళం ఇచ్చారని కొనియాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచుల పదవులు పోతాయన్నారు. గెలిచిన వాళ్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం అన్నారు. 

విద్యుత్‌ ఛార్జీలు పెంచక తప్పదు... 

విద్యుత్‌ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని సీఎం అన్నారు.పేదలకు భారం లేకుండా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతామన్నారు. పన్నులు చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు వర్తించేలా చూస్తామన్నారు. లే అవుట్‌ల అనుమతులు కలెక్టర్లకు తప్ప మరెవరికి లేదన్నారు. ఇంటి కొలతలు యజమానులే అందిస్తారన్నారు. ఇంటి యజమానులు అందించిన లెక్కల ప్రకారమే పన్నుల విధింపు ఉంటుందన్నారు. ప్రజలపై తమకు నమ్మకం ఉందన్నారు. వాళ్లు నిజాలు చెబుతారనే ఆ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. అసత్యపు లెక్కలు ఇచ్చిన వారికి 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. మొక్కలను పెంచే బాధ్యతను కూడా ప్రజాప్రతినిధులకు అప్పగించినట్లు తెలిపారు. ఓట్ల కోసం భయపడే పరిస్థితి తమలో లేదన్నారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉండేలా పాలన అందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.


logo