సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:00:34

8 వేల మంది టీచర్లకు పదోన్నతులు?

8 వేల మంది టీచర్లకు పదోన్నతులు?

  • కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ

నమస్తే తెలంగాణ, జనవరి 8 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో మొత్తంగా 8 వేల మందికి పదోన్నతులు దక్కే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖలో పదోన్నతులు కల్పించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. శాఖలవారీగా ఖాళీలెన్ని, ఎంత మందికి పదోన్నతులు దక్కే అవకాశమున్నది అన్న వివరాలను క్రోడీకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి షెడ్యూల్‌ విడుదల కాగానే పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటివరకున్న సమాచారం మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డులో 145 మందికి పదోన్నతులు కల్పించడానికి సైతం అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. జూనియర్‌ లెక్చరర్ల నుంచి ప్రిన్సిపాళ్లుగా 138, ప్రిన్సిపాల్‌ నుంచి జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారులుగా (డీఐఈవో) 2, డీఐఈవో నుంచి జేడీగా 1, డిప్యూటీ డీఐఈవోలుగా నలుగురికి పదోన్నతులు దక్కే అవకాశమున్నది. జూనియల్‌ లెక్చరర్‌ నుంచి డిగ్రీ లెక్చరర్లుగా 11 మంది, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌లో 124 మంది, కాలేజియేట్‌ కమిషనరేట్‌లో 30 మందికి పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు.

మున్సిపల్‌లో 164 మందికి ప్రమోషన్లు?

హైదరాబాద్‌, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రమోషన్ల కోసం రాష్ట్ర మున్సిపల్‌శాఖలో  164 మంది సీనియర్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను సిద్ధంచేశారు. దీనిపై అభ్యంతరాల  స్వీకరణకు ఆయా మున్సిపల్‌ కమిషనర్‌లకు సీడీఎంఏ అధికారులు పంపించారు. వీరిపై ఏసీబీ కేసులు, అవినీతి ఆరోపణలు, అనధికారికంగా విధులకు హాజరుకాకపోవడం వంటి వివరాలను ఇందులో పొందుపరిచారు. జాబితాపై అభ్యంతరాలకు వారం గడువు ఇచ్చారు.


logo