ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:12:04

విదేశాలకు తెలంగాణ పసుపు

విదేశాలకు తెలంగాణ పసుపు

  • మిర్చి, మామిడి ఉత్పత్తుల ఎగుమతులకు కూడా రాష్ట్రంలో క్లస్టర్లను ఏర్పాట్లు చేయండి
  • నీతి ఆయోగ్‌ సీఈవోకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన పసుపు, మిర్చి, మామిడిని విదేశాలకు ఎగుమతిచేసేందుకు క్లస్టర్స్‌ను ఏర్పాటుచేయాలని నీతి ఆయోగ్‌ను రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కోరారు. అందుకు కేంద్ర వాణిజ్యశాఖతో సమన్వయంచేయాలని విన్నవిస్తూ నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌కు లేఖ రాశారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో పసుపు, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో మిర్చి, రాష్ట్రవ్యాప్తంగా మామిడి ఉత్పత్తులు ప్రత్యేకతను సంతరించుకున్నాయని తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఈ క్లస్టర్లను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మేలు రకం పసుపు, మిర్చి, మామిడిని విదేశాల్లో ఎగుమతి చేసేందుకు కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలోని అగ్రికల్చర్‌ అండ్‌ ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీఇడీఏ), వరంగల్‌ స్పైస్‌బోర్డులు కలిసి అధ్యయనంచేసి నివేదికను సిద్ధంచేశాయన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ రూ.226.17 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు పంపిందని ఆయన వెల్లడించారు. ఎక్స్‌పోర్ట్‌ ఓరియంటెడ్‌ యూనిట్స్‌ క్లస్టర్స్‌ను ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటుచేయాలని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్న విషయాన్ని వినోద్‌కుమార్‌ గుర్తుచేశారు. అంతర్జాతీయస్థాయిలో మార్కెటింగ్‌, స్థానికంగా కార్యాలయాల నిర్వహణ, లాజిస్టిక్‌ రవాణా, ఉత్పత్తులను భద్రపరిచేందుకు గోడౌన్స్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్స్‌, పరిమితంగా ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం, ల్యాబొరేటరీల ఏర్పాటు వంటి అంశాలను ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు లేఖలో వివరించారు. తక్షణమే జోక్యం చేసుకొని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖతో సమన్వయంచేసి రాష్ట్రంలో ఎక్స్‌పోర్ట్‌ ఓరియంటెడ్‌ యూనిట్స్‌ క్లస్టర్స్‌ల ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు.


logo