శనివారం 06 జూన్ 2020
Telangana - May 20, 2020 , 01:56:51

తరలింపు ఆపండి

తరలింపు ఆపండి

  • శ్రీశైలం, సాగర్‌ జలాలపై ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం
  • ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడారని స్పష్టీకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రాజెక్టుల ద్వారా నీటి తరలింపును వెంటనే ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆ రాష్ట్ర జలవనరులశాఖను ఆదేశించింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం మంగళవారం ఏపీ జల వనరులశాఖ ఈఎన్సీకి లేఖ రాశారు. అయితే శ్రీశైలం జలాశయం నుంచి పది టీఎంసీల దాకా కృష్ణాజలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన జీవోపై మాత్రం బోర్డు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి తెలంగాణ ఫిర్యాదును ఆంధ్రప్రదేశ్‌కు.. ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదును తెలంగాణకు పంపి అభిప్రాయాలు కోరాలని నిర్ణయించింది. 

కృష్ణాబేసిన్‌ నుంచి మంగళవారంవరకు రెండు తెలుగు రాష్ర్టాల నీటి వినియోగం, వాటాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ తన వాటాకు మించి నీటిని వాడుకున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌ కుడి కాల్వ, శ్రీశైలం జలాశయానికి సంబంధించి హంద్రీనీవా సుజలస్రవంతితోపాటు ముచ్చుమర్రి లిఫ్టు ద్వారా నీటి విడుదలను వెంటనే ఆపేయాలని కృష్ణాబోర్డు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. రాష్ర్టాలు తమ వాటాకు లోబడి నీటిని వాడుకోవాలని, బోర్డు ఆదేశాలను అమలుచేయాలని, ఇతర రాష్ర్టాలు ఫిర్యాదుచేసేందుకు అవకాశం ఇవ్వకూడదని పరమేశం తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండురాష్ర్టాలు 920.405 టీఎంసీల కృష్ణాజలాలను వాడుకోగా.. ఇంకా 60.333 టీఎంసీలు వాడుకునేందుకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

ఇందులో మధ్యతరహా ప్రాజెక్టులు పోను శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో ఇంకా వాడుకునేందుకు 52.117 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే రెండు రాష్ర్టాలు ఏపీ- తెలంగాణ 66:34 నిష్పత్తిలో నీటిని వాడుకోవాల్సి ఉండగా, ఏపీ తన వాటా కంటే 0.272 టీఎంసీలు ఎక్కువ వాడుకుందని తెలిపారు. కాగా తెలంగాణకు ఇంకా 60.605 టీఎంసీల వాటా మిగిలి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల పరంగా చూస్తే... ఆంధ్రప్రదేశ్‌ తన వాటా కంటే 4.042 టీఎంసీలను అధికంగా వాడుకుందని, తెలంగాణకు ఇంకా 56.159 టీఎంసీలు వాడుకునేందుకు అర్హత ఉందని సభ్య కార్యదర్శి వివరించారు. లేఖతో పాటు రెండు రాష్ర్టాల నీటివినియోగ లెక్కలను జత చేశారు. 

రెండు టీఎంసీలకు ఏపీ ఇండెంట్‌

నాగార్జునసాగర్‌ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి కోసం రెండు టీఎంసీలు కావాలని ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీ సీ నారాయణరెడ్డి కృష్ణా బోర్డుకు మంగళవారం ఇండెంట్‌ సమర్పించారు. ముఖ్యంగా వరద సమయంలో వినియోగించిన జలాలపై కమిటీ వేసిన దరిమిలా 11 టీఎంసీలు ఏపీ వాడుకునేందుకు ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 20న బోర్డు రూపొందించిన నీటి లెక్కల ప్రకారం.. శ్రీశైలం, సాగర్‌ జలాశయాల్లో ఏపీకి ఇంకా 18 టీఎంసీల వాటా ఉందని పేర్కొన్నారు. ఇందులో 14.925 టీఎంసీలను వాడుకున్నందున ఇంకా 3 టీఎంసీల వాటా మిగిలి ఉందని ఈఎన్సీ తెలిపారు. అందులో 2 టీఎంసీలను కుడి కాల్వ కింద వాడుకునేందుకు అనుమతివ్వాలని లేఖలో కోరారు. కాగా ఈ లేఖను బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం తెలంగాణ నీటిపారుదల శాఖకు పంపారు. ఏపీ ఇండెంట్‌పై అభిప్రాయం చెప్పాలని కోరారు. 

తెలంగాణ ఫిర్యాదుపై స్పందించని కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణపై కృష్ణా నదీ యాజమాన్యబోర్డు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అపెక్స్‌ కౌన్సిల్‌.. బోర్డు సమావేశమంటూ తొలుత హడావుడి చేసినప్పటకీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మిన్నకుండిపోయింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తెలంగాణ ఫిర్యాదును ఆంధ్రప్రదేశ్‌కు.. ఏపీ ఫిర్యాదును తెలంగాణకు పంపి అభిప్రాయాలు కోరాలని నిర్ణయించింది. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పది టీఎంసీల దాకా కృష్ణాజలాల్ని పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో 203 జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డు చైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు తెలంగాణ ఫిర్యాదుపై ఏపీని వివరణ కోరడంతో పాటు కేంద్ర జల వనరుల శాఖకు సమాచారం ఇచ్చింది. రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న పరిణామాలపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు బోర్డు అధికారులు నివేదికను సమర్పించారు. కానీ ఇప్పటివరకు అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రం నుంచి ఆదేశాలు వస్తేగానీ తదుపరి చర్యలు తీసుకోరాదని బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌అయ్యర్‌ నిర్ణయించినట్టు సమాచారం. 

జలాశయం
ఏపీ వాడుకున్నది
తెలంగాణ వాడుకున్నది 
శ్రీశైలం
220.329
51.344
నాగార్జునసాగర్‌
349.061
148.806
తుంగభద్ర
78.169
5.930
జూరాల
-57.283
మధ్యతరహా ప్రాజెక్టులు
-9.483
మొత్తం
647.559
272.846

(అంకెలు టీఎంసీల్లో...)


logo