బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 01:36:35

ప్రగతి చిత్రాలు మావి.. చెవిలో పూలు వారివి

ప్రగతి చిత్రాలు మావి.. చెవిలో పూలు వారివి

  • టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను కాపీకొట్టిన బీజేపీ 
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో నాయకులనే కాదు.. మ్యానిఫెస్టోను కూడా బీజేపీ అరువు తెచ్చుకున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ నగరానికి ప్యాకేజీ అంటూ మరోసారి ప్రజల చెవుల్లో పూలు పెట్టిందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లుగా చేసిన అభివృద్ధినే జీహెచ్‌ఎంసీలో అధికారంలోకి వస్తే చేస్తామని బీజేపీ పేర్కొనడం ఆ పార్టీ సిగ్గుమాలినతనానికి నిదర్శనమన్నారు. బీజేపీ గురువారం విడుదలచేసిన మ్యానిఫెస్టోపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బీజేపీ సొంతం గా మ్యానిఫెస్టోను కూడా రూపొందించుకోలేని దుస్థితిలో ఉన్నదని చెప్పారు. టీఎస్‌ బీపాస్‌, వరద బాధితులకు సహాయం, కులవృత్తులకు ఉచిత కరెంట్‌, మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణం, మెట్రో కారిడార్‌ విస్తరణ, పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం, మూసీ డెవలప్‌మెంట్‌ ఫ్రంట్‌, నగరం నలువైపులా డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, భవన నిర్మాణ కార్మికులకు బీమా.. ఇలా బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అనేకం కేసీఆర్‌ సారధ్యంలో ఇప్పటికే కార్యరూపం దాల్చాయని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లుగా విజయవంతంగా కొనసాగిస్తున్న కార్యక్రమాలను ‘మక్కికి మక్కీ’గా బీజేపీ తన మ్యానిఫెస్టోలో పెట్టిందని ఆరోపించారు. బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న మాటలతోపాటు పెట్టిన ఫొటోలు కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చిత్రాలేనని పేర్కొన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం పూర్తిచేసిన మెట్రోరైల్‌ ప్రాజెక్టు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, టాయిలెట్ల నిర్మాణం, జవహర్‌నగర్‌ ప్రజలకు ఇబ్బందిని తొలగించే అక్కడి డంప్‌కోసం వేసిన గ్రీన్‌కవర్‌ కార్యక్రమం, మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ తరఫున మూసీ ఒడ్డున చేపట్టిన అభివృద్ధి, తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహిళా పోలీస్‌స్టేషన్‌, చార్మినార్‌ వద్ద చేపట్టిన పాదచారుల ప్రాజెక్టు ఫొటోలే కాదు.. చివరకు సీఎం కేసీఆర్‌ జీతం రెట్టింపు చేయడంతో సంతోష పడుతున్న పారిశుద్ధ్య కార్మికురాలి ఫొటోలతో బీజేపీ ఫోజులు కొట్టిందని ఎద్దేవాచేశారు. వారి మ్యానిఫెస్టోలో ఫొటోలు పెట్టిమరీ టీఆర్‌ఎస్‌ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరోసారి గుర్తుచేసిందని చెప్పారు. ‘నకల్‌ మార్నే కేలియే అఖల్‌ రహనా చాహియే’ అంటూ కాపీ కొట్టేందుకు సైతం తెలివి ఉండాలని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో సొంతంగా రాయలేని బీజేపీ.. రేపు నగరాభివృద్ధి ప్రణాళిలను కనీసమైనా ఆలోచించగలుగుతుందా? అని ప్రశ్నించారు. ప్రతీ ఆలోచన మాది.. మా ఆలోచనను.. మా ఆచరణను కాపీకొట్టిన మీరు అంతా మీ ఆలోచనే అంటే ఎలా అని నిలదీశారు.

చిచ్చుపెట్టే మార్పా?

మార్పు కోసం బీజేపీ అంటూ మ్యానిఫెస్టో మొదలుపెట్టిన ఆ పార్టీ ఏ మార్పు కోరుకుంటుందో ప్రజలకు చెప్పాలని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెట్టే మార్పా? విశ్వనగరాన్ని విద్వేషనగరంగా మార్చే మార్పా? అభివృద్ధికి పాతరేసి అరాచకానికి తెరలేపే మార్పా? వికాసాన్ని కాదని.. విధ్వంసాలు సృష్టించే మార్పా? సౌ‘భాగ్య’నగరాన్ని..అభాగ్యనగరంగా మార్చే మార్పా? విద్వేషాల కోసం..ఉద్యోగాలను పణంగా పెట్టే మార్పా? గ్లోబల్‌ సిటీలో మళ్లీ గోకుల్‌ చాట్‌ పేలుళ్ల మార్పా? యువత భవితను ప్రశ్నార్ధకం చేసే మార్పా? కూల్చివేతలు.. కర్ఫ్యూల కలకలం రేపే మార్పా? అని బీజేపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ మార్పు కోసం బీజేపీ పనిచేస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ప్రజలకు బీజేపీ మార్కుమార్పు ఏమాత్రం అవసరం లేదని.. నగర ప్రశాంతత, శాంతి చాలని హితవు పలికారు.

బీజేపీ మ్యానిఫెస్టోలో ఫొటోలు పెట్టిమరీ టీఆర్‌ఎస్‌ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరోసారి గుర్తుచేసింది. ‘నకల్‌ మార్నేకేలియే అఖల్‌ రహనా చాహియే’ అంటూ కాపీ కొట్టేందుకు సైతం తెలివి ఉండాలని మరోసారి రుజువుచేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోనే సొంతంగా రాయలేని బీజేపీ.. రేపు నగరాభివృద్ధికి ప్రణాళికలను ఏం రచిస్తుంది.

- మంత్రి కేటీఆర్‌

ఓటేస్తేనే కరోనా వ్యాక్సిన్‌ ఫ్రీనా!

బీజేపీకి ఓటేస్తే కరోనా వ్యాక్సిన్‌ ఫ్రీగా ఇస్తామంటూ బీజేపీ చేసిన హామీపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కరోనా సమయంలో వలస కార్మికుల నుంచి రైల్వే చార్జీలు వసూలుచేసిన ఘనత బీజేపీదేనని.. రేపు ఎన్నికల తర్వాత కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలుచేసే పార్టీ కూడా అని అన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలోని డొల్లతనాన్ని అసత్యాలను.. ఆచరణ సాధ్యం కానీ హామీలను ప్రజలు గమనించాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


logo