ఆదివారం 31 మే 2020
Telangana - May 14, 2020 , 02:08:18

కిసాన్‌ యూరియా

కిసాన్‌ యూరియా

  • రామగుండం ఫర్టిలైజర్స్‌లో జూన్‌ నుంచి ఉత్పత్తి
  • రైతన్నలకు ఇక తెలంగాణ ఎరువులు
  • 12.7 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
  • రాష్ర్టానికి తీరనున్న ఎరువుల కొరత 

హైదరాబాద్‌/ గోదావరిఖని/ఫెర్టిలైజర్‌ సిటీ, నమస్తే తెలంగాణ: నేలంత పరుచుకున్న పచ్చని పంట సిరులు. పుట్లకొద్దీ ధాన్యపు ఝరులు. రైతన్న మోముపై తరగని సంతోషం. కొంగొత్త ఆశలతో కొత్త బంగారులోకంలోకి దారులు.. తెలంగాణలో నేడు కనువిందు చేస్తున్న చిత్రమిది. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో అన్నపూర్ణగా మారిన తెలంగాణ తల్లి వైభవమిది. ఈ వైభవాన్ని మరింత స్వర్ణమయం చేసేందుకు, రైతు బతుకును మరింత పచ్చగా మార్చేందుకు మరో బృహత్తర కార్యం త్వరలో ఆవిష్కృతం కానున్నది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించిన రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) జూన్‌ 15న ప్రారంభం కానుంది. ఇటీవలే ట్రయల్న్‌ నిర్వహించారు. రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండరాదన్న ముందుచూపుతో సీఎం కేసీఆర్‌ చేసిన కృషి త్వరలోనే ఫలితాలు ఇవ్వనున్నది. ‘కిసాన్‌' పేరుతో యూరియా మార్కెట్లోకి రానున్నది.


విదేశీ సాంకేతికత

2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ గజ్వేల్‌లో శంకుస్థాపన చేసిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అమ్మోనియా ఉత్పత్తికి డెన్మార్క్‌ టెక్నాలజీని, యూరియా ఉత్పత్తికి ఇటలీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. 373 యంత్రాలను ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకొన్నారు. కూల్‌వాటర్‌, రా వాటర్‌, గ్యాస్‌ పనులు, స్విచ్‌యార్డ్‌, ఫిల్లింగ్‌ టవర్‌, బ్యాగింగ్‌ ప్లాంట్‌ పనులు పూర్తయ్యాయి. యూరియా తయారీలో కీలకమైన ప్రిల్లింగ్‌ టవర్‌ను 134 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. గ్యాస్‌ను మండించేందుకు 60 మీటర్ల ఎత్తులో ఫ్లేర్‌స్ట్రిక్‌ను నెలకొల్పారు. ఈ ప్లాంటుకు గ్యాస్‌ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మల్లవరం నుంచి అందిస్తున్నారు. దాదాపు 363.65 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్‌ ద్వారా రోజూ 2.2 మిలియన్‌ స్టాండ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ సరఫరా అవుతుంది. 

ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి 0.55 టీఎంసీల నీటిని ఈ కర్మాగారానికి సరఫరా చేస్తున్నారు. రోజూ 40.8 మిలియన్‌ లీటర్ల నీటిని వాడనున్నారు. ఫ్యాక్టరీకి అవసరమైన 40 మెగావాట్ల విద్యుత్‌ కోసం సొంతంగా ప్లాంట్‌ను నిర్మించారు. మరో 5 మెగావాట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో నుంచి తీసుకోవడానికి ఒప్పందం కుదిరింది. కర్మాగారానికి అవసరమైన కాంట్రాక్టు ఉద్యోగుల్లో 85 శాతం స్థానికులను నియమించాలని ఇక్కడి ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ కర్మాగారం నుంచి రోజుకు 500 లారీలు ఎరువులను తీసుకెళ్లేలా ఏర్పాట్లుచేశారు. రోడ్లు, విద్యుత్‌, మంచినీటి వసతి పనులు పూర్తయ్యాయి.logo