గురువారం 04 జూన్ 2020
Telangana - May 21, 2020 , 00:31:39

ప్రైవేటులోనూ కరోనా పరీక్షలు

ప్రైవేటులోనూ కరోనా పరీక్షలు

  • ఐసీఎమ్మార్‌ అనుమతించిన ల్యాబ్‌లు, దవాఖానల్లో   చికిత్సకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌లు, దవాఖానల్లో కొవిడ్‌-19 పరీక్షలు, చికిత్సలకు బుధవారం హైకోర్టు అనుమతించింది. హైదరాబాద్‌ నాచారానికి చెందిన గంటా జైకుమార్‌ దాఖాలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం.. డబ్బులు చెల్లించే స్థోమత ఉన్న పౌరులు ఐసీఎమ్మార్‌ గుర్తింపు పొందిన దవాఖానలు, ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకునేందుకు అనుమతించాలని సూచించింది. తమకు నచ్చిన దవాఖానలో పరీక్షలు, చికిత్స చేయించుకొనే హక్కు పౌరులకు ఉన్నదని పేర్కొన్నది. కరోనా చికిత్సచేసే వసతులు తమ వద్ద ఉంటే ప్రైవేటు దవాఖానలు గుర్తింపు కోరుతూ ఐసీఎమ్మార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఆయా దవాఖానల్లో డాక్టర్ల సంఖ్య, వసతులను వైద్యనిపుణులు పరిశీలించి అర్హత ఉన్న వాటికి అనుమతులు ఇవ్వాలని ఐసీఎమ్మార్‌ను ఆదేశించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఐసీఎమ్మార్‌ను ఆదేశించింది. ఐసీఎమ్మార్‌ జారీచేసే మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది. కొవిడ్‌-19 చికిత్సలకు సంబంధించి గుర్తింపు పొందిన ప్రైవేటు దవాఖానలు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు రోజువారీగా నివేదికలు అందజేయాలని ఆదేశించింది. logo