శనివారం 11 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:11:51

తరగతుల ప్రారంభంపై కేంద్రం తర్జనభర్జన

తరగతుల ప్రారంభంపై కేంద్రం తర్జనభర్జన

  • వైరస్‌ విజృంభణతో తల్లిదండ్రుల్లో భయం.. 
  • ఆన్‌లైన్‌ బోధనకు ప్రైవేటు సంస్థల మొగ్గు

కరోనాతో సహజీవనం తప్పని పరిస్థితుల్లో ఒక్కో రంగం అనేక జాగ్రత్తలతో తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలను తెరువటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు వైరస్‌ బారిన పడే అవకాశాలున్న భయంతో తల్లిదండ్రులు ఇప్పుడప్పుడే స్కూళ్లు తెరువొద్దని కోరుతున్నారు. మరోవైపు పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ విద్యాబోధనవైపు మొగ్గు చూపుతున్నప్పటికీ.. అదంత ఫలితాన్నిచ్చే అవకాశం లేదన్న అభిప్రాయామూ వ్యక్తమవుతున్నది. దీంతో ఏం చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యా సంవత్సరం ప్రారంభ సమయం దగ్గర పడుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో పాఠశాలలు, కళాశాలలు తెరువడంపై సందిగ్ధం కొనసాగుతున్నది. జూలైలో ఉన్నత పాఠశాలలు, ఆగస్టులో ప్రాథమిక పాఠశాలలు, డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు, ఇంజినీరింగ్‌, ఫార్మసీ తదితర వృత్తివిద్యాకాలేజీలు ప్రారంభమవుతాయని పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం సంకటస్థితిలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో యూజీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమిటీ ఆగస్టు, సెప్టెంబర్‌లో కాలేజీలలో తరగతులు ప్రారంభించవచ్చని.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని యూనివర్సిటీలకు సూచించింది. కేరళ, ఏపీ తదితర రాష్ట్రాల్లో కూడా జూలైలో స్కూళ్ల ప్రారంభంపై కసరత్తు జరుగుతున్నది. తెలంగాణలోనూ జూలై 15 తర్వాత స్కూళ్లు ప్రారంభిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, లాక్‌డౌన్‌ సడలింపులు, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో దేశంలో వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభిస్తే విద్యార్థులు వైరస్‌ బారినపడే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉన్నదని సర్వేలు చెప్తుండటంతో తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. 

ఆన్‌లైన్‌పై ఆసక్తిచూపని విద్యార్థులు

నాలుగు నెలల నుంచి ఫీజులు రాక, సిబ్బంది జీతాలు, భవనాల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తరగతుల ప్రారంభంవైపే మొగ్గుచూపుతున్నారు. తమ విద్యాసంస్థలో అడ్మిషన్లు పొందినవారికి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు ఇచ్చి ఆన్‌లైన్‌ పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిచూపడం లేదు. పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. క్లాస్‌రూమ్‌ బోధనకు ఆన్‌లైన్‌ బోధన ఎప్పటికీ ప్రత్యామ్నాం కాదని, అది పిల్లలకు అంత శ్రేయస్కరం కూడా కాదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం చొరువ తీసుకుని స్కూళ్లు తెరువడానికి అనుమతి ఇస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.


logo