శనివారం 04 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 20:01:56

ప్రైవేట్‌ ఆస్పత్రులు కర్తవ్యంగా భావించి చికిత్స అందించాలి : మంత్రి ఈటల

ప్రైవేట్‌ ఆస్పత్రులు కర్తవ్యంగా భావించి చికిత్స అందించాలి : మంత్రి ఈటల

హైదరాబాద్‌ : ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా కర్తవ్యంగా భావించి రోగులకు చికిత్స అందించాలన్నారు. తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గురువారం మంత్రి ఈటలను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలకు వైద్యం అందించడానికి సహకరించాలని అసోసియేషన్‌ ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రజలకు ధైర్యం కల్పించాలని కోరామన్నారు. 

కొందరు కరోనా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. కరోనా పాజిటివ్‌తో ఉన్నా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే హాస్పటల్‌లో ఉంచి చికిత్స అందించాలని చెప్పారు. కరోనా లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. ఐసీయూలో ఉన్న పేషెంట్లకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే చికిత్స అందించాలని తెలిపారు. పీపీఈ కిట్లు, మందుల వినియోగానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వసూలు చేయాలన్నారు. ఏది ఏమైనా ప్రజా వైద్యంలో రాజీపడేది లేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని అసోసియేషన్‌ విజ్ఞప్తి చేయగా త్వరలోనే పెండింగ్‌ బకాయిలను విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు.


logo