మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 02:14:41

ప్రైవేటులో తప్పుడు నిర్ధారణలు

ప్రైవేటులో తప్పుడు నిర్ధారణలు

  • కరోనా పరీక్షల్లో అవకతవకలు
  • డేటా నుంచి ఫలితాల వరకు గందరగోళం
  • తనిఖీల్లో బండారంబట్టబయలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారితో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను ప్రైవేటు ల్యాబ్‌లు సొమ్ముచేసుకుంటున్నాయి. ఐసీఎంఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను తుంగలతో తొక్కుతూ ఇష్టారీతిన వ్యాధి నిర్ధారణ చేస్తున్నాయి. ప్రైవేటులో కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఆయా ల్యాబ్‌లలో స్థితిగతులను నాలుగు బృందాలు తనిఖీచేశాయి. సీనియర్‌ మైక్రో బయాలజిస్టులు, అధికారులతో కూడిన నాలుగు బృందాలు 16 ప్రైవేటు ల్యాబొరేటరీలను పరిశీలించాయి. ఆయా ల్యాబ్‌లలో విస్తుపోయే అంశాలు ఈ బృందాల దృష్టికి వచ్చాయి. వైద్య విద్య సంచాలకులు, కాళోజీనారాయణరావు హెల్త్‌యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ఉన్న నిపుణుల కమిటీ ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందించింది. పలు ల్యాబుల్లో పీపీఈ కిట్లు లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఎలాంటి శిక్షణలేని వారు వ్యాధి నిర్ధారణ చేస్తున్నారని తెలిపింది. మరికొన్ని ల్యాబుబ్‌లు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను పాటించడం లేదని పేర్కొంది. పెద్ద మొత్తంలో పరీక్షలుచేస్తూ, సరైన పద్ధతులు పాటించకపోవడంవల్ల ఫలితాల్లో తేడా వస్తున్నట్టు తెలిపింది. సరైన  జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఎక్కువమంది పాజిటివ్‌ అని తేలే అవకాశం అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది. పలు ల్యాబులు ఐసీఎంఆర్‌, స్టేట్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన డేటాలో తేడా ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. ఒక ప్రధానమైన ల్యాబ్‌ 3,940 పరీక్షలు చేసినప్పటికీ 1,568 పరీక్షలు చేసినట్లు అప్‌లోడ్‌ చేశారని, ఇందులో 475 పాజిటివ్‌ వచ్చినట్లు చూపెట్టారని తెలిపింది. దీనివల్ల పాజిటివ్‌ రేటు ఎక్కువగా వస్తుందని పేర్కొంది. మరికొన్ని ల్యాబ్‌లలో ఇరుకైన గదుల్లో, అపరిశుభ్ర వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నట్లు గుర్తించారు. లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేయాలని ప్రభుత్వం సీరియస్‌గా చెప్పినప్పటికీ అనుమానంతో వచ్చినవారందరి వద్ద శాంపిళ్లు సేకరిస్తున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్‌ మిషన్ల పనితీరు, రిపోర్టుల్లో వాస్తవికత అనే కోణంలో  నిపుణుల కమిటీ తదుపరి తనిఖీలు చేయనున్నది. మార్గదర్శకాలను పాటించని ల్యాబులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ సూచించింది. ప్రైవేటు ల్యాబ్‌లలో క్వాలిటీ కంట్రోల్‌ టెస్టులను నిర్వహించాలని ఐసీఎంఆర్‌ గాంధీ దవాఖానకు సూచించిన విషయాన్ని నిపుణులు గుర్తుచేశారు.

ప్రైవేటుల్యాబులు అప్‌లోడ్‌ చేసిన తప్పుడు సమాచారం ఇలా ఉంది

  • ఐసీఎంఆర్‌లో అప్‌లోడ్‌ చేసిన పరీక్షలు : 9,577 పాజిటివ్‌ కేసులు : 2,076
  • స్టేట్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన పరీక్షలు : 6,733 పాజిటివ్‌ కేసులు : 2,836
  • ల్యాబు రికార్డుల ప్రకారం చేసిన పరీక్షలు : 12,700 పాజిటివ్‌ కేసులు : 3,571


logo