శనివారం 30 మే 2020
Telangana - Mar 28, 2020 , 17:51:31

మున్సిపల్​ కమిషనర్లతో ప్రిన్సిపల్​ సెక్రెటరీ టెలికాన్ఫరెన్స్

మున్సిపల్​ కమిషనర్లతో ప్రిన్సిపల్​ సెక్రెటరీ టెలికాన్ఫరెన్స్

హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపల్​ కమిషనర్లతో మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ  అర్వింద్​కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  సమావేశంలో పురపాలక శాఖ కమిషనర్​ డాక్టర్​ ఎన్​.సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై  మున్సిపల్​ కమిషనర్లకు మార్గనిర్దేశనం చేశారు.  పారిశుద్యం నిర్వహణ(శానిటేషన్​ మెయింటెనెన్స్​) విషయంలో ఎక్కడా కూడా లోపం రాకుండా చూడాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న మున్సిపల్​ నిధులను వినియోగించుకుంటూ మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్ల పరిధిలోని  ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని సూచించారు.  స్థానిక పోలీసు అధికారుల  సహకారంతో నిత్యవసర సరుకుల కొరత ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.  నిత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు, షాపులు, పెట్రోల్​ బంకుల తదితర ప్రాంతాల్లో సోషల్​ డిస్టెన్స్​ పాటించే విధంగా నిర్వహకులను సంప్రదించి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు.

పేదలు, దినసరి కూలీలకు నిత్యావసర సరుకుల కొరత రాకుండా చూడాలని, మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్ల పరిదిలో పనిచేస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాల వద్ద ప్రతిరోజు శానిటేషన్​ నిర్వహించి షోషల్​ డిస్టెన్స్​ పాటించే విధంగా చూడాలని కోరారు. గత నెల రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంతో పాటు వారి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కమిషనర్లను ఆదేశించారు.  ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్​రావు ఆదేశాల మేరకు హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ) విస్తీర్ణంలోని  ఐదు జిల్లాలు(రంగారెడ్డి, మేడ్చెల్​ మల్కాజ్​గిరి, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్​) పరిధిలో గల 36 మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన ల్యాండ్​ రెగ్యులరైజేషన్​ స్కీమ్​(ఎల్​ఆర్​ఎస్​) నిధులు రూ.181.50 కోట్లు విడుదల చేసినట్లు అర్వింద్​కుమార్​ వెల్లడించారు.


logo